సంగారెడ్డి జిల్లాలో కారు గేరు మార్చి మరింత స్పీడందుకుంది. సీఎం కేసీఆర్ నారాయణఖేడ్ పర్యటన టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని తెచ్చింది. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలకు శంకుస్థాపన, మున్సిపాలిటీలు, పంచాయతీలకు నిధుల కేటాయింపు, తండాల అభివృద్ధి, రహదారుల విస్తరణకు నిధులు మంజూరు చేస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇవ్వడంతో ఇటు రైతులు అటు ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి కేరాఫ్‌గా చెప్పుకున్న తమ ప్రాంతానికి బంగారు బాటలు పడుతున్నాయని పేర్కొంటున్నారు. ఏండ్లుగా బీడువారిన తమ భూములు గోదావరి జలాలతో సస్యశ్యామలంగా మారనున్నాయంటూ సంబురపడుతున్నారు. ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ జిల్లా అభివృద్ధికి వరాల జల్లు కురిపించిన సీఎం కేసీఆర్, నిధులు తెచ్చేందుకు సహకరించిన మంత్రి హరీశ్‌రావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్, ఎమ్మెల్యేల ఫ్లెక్సీలు, ఫొటోలకు సోమవారం క్షీరాభిషేకాలు నిర్వహించారు. పట్టణాలు, గ్రామాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు జై తెలంగాణ.. జై కేసీఆర్ నినాదాలు చేస్తూ ధన్యవాదాలు తెలిపారు.
సంగారెడ్డి, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ) : సీఎం కేసీఆర్ జిల్లా పర్యటన అన్ని వర్గాల్లో సంతోషాన్ని నింపింది. నారాయణఖేడ్‌లో సోమవారం సీఎం కేసీఆర్ పర్యటించి సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో జిల్లాపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. సీఎం కేసీఆర్ పర్యటన రైతులు, ప్రజాప్రతినిధులతోపాటు గులాబీ శ్రేణుల్లో సైతం ఫుల్ జోష్ నింపింది. ముఖ్యంగా నారాయణఖేడ్ ప్రాంతవాసులు సీఎం కేసీఆర్ పర్యటన విజయవంతం కావటంతో ఆనందం వ్యక్తం చేశారు. తమ గ్రామాలు, మున్సిపాలిటీలు అభివృద్ధి చెందుతాయని ప్రజాప్రతినిధులు సంబుర పడుతున్నారు. సీఎం పర్యటనపై జిల్లా రైతాంగం రెట్టింపు ఆనందంతో ఉన్నారు. రూ.4 వేల కోట్ల వ్యయంతో రెండు ఎత్తిపోతల పథకాలను నిర్మించనున్నారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల ద్వారా సంగారెడ్డి, నారాయణఖేడ్, అందోలు, జహీరాబాద్ నియోజకవర్గాల్లో 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. రెండు ఎత్తిపోతల పథకాలకు ఏడాదిన్నరలోపు పనులు పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. దశాబ్దాలుగా తాగు, సాగునీటి కోసం ఇబ్బంది పడిన సంగారెడ్డి జిల్లా ప్రజల సమస్య త్వరలో తీరనుంది. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకం ద్వారా ఎక్కువగా అందోల్ నియోజకవర్గ రైతులకు లాభం చేకూరనుండడంతో ఆ ప్రాంత రైతులు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ నిర్ణయంతో బీడు భూములు సస్యశ్యామలం కానుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు..
నారాయణఖేడ్ బహిరంగ సభలో సంగారెడ్డిలోని ఎనిమిది మున్సిపాలిటీలకు సీఎం కేసీఆర్ నిధులు ప్రకటించారు. సంగారెడ్డి, జహీరాబాద్ మున్సిపాలిటీలకు రూ.50 కోట్ల చొప్పున రూ.100 కోట్లు మంజూరు చేశారు. మిగితా ఆరు మున్సిపాలిటీలకు రూ.25 కోట్ల చొప్పున రూ.150 కోట్ల నిధులను సీఎం ప్రకటించారు. సీఎం ప్రకటనతో జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లోని పాలకవర్గ సభ్యులు సంతో షం వ్యక్తం చేశారు. జిల్లాలోని ఎనిమిది మున్సిపాలిటీల్లో పాలకవర్గ సభ్యులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. నిధులు మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్‌కు, మంత్రి హరీశ్‌రావుకు ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలోని 699 పంచాయతీల్లో అభివృద్ధి పనులకు రూ.20 లక్షల చొప్పున రూ.139.80 కోట్ల నిధులను సీఎం కేసీఆర్ మం జూరు చేశారు. పంచాయతీలకు సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేయటంతో సర్పంచ్‌లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ తండాల అభివృద్ధికి నిధులు ఇస్తామని చెప్పటంతో ప్రజాప్రతినిధులు, గిరిజనులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ నిర్ణయంతో జిల్లాలోని గ్రామీ ణ రహదారుల మరమ్మతులు, పునరుద్ధరణ పనులకు పెద్ద ఎత్తున నిధులు రానుడడంతో ప్రజలు సంతోషంగా ఉన్నారు.