శివ్వంపేట : గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంతో పాటు మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని గ్రామ పంచాయతీ కార్మికుల శివ్వంపేట మండల అధ్యక్షులు వెంకటేశ్ డిమాండ్ చేశారు. ఆయన ఆధ్వర్యంలో శివ్వంపేట ఎంపీడీవో కార్యాలయం వద్ద శుక్రవారం పంచాయతీ కార్మికులు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్మికుల సంఘం మండల అధ్యక్షులు వెంకటేశ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ప్రతినెల గ్రీన్ ఛానల్ ద్వారా 2025 జనవరి 1 నుంచి వేతనాలు చెల్లిస్తామని ప్రకటించిన విధంగా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎస్టీవోలతో నిలిచిపోయిన బకాయి వేతనాలు విడుదల చేయాలని, పంచాయతీల బ్యాంక్ ఖాతాపై ఫ్రీజింగ్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల భద్రత దృష్టిలో ఉంచుకొని ఒకపూట పని కల్పించాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, గ్రామ పంచాయతీ కార్మికులపై పంచాయతీ కార్యదర్శిల వేధింపులు ఆపాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం సీనియర్ అసిస్టెంట్ నరేందర్ రెడ్డికి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో స్వామి, వసంత, బాలకృష్ణ, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.