మద్దూరు(ధూళిమిట్ట), ఆగస్టు 23: సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలోని కూటిగల్-సోలిపూర్ గ్రామాల మధ్య ఉన్న రెండు కాజ్‌వేలు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న కాజ్‌వేలకు మరమ్మతులు చేయించడంలో అధికారులు విఫలమయ్యారు. వర్షాకాలం వస్తే ప్రయాణికులు సదరు కాజ్‌వేలపై ప్రయాణం చేయాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన దుస్థితి నెలకొన్నది. కొన్నేండ్ల క్రితం నిర్మించిన కాజ్‌వేలు దెబ్బతినడంతో పెద్దపెద్ద గుంతలు ఏర్పడ్డాయి.
ఈ గుంతల్లో వర్షపునీరు చేరడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. కాజ్‌వేల పక్క నుంచి వెళ్దామంటే సదరు రోడ్డు సైతం కోతకు గురైంది. వర్షాలు బాగా పడితే ఈ రెండు గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిస్థాయిలో నిలిచిపోతున్నాయి. గతంలో కాజ్‌వేల వద్ద పలువురు వాహనదారులు కిందపడి తీవ్రంగా గాయపడిన సంఘటనలు ఉన్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి కాజ్‌వేల స్థానంలో కల్వర్టులు నిర్మించాలని స్థానిక ప్రజ లు డిమాండ్ చేస్తున్నారు.