నర్సాపూర్, జనవరి23 : నర్సాపూర్ మున్సిపాలిటీకి చెందిన పలువురు బీజేపీ నాయకులు శుక్రవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. నర్సాపూర్ పట్టణ బీజేపీ ఉపాధ్యక్షుడు డి.మహేందర్ గౌడ్, ట్రెజరర్ బుడ్డ ప్రశాంత్, పలువురు కార్యకర్తలు బీజేపీ పార్టీకి బైబై చెప్పారు. ఈ సందర్భంగా మహేందర్ గౌడ్ మాట్లాడుతూ నర్సాపూర్ రాజకీయం పార్టీ చేతుల్లో లేదని, కొంత మంది వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలు రాగానే కష్టపడే కార్యకర్తలను పక్కన బెట్టి డబ్బులు ఉన్న వారికే టికెట్లను ఇస్తున్నారని విమర్శించారు.
ప్రస్తుతం నర్సాపూర్ బీజేపీలో ఒక కుటుంబానికి మాత్రమే పెత్తనం ఇస్తున్నారని, ఒక కుటుంబమే రాజ్యమేలాలని చూస్తున్నారని మండిపడ్డారు. రిజర్వేషన్లు అనుకూలించకపోవడంతో డబ్బు ఉంది కదా అని ఎక్కడబడితే అక్కడ పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో మేము నిజాయితీగా ఉన్నా పార్టీ మాత్రం నీతినిజాయితీగా లేదని, అందుకే బీజేపీ పార్టీని వీడుతున్నామని వెల్లడించారు. రెండు మూడు రోజుల్లో మాజీ మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యే సునితాలక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరుతున్నట్లు వారు వెల్లడించారు. రాజీనామా చేసిన వారిలో శివ, శ్రీధర్, శ్యామ్, ప్రదీప్, సతీష్, గణేశ్, మాధవ్, స్వామి, గొల్ల రాజు, శావ్య, ఎస్. ప్రదీప్ తదితరులు ఉన్నారు.