కాచిగూడ, ఫిబ్రవరి10 : నగరంలోని బర్కత్‌పుర ప్రాంతానికి చెందిన అంతర్జాతీయ ఓపెన్ వాటర్ స్విమ్మర్ గంధం క్వీని విక్టోరియా, ఆమె కుమారుడు స్టీఫెన్ కుమార్ స్విమ్మింగ్‌లో మరో కొత్త రికార్డు సృష్టించారు. న్యూజిలాండ్‌లోని కుక్ స్ట్రీమ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అక్కడి కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 6.23 గంటలకు నిర్వహించిన స్విమ్మింగ్‌లో తల్లీ కొడుకులు పోటీపడ్డారు. ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ 27.4 కిలోమీటర్ల దూరాన్ని 8.57 గంటల్లో ఈది దక్షిణ భారత్‌లో మొదటి మహిళా స్విమ్మర్‌గా రికార్డు నెలకొల్పారు.
యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించాలన్న ఉద్దేశం తో తాను ఈ కుక్ స్ట్రీమ్ లో పాల్గొన్నట్లు విక్టోరియా మంగళవారం తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో అనేక స్విమ్మింగ్ టోర్నీల్లో విక్టోరియా, ఆమె కుమారుడు స్టీఫెన్ కుమార్ పాల్గొని అనేక రికార్డులు సృష్టించారు. ఈ సందర్భంగా పలువురు వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.