సంగారెడ్డి, మార్చి 2(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈనెల 9వ తేదీ నుంచి ‘మనఊరు-మనబడి’ పను లు ప్రారంభించాలని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు కలెక్టర్లు, అదనపు కలెక్టర్లకు ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఈ నెల 8న వనపర్తిలో ‘మన ఊరు-మనబడి’ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని, 9న ఉమ్మడి మెదక్ జి ల్లాలో పనులు ప్రారంభించాలన్నారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దళితబంధు పథకాన్ని పకడ్బందీగా అమ లు చేయాలని, లబ్ధిదారులకు యూనిట్లు గ్రౌండింగ్‌ను ఉమ్మ డి మెదక్ జిల్లాలో ఈ నెల 31వ తేదీలోగా పూర్తి చేయాలన్నా రు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని మున్సిపాలిటీల్లో చేపట్టిన ఇం టిగ్రేటెడ్ మార్కెట్లు, వైకుంఠధామాల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్లు, అదనపు కలెక్టర్లను ఆదేశించారు.
బుధవారం సంగారెడ్డి జడ్పీ సమావేశ మందిరంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, క లెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి హరీశ్‌రావు హాజరై మన ఊరు-మనబడి, దళితబంధు, మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్ల్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించాలన్న సంకల్పంతో ‘మన ఊరు-మనబడి’కి శ్రీకారం చుట్టినట్లు తె లిపారు. ఇందులో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియంలో బోధన కొనసాగించనున్నట్లు చెప్పారు. తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చేర్పించాలని ఆకాంక్షిస్తున్నారని, అందుకే ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియం ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించనున్నట్లు చెప్పారు. ఇందుకోసం ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రూ.7289 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. మొదటి దశలో 35శాతం పాఠశాలలను ఎంపిక చేస్తున్నామన్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో..
ఉమ్మడి మెదక్ జిల్లాలో తొలి విడతగా 1097 పాఠశాలల ను ఎంపిక చేసినట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో 441, సిద్దిపేటలో 343, మెదక్‌లో 313 పాఠశాలలను ఎంపికి చేశామన్నారు. ‘మన ఊరు-మనబడి’లో భా గంగా పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం, మరమ్మతులు, ప్రహరీల నిర్మాణం తదితర 12 రకాల పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. తరగతి గదుల్లో అవసరమైన ఫర్నిచర్, డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ(ఎస్ఎంసీ)ల ఆధ్వర్యంలో పాఠశాలల్లో నిర్మాణ పనులు నాణ్యంగా చేపడతామన్నారు. ఈ పనులకు సంబంధించి ఇంజినీరింగ్ అధికారులు త్వరితగతిన ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. తాను అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతానని మంత్రి తెలిపారు. ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో ఇంజినీరింగ్ అధికారికి పనుల బాధ్యత అప్పగిస్తున్నట్లు చెప్పారు. పనులు ఈ నెల 9 నుంచి ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు హనుమంతరావు, హరీశ్‌ను మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలోనే ఉమ్మడి మెదక్ జిల్లా అగ్రస్థానంలో ఉండేలా చొరవ చూపాలన్నారు.
31లోగా దళితబంధు గ్రౌండింగ్ పూర్తి చేయాలి..
దళితబంధు యూనిట్ల గ్రౌండింగ్ ఈనెల 31లోగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. దళితబంధు పథకం అమలుపై జరిగిన సమీక్షలో మంత్రి మాట్లాడుతూ.. దళితబంధు పథకంలో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో 1156 లబ్ధిదారులకు రూ.115 కోట్ల ఆర్థిక సాయం తొలి విడతలో చేస్తున్నట్లు తెలిపారు. లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున డబ్బులు అందజేస్తామన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యిందని, ఈనెల 31లోగా పథకం గ్రౌండింగ్ పూర్తి చేయాలని కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. నియోజకవర్గాల వారీగా లబ్ధిదారుల ఎంపికను సమీక్షించిన మంత్రి, డెయిరీ యూనిట్ల ఏర్పాటును ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. అవసరమైతే ఎమ్మెల్యేలు స్వయంగా లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి వారితో మాట్లాడాలన్నారు. వారు ఆర్థికంగా నిలదొక్కుకునే యూనిట్ ఎంపిక చేసుకునేలా చూడాలన్నారు. డెయిరీ యూనిట్లకు కలెక్షన్ పాయింట్లు ఏర్పాటు చేయాలని, పౌల్ట్రీ ఫామ్‌లకు బోరు యూనిట్ ఇవ్వాలని సూచించారు.
