మునిపల్లి, అక్టోబర్ 30: సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని బుధేరా మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలను (Gurukula Degree College) రాష్ట్రంలోనే ఆదర్శ డిగ్రీ కళాశాలగా మారుస్తానని రెండు నెలల క్రితం మంత్రి దామోదర్ రాజనర్సింహ విద్యార్థులకు మాటిచ్చారు. ఆదర్శం మాట దెవుడెరుగు.. కళాశాలలో నెలకొన్న సమస్యలతో అధ్వానంగా తయారైంది. రెసిడెన్షియల్ కాలేజీలో విద్యార్థుల తాగు నీటి సమస్యతో సతమతమవుతున్నారు. 450 మంది విద్యార్థులను గురుకుల కాలేజీలో ఒక్క బోరు లేకపోవడం సిగ్గుచేటు. గురుకుల కళాశాలలపై సర్కార్ నిర్లక్ష్యానికి ఇదే నిదర్శనమని స్థానికులు విమర్శిస్తున్నారు.
ఉదయం అరటిపండు, బిస్కెట్స్..
కాలేజీలో గత మూడు రోజులుగా మంచి నీటి సమస్య నెలకొన్నది. నీటి సరఫరా నిలిచిపోవడంతో విద్యార్థులకు ఉదయం టిఫిన్‌కి బదులు అరటిపండు, బిస్కెట్లతో సరిపెడుతున్నారు. మధ్యాహ్నం వరకు గ్రామపంచాయతీ ట్యాంకర్‌తో నీళ్లు సర్దుబాటు చేసుకొని విద్యార్థులకు భోజనం ఏర్పాటు చేస్తున్నారు. మహిళా డిగ్రీ కళాశాల ప్రారంభం నాటి నుంచి ఎన్నడూ ఇలాంటి పరిస్థితి రాలేదని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. నీళ్ల సమస్య అధికంగా ఉండడంతో కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లలను ఇండ్లకు తీసుకెళ్తున్నట్టు సమాచారం.

జిల్లా కలెక్టర్ స్పదించాలి..
మూడు రోజుల నుంచి నీళ్లు లేక అవస్థలు పడుతున్నామని, తమ సమస్యలు ఎవరికీ పట్టడం లేదా అని కళాశాల విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి కాలేజీలో నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.