జహీరాబాద్, మార్చి 6 : గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించకపోవడంతో అభివృద్ధి పనులు సమస్యలు పరిష్కరించేందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని మొగుడంపల్లి మండల గ్రామ పంచాయతీ కార్యదర్శులు అన్నారు. గురువారం మండల కేంద్రమైన మొగుడంపల్లి ఎంపీడీవో మహేష్ కు గ్రామ పంచాయతీలకు వెంటనే నిధులను విడుదల చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యదర్శులు మాట్లాడుతూ గత ఆగస్టు మాసం నుంచి ట్రెజరీకి పంపిన చెక్కులకు సంబంధించి పంచాయతీలకు నిధులు విడుదల కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందన్నారు.
గ్రామాల్లో నెలకొన్న సమస్యలతో పాటు అభివృద్ధి పనులను చేపట్టేందుకు అవకాశం లేకుండా పోతుందన్నారు. ముఖ్యంగా గ్రామాల్లో ప్రతిరోజు ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించేందుకు ఉపయోగించే ట్రాక్టర్కు డీజిల్ అవసరం ఉంటుందన్నారు. డబ్బులు సకాలంలో చెల్లించకపోవడంతో పెట్రోల్ బంక్ యజమానులు డీజిల్ ఇవ్వడం లేదన్నారు. పంచాయతీకి అవసరమయ్యే వస్తువు సామగ్రిని సమకూర్చేందుకు అవకాశం లేకుండా పోతుందని వాపోయారు. వీధిలైట్లు, పారిశుధ్యం, పైప్ లైన్ మరమత్తులు, కాలిపోతున్న రక్షిత మంచినీటి పథకాల బోరు మోటార్లను సకాలంలో బాగు చేసుకునేందుకు ఇబ్బందులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత జిల్లా అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకుని పంచాయతీలకు సక్రమంగా నిధులు విడుదల అయ్యేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు వెంకట్ రెడ్డి, మారుతి, నవీన్, సందీప్, రాంప్రసాద్, సంతోష్, నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు