రామాయంపేట, జూలై 10: నారుమళ్లలో వడ్లను వెదజల్లె పద్దతిని (Veda Farming) ప్రతి రైతులు అలవర్చుకోవాలని రామాయంపేట వ్యవసాయ శాఖ డివిజన్ ఇన్చార్జి అధికారి రాజ్నారాయణ అన్నారు. రామాయంపేట మండలంతోపాటు పట్టణ శివారు, వివిధ గ్రామాలలోని వ్యవసాయ పంటల వద్దకు అధికారులు వెళ్లి వెదజల్లే పద్దతిపై రైతులకు అవగాహన కల్పించి పలు సూచనలు సలహాలిచ్చారు. రైతులందరూ ఇదే పద్దతిలో పంటలను వేసుకోవాలన్నారు. పంటలను విత్తుకునే ముందు వరి గింజలకు కొద్ది మోతాదులోనే రసాయనాలను కలపాలన్నారు. వెదజల్లే పద్దతి ద్వారా పంట నెలరోజుల ముందుగానే చేతికి వస్తుందన్నారు. వరి గింజలకు రసాయనాలను కలిపిన తర్వాతే వరిగింజలను నారుమడిలో చల్లాలన్నారు.దీంతో ఖర్చు తక్కువ దిగుబడి అధికంగా వస్తుందన్నారు. దీంతోపాటు ప్రతి పంటకోసారి పంటను మార్చాలన్నారు. ఒకే పంట వేస్తే దిగుబడి రాదని చెప్పారు. సీజనల్ వారీగా పంటలను మార్చాలని సూచించారు. రామాయంపేట వ్యవసాయ శాఖ కార్యాలయంతో పాటు ఫెస్టీసైడ్ దుకాణాలలో కూడా ఎరువులు, విత్తనాలు లభిస్తున్నాయని చెప్పారు. విత్తనాలు తీసుకునే రైతులు దుకాణాలలో కచ్చితంగా రసీదు పొందాలని స్పష్టం చేశారు. దుకాణాదారులు రైతులకు ప్రభుత్వ ధరలకే విక్రయాలు జరపాలన్నారు.
రైతులు తమ పంటలలో వెదజల్లేవారు ముందుగా వరిగింజలను పదిరోజుల పాటు నానబెట్టాలని చెప్పారు. మొలకలు రాగానే తమ వరి మడులలో వాటిని చల్లితే తొందరగా మడులలో నారుపెరుగుతుంది. నారును నాటు వేసే అవసరం లేకుండానే మడులలో నారు పెరిగి వరి పంటగా మారుతుందని తెలిపారు. దీంతో రైతులకు శ్రమ కూడా తగ్గుతుందని వెల్లడించారు. వరి పెరుగగానే కలుపు తీయాలని, అప్పుడు అందులో మొలచిన కలుపు మొక్కలను తీసేస్తే వరిపంట దిగుబడి బాగుంటుంది. దీనిని రైతులందరూ పాటిస్తే తక్కువ ఖర్చుతోపాటు ఎక్కువ దిగుబడి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ ఏఈవో సాయికృష్ణ, ప్రవీణ్, రాజు, దివ్య, వ్యవసాయ రైతులు పాల్గొన్నారు.