రామాయంపేట, జనవరి 30: మున్సిపల్ ఎన్నికల వేళ మెదక్నియోజకవర్గంలోని రామాయంపేటలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నేత చౌదరి సుప్రభాతరావు ఆపార్టీకి గుడ్‌బై చెప్పి బీఆర్ఎస్లో చేరారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్వగృహంలో మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, మెదక్ నియోజకవర్గ ఇన్చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి సమక్షంలో సుప్రభాతరావుతో పాటు మరో పదిమంది ముఖ్య నేతలు, తన అనుచరులు బీఆర్ఎస్లో చేరగా వారికి మాజీ మంత్రి హరీశ్‌రావు గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు.
కాంగ్రెస్ పాలనపై ప్రజల్లోనే కాదు ఆపార్టీ సొంత నాయకుల్లోనూ తీవ్ర అసంతృప్తి ఉన్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. రేవంత్‌రెడ్డి రెండేండ్ల పాలనలో ప్రజలకు చేసింది శూన్యమన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేక చేతులెత్తేశారని విమర్శించారు. కరుడుగట్టిన కాంగ్రెస్ వాది సుప్రభాతరావు లాంటి సీనియర్ నాయకుడు కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్లో చేరడం సంతోషకరమన్నారు.
సుప్రభాతరావు చేరికతో రామాయంపేటలో పార్టీ మరింత బలోపేతమవుతుందని, మున్సిపల్ ఎన్నికల్లో రామాయంపేటలో ఎగిరేది గులాబీజెండా అని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ను నమ్ముకుని వచ్చిన వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ పాలనలో మున్సిపల్ పట్టణ ప్రగతితో పట్టణాలు, మున్సిపాలిటీలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని గుర్తు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు సరైన గుర్తింపు లేదని, కేవలం గ్రూపు రాజకీయాలకే పరిమితమైందని సుప్రభాతరావు ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా అభివృద్ధి కేవలం బీఆర్ఎస్తోనే సాధ్యమైందని, కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, పద్మాదేవేందర్‌రెడ్డి నాయకత్వంపై నమ్మకంతోనే బీఆర్ఎస్లో చేరానని స్పష్టం చేశారు. పురపాలిక ఎన్నికల్లో రామాయంపేటలో గులాబీ జెండా ఎగురవేయడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సుప్రభాతరావుతో పాటు బీఆర్ఎస్లో చేరిన వారిలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దోమకొండ యాదగిరి, రాంకీ, వెంకటి ఉన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్, సీనియర్ నాయకులు పుట్టి యాదగిరి, బాదె చంద్రం, శ్రీకాంత్ సాగర్, ఎస్.కే.హైమద్, ఉమామహేశ్వర్, దోమకొండ శ్రీనువాస్ పాల్గొన్నారు.
– సుప్రభాతరావు