అమీన్పూర్, జనవరి 24 : సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని వందనపురి కాలనీలో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న కేసు విషయంలో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. సాఫ్ట్వేర్ ఉద్యోగి శ్రీకాంత్‌గౌడ్, అతడి భార్య, కుమార్తె ఆత్మహత్య గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. ముగ్గురి ఆత్మహత్యపై పలు కోణా ల్లో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. శ్రీకాంత్‌గౌడ్ మొ బైల్, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకుని కాల్‌డేటా ఆధారంగా విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. ఆర్థిక సమస్యలు, మూఢ నమ్మకాలతో వారు ఈ దారుణానికి పాల్పడ్డారా ? అనే కోణాల్లో కూడా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాసులురెడ్డి తెలిపారు.
అప్పులే ప్రధాన కారణమా.. ?
శ్రీకాంత్‌గౌడ్ ఐదేండ్ల క్రితం జీ ప్లస్-2 (రెండు అంతస్తులు) భవనాన్ని నిర్మించుకున్నాడు. దానిపై సుమారుగా రూ.40లక్షల నుంచి రూ.50 లక్షల మేర రుణం తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఇతరత్రా వ్యక్తిగత రుణాలు సైతం తీసుకున్నట్లు సమాచారం. రెండేండ్ల కింద కొవిడ్ కారణంగా అనేక ఆర్థిక ఇబ్బందుల్లోకి కూరుకుపోయినట్లు తెలుస్తున్నది. అతను ఓ ప్రముఖ ఫైనాన్స్ కంపెనీలో రూ.47 లక్షల రుణం బాకీ ఉన్నట్లు తెలుస్తున్నది. నెలనెలా వాయిదాలు సైతం చెల్లించలేని స్థితికి చేరుకున్నాడని సమాచారం.
పక్కా ప్లాన్‌తోనే..?
ఈ నెల 8వ తేదీన శ్రీకాంత్‌గౌడ్ సొంత గ్రామమైన మేడ్చల్ జిల్లా పోతాయిపల్లిలోని తల్లిదండ్రుల వద్దకు భార్య, కూతురుతో కలిసి వెళ్లాడు. అనంతరం అత్తగారి గ్రామం అల్వాల్ వెంకటాపూర్‌కు వెళ్లారు. మరుసటి రోజు శ్రీకాంత్ తల్లికి ఫోన్ చేసి మటన్, ఫిష్ బిర్యానీ తీసుకునివస్తానని, వంట చేయొద్దని చెప్పాడు. బిర్యానీ తీసుకెళ్లి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశాడు. అదేరోజు సాయంత్రం భార్య, కూతురుతో కలిసి అమీన్‌పూర్‌కు చేరుకున్నారు. రెండురోజుల ముందుగానే సూసైడ్‌కు సంబంధించిన వివరాలను ఇంటర్నెట్లో ఆరా తీశాడు. మాత్రలు, స్లీపింగ్ మందులు ఏవి వేసుకుంటే ఇబ్బంది లేకుండా చనిపోవచ్చని సెర్చ్ చేశాడు. నిద్ర మాత్రలను రాజస్థాన్‌లోని జైపూర్ నుంచి ఆర్డర్ చేసి తెప్పించుకున్నాడు. ఈ నెల 18వ తేదీన రాత్రి శ్రీకాంత్‌గౌడ్, భార్య, కూతురు నిద్రమాత్రలను మింగి చనిపోయారు.
మరిన్ని కోణాల్లో విచారణ..
ఈ కేసుకు సంబంధించి పోలీసులు మరిన్ని కోణాల్లో విచారిస్తున్నారు. ఇప్పటి వరకు చేసిన దర్యాప్తులో భాగంగా వారి ఆత్మహత్యలకు ఆర్థిక సమస్యలే ప్రధాన కారణమని తెలుస్తున్నది. పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా మరిన్ని వివరాలు తెలియనున్నాయి.