మెదక్, జూన్ 7(నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లాలో గతేడాగి ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కురిసిన భారీ వర్షాలకు వరద ఉధృతితో నీటి వనరులకు తీవ్ర నష్టం జరిగింది. మెదక్ జిల్లాలో 118 చెరువులు, కుంటలు, చెక్‌డ్యామ్‌లు దెబ్బతిన్నాయి. మెదక్, హవేళీ ఘనపూర్, చేగుంట, రామాయంపేట మండలాల్లో ఎక్కువ నష్టం వాటిల్లింది. అప్పట్లో సీఎం రేవంత్‌రెడ్డి ఏరియల్ సర్వేచేశారు. తాత్కాలిక మరమ్మతులకు రూ.2 కోట్లు మంజూరు చేశారు. మరమ్మతులుకు నిధులు మంజూరు చేస్తామని ప్రకటించారు.
నీటిపారుదల శాఖ ఇంజినీరింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి మరమ్మతులకు రూ.34 కోట్లతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఇంత వరకు పైసా నిధులు మంజూరు చేయలేదు. నీటి వనరులు మరమ్మతులకు నోచుకోవడం లేదు. అనేక చెరువులు, చెక్‌డ్యామ్ శిథిలావస్థకు చేరాయి. దీంతో వర్షపు నీరు నిల్వ ఉండే పరిస్థితి లేదు. వానకాలం సమీపిస్తున్నా నీటివనరులకు మరమ్మతులు చేయకపోవడంతో సాగునీటికి ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. మెదక్ జిల్లాలో చిన్ననీటి వనరుల ద్వారా 1.05 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది.
గతేడాది భారీ వర్షాలకు మెదక్ జిల్లాలో చిన్న నీటివనరులైన చెరువులు,కుంటలు, చెక్‌డ్యామ్‌లు భారీగా దెబ్బతిన్నాయి. చెరువు కట్టలు కోతకు గురిఅయ్యాయి. మత్తడులు ధ్వంసం అయ్యాయి. చెక్‌డ్యామ్‌లకు ఇరువైపులా ఉన్న మట్టి కట్టలు తేగిపోయాయి. కొన్ని చెక్‌డ్యామ్‌లకు పగుళ్లు ఏర్పడ్డాయి. వానలు కురిస్తే వర్షపు నీరు నిల్వ ఉండే అవకాశం లేదు. వృథాగా వాగులు, వంకల ద్వారా వెళ్లిపోయే అవకాశం ఉంది. చిన్న నీటి వనరులకు మరమ్మతులు చేయకపోతే భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. చెక్‌డ్యామ్‌లు, కుంటలు గ్రామీణ ప్రాంతాల్లో భూగర్భ జలాల పెరుగుదలకు ప్రధాన ఆధారం.
వీటిలో వర్షపు నీరు నిల్వ ఉంటే బోర్లు, బావుల్లో నీటి మట్టాలు పెరిగే అవకాశం ఉంది. వానకాలం వచ్చినా వీటి మరమ్మతులకు మోక్షం కలగడం లేదు. మరమ్మతులు చేయకపోతే తాగు, సాగునీటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. వర్షపు నీటిని నిల్వ చేయకపోతే వానకాలం, యాసంగి సాగుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెదక్, హవేళీ ఘనపూర్ మండలాల్లో తీవ్రత ఎక్కువగా ఉంది. హవేళీ ఘనపూర్ సమీపంలో నక్కవాగు గేటు వద్ద ఉన్న చెక్‌డ్యామ్ మట్టి కట్టలు కొట్టుకుపోయినా నీటిపారుదల శాఖ అధికారులు మరమ్మతులు చేయడం లేదు.
రాయన్‌పల్లి ప్రాజెక్టు కట్ట మరమ్మతులు చేయలేదు. భారీ వర్షాలకు దెబ్బతిన్న రాయన్‌పల్లి ప్రాజెకు మరమ్మతులకు నీటిపారుదల శాఖ ఇంజినీరింగ్ అధికారులు రూ. 2.30కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. కానీ, ఇంతవరకు నిధులు మంజూరు కాలేదు. ప్రాజెక్టు కట్టకు, కాల్వలకు మరమ్మతులు చే యాల్సి ఉంది. మరమ్మతులు చేయకపోతే వర్షపు నీరు నిల్వ ఉండని పరిస్థితి ఉంది. కాంగ్రెస్ సర్కార్ నీటి వనరులపై నిర్లక్ష్యం వహిస్తుండడంతో భవిష్యత్‌లో భూగర్భ జలాలు అడుగంటి ఇబ్బందులు తప్పవని రైతు లు, నిపుణులు ఆందోళన చెందుతున్నారు.