చేర్యాల, సెప్టెంబర్ 30: స్వాతంత్య్రం వచ్చి 77 ఏండ్లు గడుస్తున్నా సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని ముస్త్యాలలో గ్రామ సర్పంచ్ పదవి ఎస్సీ రిజర్వేషన్ చేయలేదు. దీంతో గ్రామంలోని దళితులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ రిజర్వేషన్ ప్రకారం సర్పంచ్‌గా పోటీ చేసేందుకు ఇప్పటి వరకు దళితులకు అవకాశం రాలేదు.
గ్రామంలో 77 దళిత కుటుంబాలు, 500కు పైగా ఓటర్లు ఉన్నప్పటికీ ఎస్సీ రిజర్వేషన్ చేయకపోవడంపై గ్రామ దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన విక్రమ్ సొంటే మాట్లాడుతూ ‘ఓట్లు మావి, సీట్లు మీకా’ అనే ప్రశ్నకు రాజకీయ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను దళితులకు వర్తింపజేయాలని కోరారు. సర్పంచ్ పదవిని ఎస్సీకి రిజర్వేషన్ చేయని పక్షంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.