మెదక్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ) : మెదక్ జిల్లాలోని గిరిజన తండాల్లో పారిశుధ్యం అధ్వానంగా తయారైంది. ఏ తండాల్లో చూసినా మురుగు కాల్వలు శుభ్రం లేక ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. దీంతో తండాల్లో జ్వరాలు ప్రబలుతున్నాయి. మెదక్ జిల్లాలో 469 గ్రామ పంచాయతీలు ఉండగా, 63 గిరిజన తండాలు ఉన్నాయి. ఈ తండాల్లో ఎక్కువ మంది గిరిజనులు జ్వరపీడితులు ఉన్నారు. వాతావరణ పరిస్థితులు, శానిటైజేషన్ లోపంతో జిల్లాలో జ్వరాలు పెరుగుతున్నాయి. డెంగీ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా వంటి లక్షణాలతో ఎకువ మంది బాధపడుతున్నారు.
దోమల వ్యాప్తితో జ్వరాలు వస్తున్నాయి. అయినప్పటికీ దోమల నివారణకు క్షేత్ర స్థాయిలో అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. మెదక్ జిల్లాలోని కౌడిపల్లి, పాపన్నపేట, చిన్నశంకరంపేట, రామాయంపేట, డి.ధర్మారం మండలాల్లో జ్వ రాలు ఎకువగా వస్తున్నాయి. తండాలు, గ్రామాల్లో పదుల సంఖ్యతో విషజ్వరాల బారిన పడుతున్నారు. ఎకువ మంది బాధితులు ప్రైవేట్ దవాఖానల్లో చికిత్స చేయించుకుంటున్నారు. ఇదే అదునుగా భావించి ప్రైవేట్‌లో ఎకువ చార్జీలు వసూలు చేస్తున్నారు. డెంగీ వచ్చిన వారికి రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చు అవుతున్నది.
జిల్లాలో ఇప్పటివరకు 28 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఇవే కాకుండా ప్రైవేట్ దవాఖానల్లో కూడా పదుల సంఖ్యలో డెంగీ కేసులు నమోదవుతున్నాయి. ఈ వివరాలను వైద్యశాఖ సేకరించడం లేదు. ఇదిలా ఉండగా జిల్లాలో ఇప్పటి వరకు ఇద్దరు డెంగీతో మృ త్యువాతపడ్డారు. అయితే మలేరియా కేసులు ఏమీ నమోదు కాలేదు. వైరల్ ఫీవర్ కేసులు 2576 నమో దు కాగా, టైఫాయిడ్ 32 మందికి సోకిందని వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు.
మెదక్ జిల్లాలోని పల్లెలు, తండాల్లో దోమలు విజృంభిస్తున్నాయి. సాయంత్రం దోమలు ఇండ్లలోకి చేరుతున్నాయి. దీంతో ప్రజలు దోమల బారిన పడి జ్వరాలు సోకడమే కాకుండా డెంగీ బారిన పడుతున్నారు. దోమల నివారణకు చర్యలు తీసుకోవడం లేద ని, ఏ గ్రామంలో కూడా దోమల మందును పిచికారీ చేయడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.
ముఖ్యంగా గ్రామ పంచాయతీల్లో నిధుల కొరత వేధిస్తోంది. మెదక్ జిల్లాలో 469 గ్రామ పంచాయతీలు ఉండగా 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.5.68 కోట్లు రాగా, ఎస్ఎఫ్సీ రూ.5.30 కోట్లు వచ్చాయని డీపీవో యాదయ్య తెలిపారు. ఈ నిధులతో మల్టీ పర్పస్ వర్కర్ల జీతాల కోసం వెచ్చించడం జరిగిందన్నారు. ఎకడైనా డెంగీ కేసుల సంఖ్య ఎకువగా వస్తే ఒకటి, రెండు రోజులు వైద్యశాఖ అధికారులు, పంచాయతీ అధికారులు హడావిడి చేసి మళ్లీ పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇండ్ల మధ్య నీళ్లు నిల్వ ఉండటంతో అపరిశుభ్రతతో దోమలు పెరుగుతున్నాయి.
సంగారెడ్డి ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలోని పల్లెలు, తండాలు విషజ్వరాలతో వణుకుతున్నాయి. పారిశుధ్యలోపం, దోమల బెడదతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు విష జ్వరాల బారిన పడుతున్నారు. పట్టణాల్లో ప్రభుత్వ దవాఖానలు కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా డెంగీ కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. టైఫాయిడ్, డయేరియా, సాధారణ జ్వరాలు, జలుబు, దగ్గు సోకిన రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది.
