సిద్దిపేట, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): దేశానికి పట్టుకొమ్మలైన పల్లెల అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించింది. ఏడు నెలలుగా పల్లెలకు రూపాయి నిధులు విడుదల చేయకపోవడంతో ఇవ్వాళ గ్రామా ల్లో అభివృద్ధి కుంటుపడింది. చిన్నపాటి వ ర్షాలకు అంతర్గత వీధులు చెరువులను తలపిస్తున్నాయి. వీధులన్నీ చిత్తడిగా మారిపోయాయి. గ్రామాలను పట్టించుకున్న వారే కరువయ్యారు. వానకాలం కావడంతో పారిశుధ్యం పడగ విప్పుతున్నది. దోమలు వి జృంభిస్తున్నాయి. పల్లెలు జ్వరాలు బారిన పడ్డాయి. ప్రత్యేకాధికారుల పాలన పంచాయతీ కార్యదర్శులపైనే భారంపడటంతో వారు అప్పు తెచ్చి చేతనైన కాడికి పెట్టారు.
ఇక ముందు తాము అప్పులు తేలేమని, ఇలాఅయితే గ్రామాల్లో పనిచేయడం కష్టమ ని వారు అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూపాయి కూడా నిధులు విడుదల చేయ లేదు. కార్మికులకు నెలల తరపడి జీతాలు పెండింగ్లోనే ఉన్నాయి. మాజీ సర్పంచ్లు గ్రామాల్లో చేసిన పనులకు బిల్లులు రావాల్సి ఉన్నది. కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా తమకు బిల్లులు విడుదల చేయడం లేదని వారు వాపోతున్నారు. పల్లెలకు నిధుల విడుదల, గ్రామాల అభివృద్ధి, పారిశుధ్య కార్మికుల వేతనాలు, కార్యదర్శుల కష్టాలు, సర్పంచ్ల బకాయి బిల్లులను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు.
గ్రామ పాలక వర్గాలు ముగిసి ఏడు నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. నిధులు విడుదల చేయకుండా గ్రామాలను బాగు చేయాలంటే ఎలా .? అని క్షేత్రస్థాయి అధికారులు వాపోతున్నారు. వానకాలం కాబట్టి పారిశుధ్య పనులతోపాటు గ్రామాల్లో చిన్నచిన్న అవసరాలకు నిధులు అవసరం, ని ధులు లేకుండా తాము ముందుకు పోలేమ ని కార్యదర్శులు చెబుతున్నారు. ఇప్పటికే పలు మండలాల్లో నిధులు ఇవ్వకుండా తాము గ్రామాల్లో డ్యూటీలు చేయలేమని ఆయా మండల ఉన్నతాధికారులకు వినతి పత్రాలను సైతం అందజేశారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,615 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలో 499 జీపీ లు, మెదక్ జిల్లాలో 469 జీపీలు, సంగారెడ్డి జిల్లాలో 647 జీపీలు ఉన్నాయి.1 ఫిబ్రవరి 2024తో పాలక వర్గాల పదవీకాలం ముగిసింది. దీంతో ఆ రోజు నుంచి గ్రామా ల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతున్నది. పల్లెల్లో ఏ అభివృద్ధి చేయాలన్నా నిధులు అవసరం. గ్రామానికి ఒక ప్రత్యేకాధికారిని నియమించినా అతడు చుట్టపు చూపులా వచ్చిపోవడం తప్ప మరోటి లే దు. గ్రామాల్లో ఉండే పంచాయతీ కార్యదర్శులపైనే అధిక భారం పడుతున్నది.
స్వచ్ఛదనం-పచ్చదనం పేరిట ప్రభుత్వం పెట్టిన కార్యక్రమానికి ఒక్క రూపాయి బడ్జెట్ కూడా ఇవ్వలేదు. ఇప్పటికే పంచాయతీల్లో రూపాయి లేక ఇబ్బంది పడుతున్న కార్యదర్శులకు ఇది పెనుభారంగా మారింది. గ్రామాల్లో ఐదు రోజులపాటు స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమం చేశామా అంటే చేశాము అన్నట్లుగా జరుగుతున్నది. రూపాయి ఇవ్వకుండా కార్యక్రమాన్ని చేయమంటే ఎలా అని పలువురు కార్యదర్శులు వాపోతున్నారు.
ఇప్పటికే చిన్నచిన్న అవసరాలకు తోడు గ్రామాల్లో బోరుమోటర్లు, వీధిలైట్లు, పారిశుధ్య పనులకు జేబులో నుంచి పెట్టుకొని అప్పులపాలయ్యామని కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీరు పెట్టుకోండి తర్వాత మీ అకౌంట్లో జమ చేస్తామంటూ జిల్లా అధికారులు పంచాయతీ కార్యదర్శులపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఎలాగైనా స్వచ్ఛదనం -పచ్చదనం కార్యక్రమం పూర్తి చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు. దీంతో పంచాయతీ కార్యదర్శులు మానసిక వేదనకు గురవుతున్నారు.
ప్రభుత్వం గ్రామాలను పట్టించుకోకపోవడంతో రోజురోజుకూ జ్వరాల బారిన పడే ప్రజల సంఖ్య పెరుగుతోంది. డెంగీ, టైఫాయిడ్, ఒళ్లు నొప్పులు తదితర వాటితో జనాలు ఇబ్బంది పడుతున్నారు. గ్రామాల్లో గడ్డి విపరీతంగా పెరగడంతోపాటు లోపించిన పారిశుధ్యంతో పల్లెలు దర్శనమిస్తున్నాయి. వానకాలం రాగానే బీఆర్ఎస్ ప్రభుత్వం పల్లెప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించి అందుకు తగ్గట్టుగా నిధులు విడుదల చేసి గ్రామాలను శుభ్రంగా ఉం చింది. దీంతో గ్రామాలు శుభ్రంగా ఉండడంతో తక్కువ సంఖ్యలో మాత్రమే కేసులు నమోదయ్యాయి. ఇవ్వాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాలను పట్టించుకోవడం లేదు.
చాలా గ్రామాలు, తండాల్లోని ప్రజలు మంచం పడుతున్నారు. రోజురోజుకూ జ్వరా లు విజృంభిస్తున్నాయి. వీధులు అపరిశుభ్రంగా మారడంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. డెంగీ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఇటీవల డెంగీతో ఉమ్మడి మెదక్ జిల్లాలో పలువురు చనిపోయిన విషయం తెలిసిందే. కొన్ని గిరిజన తండాలు అయితే పూర్తిగా జ్వరాలతో వణికిపోతున్నాయి. తాగునీటి సరఫరాలో పైప్లైన్ లీకేజీలు, వాటర్ ట్యాంకులు అపరిశుభ్రంగా ఉండడంతో తాగునీరు కలుషితమవుతున్నది.