మెదక్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): మాఘ అమావాస్య సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ (SP S Mahender) తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో జాతర బందోబస్తు ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన ఆయన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని భద్రతా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.
మాఘ అమావాస్య విధుల నిర్వహణపై నిర్వహించిన బ్రీఫింగ్లో భాగంగా జిల్లా సిబ్బందికి ఎస్పీ కీలక సూచనలు చేశారు. విధుల్లో అప్రమత్తంగా ఉండాలని, భక్తుల రద్దీని క్రమబద్ధంగా నియంత్రించాలని, క్యూ లైన్లు, బారికేడ్ల వద్ద ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. జాతర నిర్వహణను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ ఎస్.మహేందర్ తెలిపారు. ఆలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాలు, ప్రధాన రహదారులపై సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి జాతర మొత్తం నిరంతర నిఘాలో ఉంచినట్లు వివరించారు. భక్తులు పోలీసు సిబ్బంది సూచనలు తప్పనిసరిగా పాటించాలని, వాహనాలను కేటాయించిన పార్కింగ్ స్థలాల్లోనే నిలిపి సహకరించాలని ఆయన కోరారు.
మహిళల భద్రత కోసం షీ టీమ్స్, మహిళా పోలీసు సిబ్బంది, మఫ్టీ బృందాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి నిరంతర నిఘా కొనసాగిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, దొంగతనాలు, గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జాతర బందోబస్తును మూడు సెక్టార్లుగా విభజించి, జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో సుమారు 250 మంది అధికారులు, సిబ్బందితో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ తెలిపారు. భక్తులు సూచించిన ప్రదేశాల్లోనే స్నానాలు చేయాలని, లోతట్టు ప్రాంతాలు లేదా ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. జాతర సందర్భంగా ఏవైనా ఇబ్బందులు ఎదురైతే డయల్ 100 లేదా సమీప పోలీసు సిబ్బందిని సంప్రదించాలని తెలిపారు. భక్తులు పోలీసు సూచనలు పాటిస్తూ, ప్రశాంత వాతావరణంలో అమ్మవారి దర్శనం పూర్తి చేసుకొని, సురక్షితంగా తిరిగి వెళ్లాలని ఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీసీఎస్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి, జర్జ్ ఎసైలు, సిబ్బంది పాల్గొన్నారు.