నారాయణఖేడ్, ఫిబ్రవరి 14: సంత్ సేవాలాల్ మహరాజ్ ఆశయాలను సాధించే దిశగా సీఎం కేసీఆర్ గిరిజనుల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం నారాయణఖేడ్‌లో గిరిజనులు నిర్వహించిన భారీర్యాలీ నిర్వహించారు. అనంతరం పట్టణంలోని తహసీల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం గిరిజనులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలనే ఉద్దేశంతో ఆరుశాతం ఉన్న రిజర్వేషన్లను 10 శాతానికి పెంచిందన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో 54 తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో పాటు 90 శాతం తండాలకు రోడ్లు ఏర్పాటు చేశామని, మిగతా తండాలకు సైతం రోడ్డు సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
మిషన్ భగీరథ ద్వారా అన్ని తండాలకు నీటిని సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. పలు తండాల్లో సేవాలాల్ మందిరాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంతో పాటు నారాయణఖేడ్ బంజారా భవన్ నిర్మాణానికి స్థలాన్ని కేటాయించామని, త్వరలో భవన నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. గిరిజనుల అభ్యున్నతి, తండాల అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తానని, గిరిజనులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. కొండాపూర్ ఆశ్రమ పీఠాధిపతి సంగ్రామ్ మహరాజ్ మాట్లాడుతూ సేవాలాల్ జయంతిని ఘనంగా జరుపుకోవాలని, గిరిజనులంతా సంఘటితంగా ఉండాలని సూచించారు. పృథ్వీరాజ్ చౌహాన్ నుంచి ఇప్పటి వరకు బంజారా సంస్కృతి సజీవంగా ఉందని, అతి పురాతనమైన బంజారా సంస్కృతిని పరిరక్షించేందుకు గిరిజనులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ లక్ష్మీబాయి రవీందర్‌నాయక్, బంజారా సేవాలాల్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్చౌహాన్, నాగల్గిద్ద జడ్పీటీసీ రాజురాథోడ్, మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్ ఆయా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
మాతాశిశు దవాఖాన పనుల పరిశీలన
నారాయణఖేడ్ ఏరియా దవాఖాన ఆవరణలో నిర్మిస్తున్న 50 పడకల మాతాశిశు దవాఖాన నిర్మాణ పనులను మంగళవారం ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, సంబంధిత డిప్యూటీ ఈఈ విల్సన్‌కు పనులు వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఎమ్మెల్యేవెంట ఆత్మ చైర్మన్ రాంసింగ్, నాయకులు రవీందర్‌నాయక్, అభిషేక్‌శెట్కార్, పార్శెట్టి సంగప్ప ఉన్నారు.