సంగారెడ్డి కలెక్టరేట్, డిసెంబర్ 21 : నూతన జోనల్, మల్టీ జోనల్ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఉపాధ్యాయ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ తుది దశకు చేరుకున్నది. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఆప్షన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 11,768 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తుండగా, ఈ నెల 17 నుంచి మూడు రోజుల పాటు ఆప్షన్లకు గడువు ఇవ్వడంతో తమకు నచ్చిన ఆప్షన్లను ఎంచుకున్నారు. ఉమ్మడి జిల్లా పరిశీలకుడు రమణకుమార్ సమక్షంలో ఉపాధ్యాయుల కేటాయింపు ప్రక్రియ సాఫీగా జరుగుతున్నది. జీవో 317 ప్రకారం జోనల్ పరిధిలో మూడు ఆప్షన్లు, మల్టీ జోనల్ పరిధిలో ఐదు ఆప్షన్లకు అవకాశం కల్పించారు. ఈ క్రమంలో ఎక్కువ మంది తమ సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు మొదటి ప్రాధాన్యత కింద ఆప్షన్ను ఎంచుకున్నారు. కాగా, నేడో.. రేపో ప్రభుత్వం ఉత్తర్వులు వెలువడించే అవకాశం ఉన్నందున అందరిలో ఉత్కంఠ నెలకొన్నది.
అపోహలు వద్దు..
చాలా మంది ఉపాధ్యాయుల్లో కొంత ఆందోళన, కొన్ని అపోహలు ఉన్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన జీవో 317పై సరైన అవగాహన లేకపోవడంతో తమను ఎక్కడ దూర ప్రాంతాలకు బదిలీ చేస్తారో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, సీనియారిటీ, స్థానికత ఆధారంగానే బదిలీలు జరుగుతాయని ఉపాధ్యాయ సంఘాల నేతలు పేర్కొంటున్నారు. ఒకసారి అన్ని శాఖల్లో ఉద్యోగుల సర్దుబాటు పూర్తైతే నూతన జోనల్ విధానంలో కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని నిరుద్యోగులు ఆశగా ఉన్నారు. కొత్తగా నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న యువతకు ఈ ఉద్యోగుల బదలాయింపు ప్రక్రియ ఊరటనిస్తున్నది.
వెయిటింగ్లో 20 మంది..
బదిలీల ప్రక్రియలో భాగంగా కొందరు ఉపాధ్యాయులు అక్రమాలకు తెర లేపారు. తప్పుడు వైద్య పత్రాలను సమర్పించి తమకు ఇష్టమైన ప్రాంతాలకు ఆప్షన్లను ఎంచుకున్నారు. వైద్యపత్రాలను పరిశీలించిన విద్యాశాఖ అధికారులు జిల్లాలో దాదాపు 20 మంది ఉపాధ్యాయులకు సంబంధించిన వైద్యపత్రాలు నకిలీవిగా గుర్తించారు. వీరందరినీ ప్రస్తుతానికి వెయిటింగ్లో ఉంచారు. ఇదిలా ఉండగా, గతంలో ఉపాధ్యాయుడి కుటుంబ సభ్యులకు ధీర్ఘకాలిక వ్యాధులు ఉంటే బదిలీల్లో అవకాశం కల్పించేవారు. అయితే, ప్రస్తుత జీవో ప్రకారం కేవలం సంబంధిత ఉపాధ్యాయుడు లేదా ఉపాధ్యాయురాలికి ధీర్ఘకాలిక వ్యాధులు ఉన్నైట్లెతేనే మినహాయింపు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా, ఎవరైనా ఉద్యోగుల పిల్లలు మానసిక వైకల్యంతో ఉన్నా కూడా మినహాయింపు ఇస్తారని అధికారులు పేర్కొంటున్నారు. కాగా, ఇటీవల సీఏం కేసీఆర్ జిల్లా కలెక్టర్కు చేసిన సూచన మేరకు భార్యా భర్తలు ఇద్దరూ ఉద్యోగులు అయితే వారిని ఒకే జిల్లాకు కేటాయిస్తారు.