సిద్దిపేట, జనవరి 5(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ ప్రభుత్వంలో పల్లెసీమలు నిరాదరణకు గురవుతున్నాయి. స్థానిక సంస్థల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎక్కడి సమస్యలు అక్కడనే ఉన్నాయి. ఏడాది కాలంగా గ్రామాలకు నిధులు లేవు. ప్రజాప్రతినిధులు లేరు.ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. గ్రామాల్లో చిన్న చిన్న పనులు చేయడానికి పంచాయతీ కార్యదర్శులు అప్పులు తెచ్చి చేస్తున్నారు. ఇక గ్రామాల భారం మోయలేమని పంచాయతీ కార్యదర్శులు మొత్తుకుంటున్నారు.
గ్రామాలకు నియమించిన ప్రత్యేకాధికారులు కానరావడం లేదు. ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా పంచాయతీ కార్యదర్శులు పరిస్థితి తయారైంది. గ్రామాలను పట్టించుకునే వారు కరువయ్యారు. బీఆర్ఎస్ హయాంలో పరిపాలనా సౌలభ్యం కోసం రెవెన్యూ, స్థానిక సంస్థల వ్యవహారాల పర్యవేక్షణకు వేర్వేరుగా అదనపు కలెక్టర్లను నియమించింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో వారి పర్యవేక్షణ అంతంత మాత్రంగానే మారింది. పాత మెదక్ జిల్లాలో 1,615 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కొత్తగా ఏర్పడిన సిద్దిపేట జిల్లాలో 499 జీపీలు, మెదక్ జిల్లాలో 469 జిపీలు, సంగారెడ్డి జిల్లాలో 647 జీపీలు ఉన్నాయి. అన్ని పంచాయతీలు ప్రస్తుతం నిధులలేమితో కొట్టుమిట్టాడుతున్నాయి.
సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో గ్రామాల పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. జిల్లా, మండల, గ్రామాల పాలక వర్గాల గడువు పూర్తయి ఏడాది కావస్తున్నది. గ్రామ పంచాయతీల పాలకవర్గం గడువు గత ఫిబ్రవరిలో ముగిసింది. గడువు ముగియగానే గ్రామాలకు ప్రత్యేకాధికారులను ప్రభుత్వం నియమించింది. వీరిని నియమించినా భారమంతా పంచాయతీ కార్యదర్శుల మీదనే పడుతున్నది.గ్రామాలకు నియమించిన ప్రత్యేకాధికారుల పర్యవేక్షణ కరువైంది. కనీసం వారికి కేటాయించిన గ్రామాలకు రావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. పర్యవేక్షణ లేక గ్రామాల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి.
తాము గ్రామాలకు ప్రత్యేకాధికారులం అని చెప్పి అటు గ్రామాలకు వెళ్లడం లేదు. ఇటు వారి సొంత శాఖలో డ్యూటీలు నిర్వహించడం లేదు. పూర్తిగా ఉద్యోగ బాధ్యతలను వదిలి సొంత వ్యాపారాల వైపు మొగ్గు చూపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నెలనెలా ప్రభుత్వ వేతనం తీసుకుంటూ తమ ఉద్యోగ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తలేరనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాలక్షేపం, సొంత వ్యాపారాలకే ప్రభుత్వ ఉద్యోగులు పరిమితం అవుతున్నారన్న విమర్శలు ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా బలంగా వినిపిస్తున్నాయి. ఆఫీసు సమయంలో సైతం చాలామంది అధికారులు కార్యాలయాల్లో ఉండడం లేదని తెలిసింది. తీసుకునేది ప్రభుత్వ జీతం…చేసేది ప్రైవేట్ వ్యాపారాలు ఇది ఉమ్మడి జిల్లాలోని కొన్ని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల తీరు ఉంది. గ్రామాలకు నియమించిన ప్రత్యేకాధికారులు రాకపోవడంతో ఆ భారమంతా పంచాయతీ కార్యదర్శులు మీదనే పడుతున్నది.
రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేయకపోవడంతో ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. జీపీ బ్యాంకు ఖాతాలు ఖాళీగా ఉన్నాయి. ప్రధానంగా గ్రామాలకు మూడు రకాల ఖాతాలు ఉంటాయి. వీటిలో ఒకటి ఆస్తి పన్ను జమ చేసుకునే ఖాతా.. గ్రామ పంచాయతీల్లో ఆస్తి పన్ను వసూలు చేసి ఆ ఖాతాలో జమ చేస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆస్తి పన్ను అంతంత మాత్రంగానే వసూలు అవుతున్నాయి. గ్రామాల ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. ఇక రెండో ఖాతా ఎస్ఎఫ్సీ ఉంటుంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రత్యేక నిధులను జమచేస్తారు.
