కొండపాక(కుకునూర్‌పల్లి),సెప్టెంబర్17: మనిషి జీవితంలో చేసిన మంచి పనులే శాశ్వతంగా నిలిచిపోతాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాకలోని సత్యసాయి సంజీవిని చైల్డ్ హార్ట్ కేర్ సెంటర్లో 196 మంది పిల్లలకు ఉచిత గుండె ఆపరేషన్లు చేసిన సందర్భంగా సత్యసాయి ట్రస్ట్ నిర్వహించిన గిఫ్ట్ ఆఫ్ లైఫ్ కార్యక్రమానికి ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, యాదవరెడ్డితో కలిసి హరీశ్‌రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన గుండె ఆపరేషన్ చేయించుకున్న చిన్నారులకు గిఫ్ట్ ఆఫ్ లైఫ్ సర్టిఫికెట్, కానుకను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సత్యసాయి సంజీవని దవాఖాన చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు.
ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా వైద్యం, వస తి, భోజనం, తిరిగి వెళ్లేందుకు బస్సు కిరాయి ఇవ్వడం గొప్ప విషయమన్నారు. పిల్లలు చిన్న వయస్సులోనే గుండెజబ్బులతో బాధపడుతూ చనిపోతున్నారని, ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నప్పుడు దవాఖానను ఇక్కడ ఏర్పాటు చేసేందుకు నా వంతు కృషి చేశానని తెలిపారు. నా విజ్ఞప్తి మేరకు ఇక్కడే సత్యసాయి సంజీవని దవాఖానను నెలకొల్పడం ఆనందంగా ఉందన్నారు. కాళేశ్వరం ద్వారా గోదావరి నీళ్లను రైతులకు అందించినప్పుడు ఎంత సంతోషం కలిగిందో, ఇక్కడ వైద్యం అందుకొని ఆరోగ్యంతో ఇంటికి వెళ్తున్న చిన్నారులను చూసినప్పుడు కూడా అంతే సంతోషం కలిగిందన్నారు.
సత్యసాయి సేవ లు దేశవ్యాప్తంగా అందడం పట్ల ఈ ప్రాంత నాయకుడిగా గర్వపడుతున్నానన్నారు. ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా 2లక్షల60వేల మంది చిన్నారులకు ఈ సమస్య ఏర్పడుతుందని, కేవలం 20శాతం మంది పిల్లలకు మాత్రమే సరైన వైద్యం దొరుకుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. గుండెజబ్బుతో కండ్లముందే పిల్లలు శ్వాసఆగి చనిపోతుంటే ఆ తల్లిదండ్రుల దుఃఖం మాటల్లో చెప్పరానిదన్నారు. త్వరలో దవాఖానకు అనుబంధంగా శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి మరిన్ని సేవలు అందించనున్న సత్యసాయి ట్రస్ట్, సంజీవని దవాఖానకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కేవీ రమణాచారి పెద్ద మనసుతో ఈ ప్రాంతంలో దవాఖానను ఏర్పాటు చేసేందుకు ఆనంద చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 10 ఎకరాల స్థలా న్ని ఉచితంగా అందించడం వారి పెద్ద మనస్సుకు నిదర్శనమన్నారు.
సంజీవని దవాఖాన ద్వారా చిన్నారులకు ఉచిత వైద్యసేవలు అందిస్తున్న ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాస్, చిన్నారులకు చికిత్స చేసిన వైద్యులను హరీశ్‌రావు సన్మానించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ 18నెలల క్రితం తన్నీరు హరీశ్‌రావు ఇచ్చిన ప్రోత్సాహంతో ఇక్కడ దవాఖానను ఏర్పాటు చేసేందుకు సంకల్పించామన్నారు. సంవత్సరంలో 196 మంది చిన్నారులకు ఉచిత గుండె ఆపరేషన్లు చేసి వారిని చిరంజీవులుగా తీర్చిదిద్దామన్నా రు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీవవాస్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్‌రావు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మచ్చ వేణుగోపాల్, అనంతుల ప్రశా ంత్, దేవీ రవీందర్, ర్యాగళ్ల దుర్గయ్య, శ్రీనివాస్, నూనె కుమార్ యాదవ్, సోమిరెడ్డి, బొద్దుల కనకయ్య, కోల సద్గుణ రవీందర్, బాల్‌చందర్‌గౌడ్, రాజు, రాజిరెడ్డి, శ్రీనివాస్, మల్లేశం, మహిపాల్ పాల్గొన్నారు.