గ్రామాలు, తండాల్లో డెంగీబారిన పడిన రోగులు చికిత్స కోసం ప్రైవేట్ దవాఖానల్లో చేరుతున్నారు. జిల్లాలో గత నెల, ఈనెల ఇప్పటివరకు గ్రామాలు, తండాల్లో 186 డెంగీ కేసులు నమోదయ్యాయి. వైద్యారోగ్యశాఖ పరిధిలోని పీహెచ్‌సీల్లో గతనెల 70 డెంగీ కేసులు నమోదు కాగా ఈనెల ఇప్పటి వరకు 116, అందోలు నియోజకవర్గంలోని తాలెల్మ పీహెచ్సీలో ఈనెల ఇప్పటి వరకు 30 డెంగీ కేసులు నమోదయ్యాయి. డెంగీతో పాటు జిల్లాలో టైఫాయిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.
గత నెల 356 టైఫాయిడ్ కేసులు నమోదు కాగా ఈనెలలో 108 కేసులు, జలుబు, దగ్గు, నిమోనియాకు సంబంధించి గతనెలలో 83 కేసులు నమోదు కాగా ఈనెల 65 కేసులు నమోదయ్యాయి. గతనెలలో 348, ఈనెలలో 210 డయేరియా కేసులు, వైద్య విధాన పరిషత్‌లోని దవాఖానల్లో గత నెల 21, ఈనెల 30 డెంగీ కేసులు నమోదయ్యాయి. డెంగీ బారిన పడిన రోగులకు పీహెచ్‌సీలతోపాటు వైద్య విధాన పరిషత్, సంగారెడ్డిలోని జనరల్ దవాఖానలో చికిత్స చేస్తున్నారు. సంగారెడ్డి జనరల్ దవాఖానలో డెంగీ రోగులకు చికిత్స చేసేందుకు ప్రత్యేకంగా ఒక వార్డు ఏర్పాటు చేశారు.
గజ్వేల్, ఆగస్టు 26 : వర్షాకాలం ప్రారంభం నుంచి గ్రామా ల్లో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ఈ సంవత్సరం ప్రభు త్వం పల్లెప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించకపోవడంతో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. దీంతో దోమల బెడదతో గ్రామాల్లో విషజ్వరాలతో ప్రజలు అల్లాడుతున్నారు. గతం లో కేసీఆర్ ప్రభుత్వం దోమల బెడదను నివారించేందుకు ముందస్తు ప్రణాళికతో పల్లెప్రగతి కార్యక్రమాన్ని చేపట్టింది.
పల్లెల్లో పరిశుభ్రమైన వాతావరణం ఉండడంతో దోమలను నివారించారు. ప్రస్తుతం దోమలతో గ్రామాల్లో ప్రజలు జ్వరాలతో బాధపడుతున్నారు. జ్వర బాధితులు రోజూ పీహెచ్సీను ఆశ్రయిస్తున్నారు. వారం పాటు జ్వరాలు తగ్గకపోవడం తో గజ్వేల్‌లోని జిల్లా దవాఖానకు చేరుకొని చికిత్స చేయించుకుంటున్నారు. గ్రామాల్లో జ్వరంతో బాధపడుతున్న వారి వివరాలను ఆరోగ్య సిబ్బంది సేకరిస్తున్నారు.
హుస్నాబాద్, ఆగస్టు 26: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ సర్కారు దవాఖానలో సాధారణ సమయాల్లో 100నుంచి 150 మంది ఓపీ నమోదు కాగా గడిచిన 15రోజులుగా రోజూ 300 నుంచి 350కి పైగా నమోదువుతోంది. ఇన్‌పేషెంట్ల సంఖ్య కూడా రికార్డు స్థాయిలో పెరిగింది. గతంలో 10నుంచి 20మంది ఇన్‌పేషెంట్లు మాత్రమే ఉండగా ఇటీవల ఈ సంఖ్య 30నుంచి 50వరకు పెరిగింది.
వైద్యులు అందుబాటులో ఉండి వైద్యసేవలు అందిస్తున్నప్పటికీ విషజ్వరాలు, ఇతర వ్యాధులకు సరిపడా మందులు లేవనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని అందుబాటులో ఉండగా మరికొన్ని మందులు బయట తెచ్చుకోవాల్సి వస్తోందని పలువురు రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం రెండు గంటల వరకు 316 మంది పేషెంట్లు దవాఖానకు రాగా సాయంత్రం వరకు మరో 40మంది రోగులు వచ్చి వైద్యం చేయించుకున్నారు. ఈరోజు దవాఖానకు వచ్చిన 316మంది రోగుల్లో 233 మంది రోగులు జ్వరం, తలనొప్పి, విరేచనాలతో బాధపడే వారు ఉన్నారు.