కొన్ని నెలలుగా రూపాయి కూడా ఈ ప్రభుత్వం విడుదల చేయక పోవడంతో ఈ ఖాతా పూర్తిగా ఖాళీగానే ఉంది. మూడో ఖాతా ఆర్థ్ధిక సంఘం సంబంధించినది. దీనిలో కేంద్ర ప్రభుత్వం నేరుగా గ్రామ పంచాయతీలకు నిధులను జమ చేస్తుంది. గ్రామాల్లో ఉండే జనాభా ప్రతిపాదికన ఈ నిధులను జమ చేస్తారు. ప్రతి మూడు లేదా నాలుగు నెలలకు ఒక్కసారి నిధులు జమఅవుతాయి. వీటిని గ్రామాల్లో ప్రత్యేక పనులకు ఖర్చు చేసుకుంటారు. కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతినెలా పల్లెప్రగతి కింద నిధులను విడుదల చేసింది.ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని గ్రామాలు పల్లెప్రగతి ద్వారా అద్భుత ప్రగతిని సాధించాయి.
జిల్లాలోని అన్ని గ్రామాలు పురోగతి దశలో పయనించాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేసి అభివృద్ధి పథంలో నడిపించింది. పల్లె ప్రగతిలో ఎన్నో కార్యక్రమాలను చేపట్టింది. ప్రతినెలా ఉమ్మడి మెదక్ జిల్లాకు రూ.30 కోట్ల పైచిలుకు నిధులు వచ్చాయి. ఇవి గాకుండా గ్రామాల్లో పన్నుల ద్వారా ఇతరత్రా ఆదాయం వచ్చేది. ఈ నిధులతో గ్రామాలను అద్భుతంగా తీర్చిదిద్దారు. పల్లె ప్రగతి కింద విస్తృతంగా పారిశుధ్య కార్యక్రమాలను చేపట్టారు.ఫలితంగా గ్రామాలు శుభ్రంగా ఉండేవి.
ఆరోగ్య గ్రామాలుగా ఫరిఢవిల్లాయి.కేసీఆర్ ప్రభుత్వం ప్రతి గ్రామానికి జనాభా లెక్కల ప్రకారం అభివృద్ధి నిధులను ప్రతినెలా కేటాయించింది. ప్రతి ఊరికి డంపింగ్ యార్డు, హరిత హారంలో విరివిగా మొక్కలు నాటించింది. ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ను కొనిచ్చింది. తాగునీటి సమస్య లేకుండా ప్రతి ఇంటికీ నల్లా ద్వారా నీటిని అందించారు. పల్లెల సమగ్రాభివృద్ధికి ఇతోధికంగా కృషిచేయడంతో జాతీయ, రాష్ట్ర స్థాయిలో జిల్లాలోని అనేక గ్రామాలు అవార్డులు సాధించాయి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిధులను విడుదల చేయకపోవడంతో గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి కుంటుబడింది. సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారు. గ్రామ స్వరాజ్య లక్ష్యం దెబ్బతింటున్నది.
సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని ఏ గ్రామం చూసినా పారిశుధ్యం పడకేసింది. ఇదివరకు చేసిన బిల్లులు రాకపోవడంతో పాటు కొత్త పనులు పూర్తిగా లేవు. దీంతో గ్రామాల్లో ఎక్కడవేసిన గొంగళి అన్నట్లుగా తయారైంది. గ్రామాల్లో చిన్న చిన్న పనులు సైతం జరగడం లేదు. ప్రధానంగా గ్రామాల్లో విద్యుత్ దీపాలు, తాగునీటి సమస్యలు, పారిశుధ్య పనులు చేపట్టడానికి చిల్లి గవ్వ లేకపోవడంతో గ్రామాల్లో సమస్యలు పేరుకుపోతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పరిశ్రమలు ఉన్న గ్రామాల్లో కొంత ఆదాయం గ్రామాలకు వచ్చినా వాటిని వినియోగించకుండా ప్రభుత్వం ఫ్రీజ్ చేసింది. దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అధికారులు ఉన్నారు. ఆదాయ వనరులున్న పంచాయతీల్లోనే జీతాలు చెల్లించలేని పరిస్థితి ఉంటే, ఆదాయం లేని గ్రామాల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గ్రామాల్లో పనిచేసే పారిశుధ్య కార్మికులకు నెలల తరబడి జీతాలు రావడం లేదు. నెలనెలా జీతాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ సర్కార్ హామీని విస్మరించిందని పారిశుధ్య కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామాల్లో పారిశుధ్య బాగుండాలంటే వారికి సక్రమంగా జీతాలు ఇవ్వాలి కదా ..అలా ఇస్తేనే వారు పనులు సరిగ్గా చేస్తారు. నెలల తరబడి జీతాలు లేక పోతే వారు ఎలా పనిచేస్తారు. వారి కుటుంబాలను ఎలా పోషించుకుంటారు ..? ఒక్కసారి ప్రభుత్వం ఆలోచన చేయాలి. గ్రామాల్లో ఎక్కడికక్కడ చెత్త కుప్పలు కనిపిస్తున్నాయి. డ్రైనేజీల్లో చెత్త పేరుకుపోయింది. హరితహారం కింద నాటిన మొక్కలను పట్టించుకునే వారు కరువయ్యారు. డంపుయార్డులు నిరుపయోగంగా మారా యి. చెత్త నిర్వహణ, సేకరణ సరిగ్గా జరగడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు.