జహీరాబాద్, జూన్ 18 : సోయాబీన్ పంట సాగు విత్తనాన్ని విత్తిన పొలంలో కలుపు మొక్క నివారించేందుకు గడ్డి మందు పిచికారి చేయడంతో పక్కనే ఉన్న మరో రైతు పొలంలో మొలకెత్తిన పత్తి మొక్కలు ఎండిపోయింది. దీంతో పత్తి రైతు లబోదిబో అంటున్నారు. ఇది సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం అమీరాబాద్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే స్థానిక గ్రామానికి చెందిన సురేష్ అనే రైతు పొలాన్ని కౌలుకు తీసుకొని సోయపంట సాగు చేశాడు. పొలంలో కలుపుముక్క ఎదగకుండా ట్రాక్టర్ సహాయంతో ఇటీవల గడ్డి మందును పిచికారి చేశాడు. ట్రాక్టర్ సాయంతో గడ్డి మందును పిచికారి చేయడంతో గాలికి పక్కనే ఉన్న వైద్యనాథ్ అనే రైతు పొలంలో సాగుచేసిన పత్తిపై ప్రభావం చూపింది.
దాదాపు నాలుగున్నర ఎకరాల పొలంలో సాగుచేసిన పత్తి మొక్క ఎదుగుతున్న సమయంలో గడ్డి మందు ప్రభావం వల్ల ఎండిపోయింది. దాదాపు ఎకరంన్నర పొలంలో పత్తి మొక్క ఎండిపోవడం వల్ల తీరని నష్టం జరిగిందని రైతు వాపోయాడు. గడ్డి మందు ప్రభావంతో దాదాపు 60 వేల వరకు నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు తెలిపారు. ఈ విషయాన్ని మండల వ్యవసాయ అధికారి అవినాష్ వర్మ దృష్టికితేగా.. పంటలపై గడ్డి మందు తోపాటు రసాయన మందుల పిచికారి సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వీలైనంతవరకు గాలి వీచే సమయంలో మందుల పిచికారి చేయవద్దని, అది కూడా చేతి పంపు తో మందులు పిచారి చేసుకోవడం మంచిదన్నారు.