Co Option | జహీరాబాద్, సెప్టెంబర్ 14 : మున్సిపల్ పాలక మండళ్లు ఏర్పడి 7 నెలలు గడిచినా.. జహీరాబాద్, కోహీర్ మున్సిపాలిటీల్లో కో-ఆప్షన్ పదవుల భర్తీ మాత్రం నానుతూనే ఉంది. దీంతో ఆయా మున్సిపాలిటీల్లో 58 మంది ఆశావహుల్లో అయోమయం నెలకొంది.
జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 36 మంది, కోహీర్ మున్సిపాలిటీ పరిధిలో 22 మంది కో-ఆప్షన్ సభ్యుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. నోటిఫికేషన్ ఇచ్చినా, తగినంత కోరం లేక వాయిదా పడుతూ వస్తోంది.
ఒక్క ఓటుతో టెన్షన్..
జహీరాబాద్లో పరిస్థితి రసవత్తరంగా మారింది. మొత్తం 37 మంది కౌన్సిలర్లలో బీఆర్ఎస్కు 15, కాంగ్రెస్కు 14, బీజేపీకి 3, ఎంఐఎం 2, స్వతంత్రులు 2 స్థానాల్లో గెలుపొందారు. ఎక్స్ అఫీషియోలతో కలిపి కాంగ్రెస్ కూటమికి 20, బీఆర్ఎస్ కూటమికి 19 ఓట్లు ఉన్నాయి.
కేవలం ఒక్క ఓటు తేడా ఉండటంతో కో-ఆప్షన్ అభ్యర్థుల ఎంపిక విషయంలో కాంగ్రెస్ ఆచితూచి అడుగులు వేస్తోంది. ఏ చిన్న తేడా వచ్చినా లెక్క తారుమారయ్యే ప్రమాదం ఉందని పార్టీలో చర్చ జరుగుతోంది. అభ్యర్థుల ఎంపికపై సీనియర్ నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడమే జాప్యానికి కారణమన్న ప్రచారం జరుగుతోంది. ఏప్రిల్ 4న నిర్వహించిన సమావేశానికి సొంత పార్టీ కౌన్సిలర్లే హాజరు కాకపోవడంతో వాయిదా పడింది. మే 23న మరోసారి నిర్వహిస్తామని ప్రకటించినా ఇప్పటి వరకు అతీగతీ లేదు.
కోహీర్ లో కాంగ్రెస్ కు స్పష్టమైన మెజారిటీ ఉన్నా అక్కడ కూడా కో-ఆప్షన్ నియామకాలు చేపట్టలేదు. 16 మంది కౌన్సిలర్లలో కాంగ్రెస్ కు 8 మంది ఉండగా ఎంపీ, స్వతంత్రుడి మద్దతుతో 10 మంది బలం ఉంది. 4 కో-ఆప్షన్ స్థానాలు కాంగ్రెస్ కే దక్కే అవకాశం ఉన్నా.. నియామకంలో జాప్యం జరుగుతోంది. ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, వెంటనే కో-ఆప్షన్ ఎన్నికలు నిర్వహించాలని ఆశావహులు కోరుతున్నారు.
Walking vs Yoga | నడక మంచిదా.. యోగా మంచిదా? మీ ఆరోగ్యానికి ఏది సరైనదో తెలుసుకోండి