లాహోర్: సుమారు పదిరోజుల ఉత్కంఠకు తెరపడింది. టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌పై బహిష్కరణ వేటు వేసినందుకు నిరసనగా భారత్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేసిన పాకిస్థాన్.. ఎప్పట్లాగే ‘యూటర్న్’ మంత్రాన్ని జపించింది. ఈ టోర్నీలో షెడ్యూల్ (ఈనెల 15న) ప్రకారమే తాము భారత్‌తో మ్యాచ్ ఆడతామని, బాయ్‌కాట్ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నామని సోమవారం అర్ధరాత్రి ప్రకటించింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)తో ఐసీసీ చర్చలు.. శ్రీలంక, బంగ్లాదేశ్, యూఏఈ క్రికెట్ బోర్డుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు తాము దాయాదితో మ్యాచ్ ఆడుతామని తెలిపింది.
క్రికెట్ స్ఫూర్తిని కొనసాగించేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ దేశ ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలుపడం గమనార్హం. ఇదిలాఉండగా టోర్నీలో పాల్గొననందుకు బంగ్లాదేశ్‌పై ఆంక్షలేమీ ఉండబోవని స్పష్టం చేసిన ఐసీసీ.. పాకిస్థాన్‌కు భారీ తాయిళాలు అందించినట్టు తెలుస్తున్నది. అయితే అవేంటన్నదానిపై మాత్రం ప్రపంచకప్ ముగిసిన తర్వాత వెల్లడిస్తామని పీసీబీ అధికార ప్రతినిధి ఒకరు తెలుపడం గమనార్హం.