ముగిసిన వేసవి సెలవులు
నేటి నుంచి ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు పునఃప్రారంభం
స్టేషనరీ దుకాణాల్లో కొనుగోళ్ల సందడి
బడిబాట విజయవంతం..
సర్కార్ బడుల్లో పెరగనున్న విద్యార్థుల సంఖ్య
ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేసేందుకు విద్యాశాఖ చర్యలు
మెదక్ జిల్లాకు 6లక్షల 90వేలు అవసరం
ఇప్పటికే మూడు విడుతల్లో గోదాములకు చేరవేత
వేసవి సెలవులు ముగియడంతో నేటి నుంచి విద్యాసంస్థలు ప్రారంభకానున్నాయి. మొదటి రోజు పాఠశాలలకు వచ్చేందుకు విద్యార్థులు ఉత్సాహంగా ఉన్నారు. ప్రైవేటు స్కూళ్లలో చదివే తమ పిల్లలకు తల్లిదండ్రులు పాఠ్యపుస్తకాలు, డ్రెస్సులు కొనుగోలు చేశారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు ఉచితంగా అందజేసే పాఠ్యపుస్తకాలు గోదాములకు చేరుకుంటున్నాయి. మెదక్ జిల్లాలో మొత్తం 923 పాఠశాలలుండగా, సుమారు లక్షా 26 వేల మంది విద్యార్థులు ఉన్నారు. వీరందరికీ 6 లక్షల 90 వేల పుస్తకాలు అవసరమవుతాయి. ఇందుకోసం మూడు విడుతల్లో పుస్తకాలు జిల్లాకు చేరాయి. ఆరునుంచి పదో తరగతి వరకు ప్రతి పుస్తకంపై క్యూఆర్‌కోడ్ ముద్రించారు. నూతన విద్యా సంవత్సరంలో తొమ్మిది, పదో తరగతులకు ఆంగ్ల మాధ్యమంలో బోధన జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమం ద్వారా అనేక అభివృద్ధి పనులు చేపడుతుండగా, సర్కారీ స్కూళ్లు కొత్త హంగులు సంతరించుకొంటున్నాయి.
మెదక్ మున్సిపాలిటీ, జూన్ 12: నేటి నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. నిన్న, మొన్నటి వరకు ఆడుతూ పాడుతూ గడిపిన పిల్లలు నేటి నుంచి బ్యాగులేసుకుని ఉదయాన్నే టాటా..బైబై అంటూ బడికి వెళ్లే సమయం ఆసన్నమైంది. ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థులు ఎల్కేజీ చదువులకే వేలకొద్ది రూపాయలు సమర్పించుకోవాల్సి వస్తుంది. పుస్తకాలు, బ్యాగులు, పెన్నులు, పెన్సిళ్లు, యూనిఫామ్స్ తదితర వస్తువులు కొనాల్సి ఉంటుంది. తమ పిల్లలు బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు అన్నింటినీ భరిస్తూ కొనేస్తున్నారు. పేదల కష్టాలు గమనించిన సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు నడుంబిగించారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఆదేశాలు జారీ చేయడంతో ఉపాధ్యాయులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ర్యాంకులు సాధిస్తుండడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రభుత్వం పేద విద్యార్థులకు మెరుగైన విద్యనందించేందుకు వేలాది కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నది. ఈసారి 1 నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం పాఠశాలలు ప్రారంభిస్తున్నది. మన ఊరు-మన బడి కార్యక్రమంతో నిధులు మంజూరు చేసి పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నది.
ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు..
ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్పించడమే కాకుండా విద్యార్థులకు సన్న బియ్యంతో మధ్యాహ్న భోజన పథకం, దుస్తులు, పుస్తకాలు, ఉపకార వేతనాలు అందిస్తున్నారు. అర్హులైన ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. ఎన్నో సౌకర్యాలు కల్పిస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లోనే తమ పిల్లలను చేర్పించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయండంటూ ఉపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో అర్హులైన ఉపాధ్యాయులు బోధిస్తున్నరా అనే విషయాన్ని తల్లిదండ్రులు గమనించాల్సిన అవసరమున్నదని అవగాహన కల్పిస్తున్నా రు. బడిబాటతో ఈనెల 10 వరకు మెదక్ జిల్లావ్యాప్తంగా అన్ని తరగతుల్లో కలిపి 2,843 మందిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించారు.
సంగారెడ్డిలో..
వేసవి సెలవులు పూర్తి చేసుకుని బడుల పునఃప్రారంభానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. నేటి నుంచి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ప్రారంభించడానికి విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సంగారెడ్డి జిల్లాలో 1777 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ పాఠశాలలు 1351 కాగా, ప్రైవేటువి 426 ఉన్నాయి. ఈ విద్య సంవత్సరం నుంచి ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం ప్రారంభించి, పేద విద్యార్థులకు ఆంగ్ల బోధన అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకు ఉపాధ్యాయులకు ఇది వరకే శిక్షణా కార్యక్రమాలు పూర్తిచేశారు. మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి కార్యక్రమాన్ని తీసుకుని మొదటి విడతలో ఎంపిక చేసి న పాఠశాలలకు కొత్త రూపు ఇచ్చేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఆంగ్ల మాధ్యమంలో కొత్త పాఠాలు అందించనున్నారు. ఇటు మన ఊరు-మన బడిలో పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు.