సంగారెడ్డి: తెలంగాణ ఆర్థిక, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఇవాళ సంగారెడ్డి జిల్లా మనూరు మండలం బోరంచలో బసవేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు భూమి పూజ చేశారు. నారాయణ ఖేడ్, ఆందోల్ నియోజకవర్గాల్లోని లక్షా 65 వేల ఎకరాలకు సాగునీటిని అందించే లక్ష్యంతో రూ.1,774 కోట్ల నిధులతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి భూమి పూజ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. కాళేశ్వర శివుని దగ్గర మొదలై గోదారి నీళ్లు బోరంచ పోచమ్మ తల్లి పాదాల వరకు రాబోతున్నాయని అన్నారు.
బంగారు ముక్కు పుడకను బోరంచ అమ్మవారికి మొక్కుగా సమర్పిస్తామని మంత్రి చెప్పారు. నారాయణ ఖేడ్ దశ దిశ మారిందని, నియోజకవర్గానికి కాలువల ద్వారా సాగునీటి ఇవ్వబోతున్నామని తెలిపారు. గత పాలకులు ఖేడ్ సమస్యలు తీర్చలేకపోయారని, సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాతనే ఖేడ్ తలరాత మారిందని అన్నారు. పేదల కలలను నిజం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని చెప్పారు. గత పాలకులు ఉమ్మడి జిల్లాలో మంజీరా నది ఉన్నప్పటికీ.. సాగునీరు కాదుకదా కనీసం తాగునీరు కుడా ఇవ్వలేదని విమర్శించారు.
అంతేగాక, గత పాలకులు ఇక్కడ గంజాయి పండించి డబ్బులు సంపాదించుకున్నారని మంత్రి హరీష్‌రావు విమర్శించారు. నారాయణఖేడ్ గతంలో వలసలకు కేంద్రంగా ఉండేదని, ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి పనుల కోసం నారాయణ ఖేడ్‌కు వలస వస్తున్నారని చెప్పారు. ఖేడ్ లో లక్షా 80 వేల ఎకరాలకు సాగునీరు ఇచ్చే ప్రాజెక్టులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారన్నారు. కేవలం సీఎం కేసీఆర్ వల్లనే నారాయణ ఖేడ్ అభివృద్ధి చెందిందని, బసవేశ్వరుడిని ప్రేమించి, పూజించిన వ్యక్తి కేసీఆర్ అని పేర్కొన్నారు. దేవుడిని అడ్డం పెట్టుకొని కొన్ని పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు.
సీఎం కేసీఆర్ యాదాద్రి ఆలయాన్ని భూలోక వైకుంఠంగా మార్చారని మంత్రి చెప్పారు. బోరంచ గ్రామంలో దళిత బంధు ఇస్తామని, 166 గ్రామాల్లోని 231 చెరువులను నింపుతూ సాగు నీటిని అందిస్తామని, బసవేశ్వర ప్రాజెక్టుతో గోదావరి జలాలను 471 మీటర్ల ఎత్తుకు తెచ్చి నారాయణ ఖేడ్ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి, క్రాంతికిరణ్, జడ్పీ చైర్మన్ మంజుశ్రీ రెడ్డి, కలెక్టర్ శరత్ పాల్గొన్నారు.