చేర్యాల, సెప్టెంబర్ 27: భారీ వర్షాలకు సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలోని పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. చేర్యాల పెద్ద చెరువు, కుడి చెరువు మత్తడి పోస్తుండడంతో పట్టణంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. పలు ఇండ్లు, సెల్లార్లలోకి వరద చేరడంతో మోటర్లు పెట్టి నీటిని తొలిగించుకుంటున్నారు.గాంధీ సెంటర్ నుంచి ఆర్టీసీ బస్‌స్టేషన్ వరకు జాతీయ రహదారిపై మోకాలు లోతు నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
అంబేద్కర్ సర్కిల్ వద్ద అంగడి బజారులో వరద చేరడంతో చిరు వ్యాపారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. గాంధీ సెంటర్ నుంచి కడవేర్గు వైపుగా ఉన్న రోడ్డు మొత్తం నీట మునగడంతో చేర్యాల, నాగపురి రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి. తాడూరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో దానంపల్లి, కమలాయపల్లి, చిట్యాల తదితర గ్రామాలకు రవాణా సౌకర్యం నిలిచిపోయింది.
రాస్తారోకో చేసిన వరద బాధితులు
చేర్యాల పెద్ద చెరువు కట్ట కింది ప్రాంతంలోని 5 ,6, 7, 8 వార్డుల్లో ఇండ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పెద్ద చెరువు వద్ద మత్తడి నీటిని మళ్లించేందుకు నిర్మించిన సైడ్ వాల్‌ను కూల్చివేసి, వరద నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ బాధితులు చేర్యాలలోని జాతీయ రహదారిపై శనివారం రాస్తారోకో నిర్వహించారు.
తహసీల్దార్ దిలీప్‌నాయక్, సీఐ శ్రీను, ఎస్ఐ నవీన్,ఐబీ అధికారులు బాధితులతో కలిసి మత్తడిని, కాలనీలను పరిశీలించి కలెక్టర్‌కు వివరాలు తెలియజేశారు.మత్తడి మళ్లింపు కోసం నిర్మించిన గోడను తొలిగించేందుకు బాధితులు యత్నించడంతో ఉద్రిక్తత ఏర్పడింది.ఐబీ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తహసీల్దార్, సీఐ చొరవ తీసుకోవడంతో బాధితులు శాంతించారు.వరద కాలనీలతో పాటు పలు ప్రైవేటు పాఠశాల్లోకి చేరింది.