డెయిరీ యూనిట్లో షెడ్ వేసుకునేందుకు ఈజీఎస్ ద్వారా నిధులు అందించాలన్నారు. దళితబంధులో వాహనాలు కొనుగోలు చేసే వారికి లైసెన్సులు ఇవ్వడంతో పాటు తగిన శిక్షణ ఇప్పించాలని ఆర్టీఏ అధికారులను ఆదేశించారు. మెడికల్ షాపు, డయాగ్నాస్టిక్ సెంటర్లు పెట్టుకునే వారికి లైసెన్స్ ఫీజులు మినహాయిస్తున్నట్లు చెప్పారు. దళితబంధు లబ్ధిదారులకు అవసరమైన చోట లబ్ధి చేకూరేలా జిల్లా అధికారులు చొరవ చూపాలన్నారు. ప్రభుత్వం సూచించిన విధంగా అవకాశం ఉన్నచోట 15 శాతం రిజర్వేషన్ అమలు చేయాలన్నారు. అందోలు, జహీరాబాద్, మెదక్ నియోజకవర్గాల్లో దళితబంధు వందశాతం విజయవంతం అయ్యేలా చూడాలని ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్,మాణిక్‌రావు, పద్మాదేవేందర్రెడ్డికు సూచించారు. ఏప్రిల్‌లో దళితబంధు పథకం కింద పెద్ద సంఖ్యలో జిల్లాలకు యూనిట్లు వస్తాయని, వాటి గ్రౌండింగ్‌కు అధికారులు సిద్ధ్దంగా ఉండాలన్నారు. దళితబంధు పథకం అమలులో ఉమ్మడి మెదక్ జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిపేలా అధికారులు పనిచేయాలన్నారు. దళితబంధు పథకం అమలుతీరుపై రాష్ట్ర అధికారి కరుణాకర్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
బల్దియాల్లో పాదయాత్ర చేస్తా : మంత్రి
సంగారెడ్డి, జహీరాబాద్ మున్సిపాలిటీల్లో తాను పాదయాత్ర చేస్తానని, ప్రజలకు అవసరమైన పనులు గుర్తించి నిధులు ఖర్చు చేసేలా చూస్తానని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. గ్రామాల్లో నిధుల వినియోగంపై ఎమ్మెల్యేలు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. మున్సిపాలిటీలు, గ్రామాల్లో దీర్ఘకాలికంగా అపరిష్కృత సమస్యలు, పెండింగ్ పనులు గుర్తించి, వాటిని పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. ఈ నెల 17వ తేదీ వరకు మున్సిపాలిటీలు, గ్రామాల్లో పనులు గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, చంటి క్రాంతి కిరణ్, భూపాల్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, రఘునందర్రావు, ఎమ్మెల్సీలు వంటేరి యాదవరెడ్డి, ఫరూఖ్ హుస్సేన్, శేరి సుభాశ్‌రెడ్డి, రఘోత్తంరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, కలెక్టర్లు హన్మంతరావు, హరీష్, అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, రాజర్షిషా, ప్రతిమాసింగ్, ముజామ్మిల్‌ఖాన్, మున్సిపల్ చైర్మన్లు రాజనర్సు, మురళీయాదవ్, సంగారెడ్డి లైబ్రరీ చైర్మన్ నరహరిరెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లాలోని అధికారులు పాల్గొన్నారు.
ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల విజ్ఞప్తి
‘మన ఊరు-మనబడి’లో అందోలు ప్రభుత్వ పాఠశాలను ఎంపిక చేయాలని మంత్రిని ఎమ్మెల్యే క్రాంతికిరణ్ కోరారు. ఝరాసంగంలో ప్రభుత్వ పాఠశాల స్థలం వివాదంలో ఉందని, సమస్యను పరిష్కరించాలని మంత్రికి జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు మొక్కలు నాటడం, లేదా పాఠశాల ఆవరణలో కూరగాయలు పెంచేలా చూడాలని ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ సూచించారు. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ఘనపురం పాఠశాల స్థానంలో పటాన్చెరు జడ్పీహై స్కూల్‌ను తొలివిడతలో చేర్చాలన్నారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. మన ఊరు-మనబడిలో చేపట్టే పనులు నాణ్యతగా ఉండాలని, బ్రాండెడ్ ఫర్నిచర్ కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు.
