చేర్యాల, జూన్ 6 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం పంపిణీ విషయంలో ఆరుసార్లు లబ్ధిదారుని నుంచి వేలిముద్రలు తీసుకోవడానికి బదులుగా ఒకేసారి వేలి ముద్ర వేస్తే బియ్యం పంపిణీ చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సీపీఎం చేర్యాల మండల కార్యదర్శి బండకింది అరుణ్‌కుమార్ డిమాండ్ చేశారు. చేర్యాల మండలంలోని పరిధిలోని శభాష్ గూడెం గ్రామంలో జరిగిన సీపీఎం గ్రామ శాఖ సమావేశం దాసరి కనకయ్య అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా ఒకేసారి మూడు నెలల రేషన్ ఇవ్వడం వల్ల లబ్ధిదారులు ఆరుసార్లు వేలిముద్రలు పెట్టడం వల్ల రేషన్ కార్డుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రజా పంపిణీ వ్యవస్ధను పటిష్టపరిచి సరైన సౌకర్యాలు కల్పించడంతో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. బియ్యం కోసం ఇల్లు, పనులు వదిలిపెట్టి రాత్రి 9 గంటల వరకు లబ్ధిదారులు షాపుల వద్ద పడిగాపులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రేషన్‌షాపుల వద్ద టెంట్లు, నీటి వసతి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.