 
                                                            అక్కన్నపేట, అక్టోబర్ 30: తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకొనేందుకు అత్తగారి ఇంటి నుంచి భర్తతో కలిసి సంబురంగా బయలుదేరిన ఆమె, తల్లిగారి ఇంటికి చేరకముందే మార్గమధ్యలో దంపతులిద్దరూ వరద ప్రవాహంలో గల్లంతయ్యారు. ఈ ఘటన ఇరు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసుల వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రానికి చెందిన మ్యాక రాములు-ఉమా దంపతుల పెద్ద కుమార్తె కల్పనను హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండల కేంద్రానికి చెందిన ఇసంపల్లి ప్రణయ్‌కు ఇచ్చి రెండేండ్ల్ల క్రితం వివాహం జరిపించారు. ఈ దంపతులకు పిల్లలు లేరు. బుధవారం కల్పన పుట్టిన రోజు కావడంతో సాయంత్రం భర్త ప్రణయ్‌తో కలిసి బైక్‌పై భీమదేవరపల్లి నుంచి అక్కన్నపేటకు బయలుదేరారు.
ఈ క్రమంలో వర్షానికి మల్లారం వాగు దాటనిస్తులేదనే సమాచారంతో కొత్తకొండ, ధర్మారం, మల్లంపల్లి మీదుగా అక్కన్నపేటకు వస్తుండగా, మోత్కులపల్లి రోడ్డ్యాం వద్ద వరద ఉధృతి ప్రవాహంలో ముందుకు వెళ్లడంతో బైక్‌తో సహా ఇద్దరు కింద లోయలోకి పడిపోయారు. గురువారం ఉదయం పెద్దతండాకు చెందిన సక్రునాయక్ ద్విచక్రవాహనం వాగులోకి కొట్టుకువచ్చినట్లు కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు.

వాహన నంబర్ ప్లేట్ ఆధారంగా అడ్రస్‌ను తెలుసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సాయంత్రమే భీమదేవరపల్లి నుంచి అక్కన్నపేటకు బయలుదేరారని వారు చెప్పారు. గురువారం పోలీసులు, రెస్క్యూ టీం పెద్దతండా వాగులో గాలింపు చర్యలు చేపట్టారు.
గజ ఈతగాళ్ల సాయంతో మల్లంపల్లి ఊర చెరువులో సాయంత్రం వరకు గాలించినా వారిని గుర్తించలేకపోయారు. డ్రోన్ కెమెరా సాయంతో గాలింపు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. బుధవారం రాత్రి వరద ఉధృతికి కొట్టుకుపోయి కల్పన-ప్రణయ్ దంపతులు చనిపోయి ఉంటారని, కనీసం వారి మృతదేహాలను వెతికి ఇవ్వాలని బంధువులు, గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. హుస్నాబాద్ సీఐ శ్రీనివాస్, అక్కన్నపేట ఎస్సై గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి గురువారం ఘటనా స్థలాన్ని సందర్శించారు. ప్రమాదం జరిగిన స్థలంతో పాటు పెద్దతండా వాగును కలెక్టర్ పరిశీలించి బాధిత కుటుంబీకులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. దంపతుల జాడ దొరికే వరకు గాలింపు చర్యలు కొనసాగుతాయని హామీ ఇచ్చారు. కలెక్టర్ వెంట ఆర్డీవో రామ్మూర్తి, తహసీల్దార్ తదితరులు ఉన్నారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ ఘటనా స్థలిని పరిశీలించి వివరాలు సేకరించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
 
                            