పనులు వేగంగా పూర్తిచేయండి
ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో వైకుంఠధామాలు, ఇంటిగ్రేటెడ్ వెజ్-నాన్‌వెజ్ మార్కెట్ల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. ఈ పనుల ప్రగతిపై సమీక్ష సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీల్లో వైకుంఠధామాలు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణానికి నిధులు కేటాయించిందన్నారు. త్వరగా పనులు పూర్తయ్యేలా చూడాలని అదనపు కలెక్టర్లు రాజర్షిషా, ప్రతిమాసింగ్, ముజామ్మిల్ఖాన్కు ఆదేశించారు. చేర్యాల్, దుబ్బాక, హుస్నాబాద్‌లో వైకుంఠధామాలు, మార్కెట్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలన్నారు. సంగారెడ్డి జిల్లాలోని మున్సిపాలిటీలకు సీఎం కేసీఆర్ ప్రత్యేక నిధులు ఇచ్చారని, అవసరమైతే ఆ నిధులతో కలిపి ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు అన్ని వసతులు ఉండేలా నిర్మించాలని కలెక్టర్లకు సూచించారు.
మంత్రి పిలుపుతో విరాళాలు ఇచ్చిన ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు
‘మన ఊరు-మనబడి’ కార్యక్రమానికి విరాళాలు ఇ వ్వాలని మంత్రి హరీశ్‌రావు ఇచ్చిన పిలుపుకు ఉమ్మడి మె దక్ జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉదారంగా స్పందించారు. మంత్రి హరీశ్‌రావు తన నెలరోజుల వేతనం విరాళంగా అందజేస్తున్నట్లు ప్రకటించారు. ఆ త ర్వాత మంత్రి పిలుపుతో నెలరోజుల వేతనం ఇచ్చేందుకు ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముందుకు వచ్చారు. మె దక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి రూ.2 లక్షలు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ రూ.3 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఎ మ్మెల్సీలు శేరి సుభాష్‌రెడ్డి, ఫారూఖ్‌హుస్సేన్, యాదవరె డ్డి, రఘోత్తంరెడ్డి నెలరోజుల వేతనాలిచ్చారు. ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్, మహిపాల్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, మాణిక్‌రావు, పద్మాదేవేందర్‌రెడ్డి రూ.లక్ష చొప్పున విరాళం అందజేస్తున్నట్లు తెలిపారు. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జడ్పీచైర్పర్సన్లు మంజుశ్రీజైపాల్‌రెడ్డి, రోజాశర్మ, హేమలతా శేఖర్‌గౌడ్ నెల వేతనం విరాళంగా అందజేస్తున్నట్లు ప్రకటించా రు. ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ రూ.లక్ష చొప్పున విరాళం అందజేస్తున్నట్లు చెప్పారు.
సంగారెడ్డి జిల్లా లైబ్రరీ చైర్మన్ నరహరిరెడ్డి రూ.51వేలు విరాళంగా ఇస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ వేదికపైనే అప్పటికప్పుడు మంత్రి హరీశ్‌రావుకు రూ.లక్ష చొప్పున విరాళం చెక్కు రూపంలో అందజేశారు. ఝరాసంగం మండలం ఈదులపల్లిలో కొత్త ప్రభుత్వ పాఠశాల నిర్మాణానికి ముందుకు వస్తే రూ.50 లక్షల విలువ చేసే స్థలం ఇస్తానని డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ మంత్రి హరీశ్‌రావుకు తెలిపారు. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి దుబ్బాక మండలం భూంపల్లి ప్రభుత్వ పాఠశాలకు రూ.8 లక్షలతో అవసరమైన ఫర్నిచర్ అందజేస్తున్నట్లు చెప్పారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు రూ.లక్ష విరాళంతో పాటు ఒక ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుంటానని ప్రకటించారు. ‘మన ఊరు-మనబడి’కి పూర్వ విద్యార్థులు, ఎన్ఆర్ఐలు, దాతల నుంచి విరాళాలు స్వీకరించనున్నట్లు మంత్రి తెలిపారు. పాఠశాల నిర్మాణానికి స్థలం, రూ.కోటి నుంచి రూ.పది లక్షల వరకు విరాళం ఇస్తే వారి పేర్లను పాఠశాల తరగతి గదులు, బ్లాక్‌లు, పాఠశాలకు పెడతామన్నారు.