మునిపల్లి, అక్టోబర్ 27: భూముల అమ్మకాల, కొనుగోళ్లు, భూ క్రయవిక్రయాలు అంటే ముందుగా గుర్తుకొచ్చేది సర్కార్ సర్వేయర్ (Surveyor). మునిపల్లి (Munipalli) మండలంలో సర్వేయర్‌గా విధులు నిర్వహించే అధికారి అక్రమ వసూళ్లలో నంబర్ వన్ స్థానంలో దుసుకుపోతున్నది. సర్వే చేసేందుకు మిషన్ ఆపరేటర్‌గా తన తమ్ముడిని ఏర్పాటు చేసుకొని అందినాకడికి దోచుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. గతంలో పనిచేసిన సర్వేయర్లు ఎవ్వరు ఈవిధంగా డబ్బులు డిమాండ్ చేసేవారు కాదని మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్వే చేయడానికి ఎవరైనా వ్యాపారులు, రైతులు.. సర్వేయర్‌కు ఫోన్ చేస్తే.. మా ఆపరేటర్ వస్తాడు కలవండి, వివరాలు ఇచ్చి ఫార్మాలిటీస్ల్టీస్ పూర్తిచేస్తే మీ పని అయిపోతుందని సమాధానమిస్తున్నారు. మండలంలో సర్వేయర్, తన తమ్ముడితో కలిసి చేసే వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టు కొనసాగుతున్నది.
మునిపల్లి మండల సర్వేయర్ ఎకరాకు రూ.5 వేలు వసూలు చేస్తున్నట్టు సంబంధిత అధికారులకు సమాచారం ఉన్నప్పటికీ, ఎందుకు మౌనంగా ఉంటున్నారో వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు మండల వాసులు ఉన్నతాధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులతో పాటు సామాన్య రైతుల వద్ద కూడా రూ.5 వేలు వసూలు చేస్తుండటంతో సామాన్య ప్రజలు సర్వే చేయించుకోవాలంటేనే లబోదిబోమంటున్నారు.
మండలంలో ప్రభుత్వ సర్వేయర్‌గా విధులు నిర్వస్తున్న అధికారి చేత భూములు సర్వే చేయించాలి అంటే నోట్ల కట్టలు చేతిలో పట్టుకోవాల్సిందే. ఇదంతా సర్వేయర్ తమ్ముడి నేతృత్వంలో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్నది. వారి అక్రమాలు తాజా వెలుగులోకి వచ్చాయి. ఇటీవల మండలంలోని కంకోల్ గ్రామ శివారులో 37ఎకరాల భూమి అడ్డగోలుగా సర్వే చెసిన మ్యాప్‌ను బడా వ్యాపారులకు అందించారు. రైతులైనా, వ్యాపారులైనా సర్వే చేయించుకువాలంటే ముందుగా ఆన్లైన్లో ప్రభుత్వనికి దరఖాస్తు చేసుకోవాలి. ఆ దరఖాస్తును మండల సర్వేయర్‌కు అందించాలి. సర్వేయర్ దానిని పరిశీలించి.. సర్వే చేయడానికి రెండు రోజుల ముందు చుట్టూ పక్కల రైతులకు నోటీసులు ఇవ్వాలి. అనంతరం దరఖాస్తు పెట్టుకున్న భూమిని సర్వే చెయ్యాలి. అయితే మునిపల్లి మండలంలో మాత్రం ఇలాంటివి ఏమీ జరగడం లేదని, నోట్ల కట్టాలు ఉంటే చాలు మేడం సర్వే పూర్తిచేస్తారని విమర్శలున్నాయి. ఉన్నత అధికారులు స్పందించి అక్రమంగా వసూళ్లు చేస్తున్న సర్వేయర్‌పై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.