సిద్దిపేట, ఫిబ్రవరి 15 : దేశం గర్వించదగ్గ గొప్ప ఆధ్యాత్మికవేత్త, సంఘ సేవకుడు సంత్ సేవాలాల్ మహరాజ్ అని ఆర్థిక వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మం త్రి క్యాంప్ కార్యాలయంలో బుధవారం సేవాలాల్ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సేవాలాల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సేవాలాల్ మహరాజ్ సేవలను కొనియాడారు. సేవాలాల్ మహరాజ్ ప్రజల మేలు కోసం అనేక ఉద్యమాలు చేశారన్నారు.
రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సేవాలాల్ మహరాజ్ జయంతిని ప్రభు త్వం అధికారికంగా నిర్వహించడంతోపాటు గిరిజనుల రిజర్వేషన్లను 6శాతం నుంచి 10శాతానికి పెంచారన్నారు. 500 జనాభా దాటిన 2741 గిరిజన తండాలను, ఆదివాసీ గూడెలను పంచాయతీలుగా మార్చారన్నారు. ‘మా తండాల్లో, మా గూడేల్లో మా పాలన’ అనే అడవి బిడ్డల చిరకాల స్వప్నాన్ని సీఎం కేసీఆర్ నిజం చేశారన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3146 గిరిజన పంచాయతీలు ఉన్నాయన్నారు. నూతనంగా ఏర్పడ్డ ప్రతి పంచాయతీకి కార్యాలయ భవనం కోసం ప్రభు త్వం రూ.20 లక్షల చొప్పున కేటాయించిదన్నా రు. మద్యం షాపుల లైసెన్సుల్లో గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించిందన్నారు. గిరిజన సంక్షేమ శాఖ లో 1650 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్నారు. తండాలు, గూడేలకు 2500 కిలోమీటర్ల రహదారుల నిర్మాణానికి రూ.1385 కోట్లు మంజూరు చేసిందన్నారు.
దేశంలో ఎక్కడాలేనివిధంగా గిరిజనుల కోసం 183 గిరిజనుల పాఠశాలలను ఏర్పాటు చేసి 75140 మంది మంది విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో విద్యాబోధన జరుగుతున్నదని మంత్రి చెప్పారు. ఆదివాసీలు, బంజారాల ఆత్మగౌరవాన్ని చాటేలా హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన స్థలాలలను కేటాయించి ఆదివాసీ, బంజారా భవనాలను అద్భుతంగా నిర్మించిందని తెలిపారు. ఈ భవనాలను స్వయంగా సీఎం కేసీఆర్ ప్రారంభించారన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో రూ.2 కోట్ల వ్యయంతో చేపట్టిన బంజారా భవన్ పనులు మమ్మురంగా జరుగుతున్నాయన్నారు.
తెలంగాణ కుంభమేళాగా పిలిచే సామ్మక్క-సారలమ్మ జాతరను ప్రభుత్వం అధికారికం గా నిర్వహిస్తున్నదని గుర్తుచేశారు. జాతర కోసం ప్రభు త్వం ఇప్పటి దాకా రూ.354 కోట్లు ఖర్చు చేసిందన్నారు. నాగోబా, భౌరంపూర్, జంగుబాయి, నాంచారమ్మ జాతరలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదన్నారు. రానున్న నెలరోజు ల్లో ఆదివాసీ గిరిజనులకు పోడు భూములకు పట్టాలు అందించనున్నామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం గిరిజనుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతుంటే కాంగ్రెస్ పార్టీ మా త్రం గిరిజనులను ఓటు బ్యాంకుగా వాడుకొని మోసం చేస్తున్నదన్నారు.