జహీరాబాద్, ఏప్రిల్ 14: ఎండలు దంచికొడుతున్నాయి. రెండు, మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. మంగళవారం జిల్లాలోనే జహీరాబాద్లో 42.7 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రత నమోదైంది. కోహీర్ మండలంలోని దిగ్వాల్లో 42.4, కోహీర్ పట్టణంలో 41. 6, జహీరాబాద్ మండలంలోని మల్చెల్మాలో 41.6, అల్గోల్లో 41.3, న్యాల్కల్లో 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ తీవ్రత, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.ప్రస్తుతం 42.7 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు రానున్న రోజుల్లో 45 డిగ్రీల దాకా పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు ప్రకటించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
ఉదయం 9 గంటలు దాటిందంటే చాలు ఎండవేడికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మధ్యా హ్నం బయటకు రావడానికి జనం జంకుతున్నారు. ఫ్యాన్లు, ఏసీల వినియోగం పెరిగింది.విద్యుత్ వినియోగం పెరిగిపోవడంతో ట్రాన్ఫార్మర్లు ట్రిప్ అవుతున్నాయి. విద్యుత్ కోతలు విధిస్తుండడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వేసవి తాపా న్ని తీర్చుకునేందుకు ప్రజలు శీతల పానీయాలు, కూల్డ్రింక్స్, పండ్ల రసాలపైపు మొగ్గుచూపుతున్నారు.
ఎండల తీవ్రత వల్ల సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని ప్రధాన రోడ్డు మార్గాలు నిర్మానుష్యంగా మారుతున్నాయి. జహీరాబాద్ పట్టణంలో చాలామంది వ్యాపారులు దుకాణాల ఎదుట గ్రీన్షెడ్లు ఏర్పాటు చేసుకున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా పిల్ల లు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉదయం, సాయంత్ర బయట పనులు చేసుకోవాలని, అత్యవసరమైతే తప్పా బయటకు వెళ్లకూడదని చెబుతున్నారు. ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.