మునిపల్లి,ఏప్రిల్ 08: పరీక్షల వేళ సర్కార్ నిర్లక్ష్యంతో డిగ్రీ విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. డిగ్రీ పరీక్షలకు హాజరయ్యేందుకు సరైన రవాణా సౌకర్యం కల్పించకపోవడంతో అవస్థలు పడుతూ ఎగ్జామ్ సెంటర్లకు చేరుకోవాల్సి వచ్చింది. దీనిపై బుదేరా మహిళా డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీ ప్రిన్సిపాల్ బొల్ల మాధవిని ప్రశ్నించగా.. మా విద్యార్థులను మా ఇష్టమొచ్చినట్లు పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్తాం మీకేంటి అని నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం గమనార్హం.
మంగళవారం నుంచి డిగ్రీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మునిపల్లి మండలంలోని బుదేరా మహిళా డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీలో చదువుకునే విద్యార్థినులకు సదాశివపేటలో సెంటర్ పడింది. గత ప్రభుత్వంలో డిగ్రీ విద్యార్థినులను పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసేవారు. పరీక్ష ముగిసిన తర్వాత విద్యార్థినులను సురక్షితంగా హాస్టల్లో దింపేవారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం అడుగడుగునా నిర్లక్ష్యం కనిపిస్తూనే ఉంది. తాజాగా విద్యార్థినులను పరీక్షా కేంద్రాలకు తరలించడంలోనూ రెసిడెన్షియల్ కాలేజీ ప్రిన్సిపాల్ తనకేమీ పట్టనట్టుగా ఉన్నారు. దీంతో మొదటి రోజు పరీక్ష రాసేందుకు విద్యార్థినులు వివిధ మార్గాలను ఎంచుకుని అవస్థలు పడుతూ వెళ్లాల్సి వచ్చింది.
పరీక్షా కేంద్రానికి తరలించేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయకపోవడంతో విద్యార్థినులకు తిప్పలు తప్పలేదు. ఆర్టీసీ బస్సులు సమయానికి లేకపోవడంతో ప్రైవేటు వాహనాలు, ఆటోల్లో ఎగ్జామ్ సెంటర్‌కు వెళ్లారు. దీనిపై ప్రిన్సిపాల్ మాధవిని ప్రశ్నించగా.. మాకు ఎలా కన్వీనెంట్ ఉంటే అలా విద్యార్థులను పంపిస్తామంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. అయినా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఉంది కాబట్టి.. పల్లె వెలుగు బస్సుల్లో ఉచితంగానే వెళ్లవచ్చని చెప్పుకొచ్చారు. ప్రిన్సిపాల్ తీరుపై స్థానికులు, విద్యార్థినుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా, సరైన రక్షణ లేకుండా విద్యార్థినులను ఆటోల్లో పరీక్షా కేంద్రాలకు ఎలా పంపిస్తారంటూ నిలదీస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి బుదేరా మహిళా డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీ ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.