సంగారెడ్డి, ఫిబ్రవరి 22 : ఎత్తిపోతల అంటేనే లోతులో ఉన్న నీటిని ఎత్తుకు తరలించే పథకమని, అరకిలో మీటర్ లోతులో గోదావరి జలాలను సంగారెడ్డి జిల్లా తీసుకురావడం సీఎం కేసీఆర్ గొప్ప సంకల్పమని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ అన్నారు. సోమవారం నారాయణఖేడ్‌లో బహిరంగ సభను విజయవంతం చేసేందుకు తరలివచ్చిన టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, మహిళలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సభను విజయవంతం చేసిన సందర్భంగా మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి చింతా ప్రభాకర్ మాట్లాడారు. ఎగువ ప్రాంతం నుంచి దిగువకు పారే నీటిని ప్రజల అవసరాలకు వినియోగించడం ముఖ్యమంత్రికే సాధ్యమైందన్నారు. కాళేశ్వరంతో రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణ బీడు భూముల్లో రత్నాలు పండించేందుకు సాగునీరు అందించాలనే లక్ష్యాన్ని సీఎం నెరవేర్చారన్నారు. అదేవిధంగా జిల్లా లో 3.90 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే రెండు ఎత్తిపోతల పథకాలను నిర్మించేందుకు రూ.4.427 కోట్లు కేటాయించడం హర్షణీయమన్నారు. కాంగ్రెస్, టీడీపీ హయాం లో జిల్లా కేంద్రం తలపై ఉన్న సింగూరు ప్రాజెక్టు నుంచి చుక్క నీటిని తాగడానికి ఇవ్వలేదని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికి భగీరథ పథకం ద్వారా తాగునీరు ఇచ్చిన ఘనత టీఆర్ఎస్దేనన్నారు. సీఎం కేసీఆర్ స్వ యంగా ప్రాజెక్టులకు రూపకల్పన చేసి ఇంజినీర్ అవతారం ఎత్తిన మహా నాయకుడని కొనియాడారు. జిల్లాలోని 8 మున్సిపాలిటీల్లో సంగారెడ్డి, జహీరాబాద్‌కు రూ.50 కోట్ల చొప్పున అభివృద్ధికి నిధులు మంజూరు చేసి 24 గంటల్లో అందుకు సంబంధించిన జీవోలు జారీ చేయడం హర్షణీయమన్నారు. పంచాయతీరాజ్ రోడ్లకు బీటీ రెన్యువల్స్, జిల్లాలోని 699 పంచాయతీల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. అనంతరం జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన చింతా ప్రభాకర్‌ను నాయకులు శాలువాతో ఘనంగా సన్మానించారు.
ప్రజల కోసం పని చేసేదే టీఆర్ఎస్.. అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్
రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ అన్నారు. గజ్వేల్, సిద్దిపేటకు దీటుగా అందోల్ నియోజకవర్గానికి సాగునీరు అందించడం గొప్ప విషయమన్నారు. సీఎం సభకు వచ్చిన ఇద్దరు టీఆర్ఎస్ కార్యకర్తలు గుండెపోటుతో మృతి చెందడం బాధాకరమని, వారి ఆత్మ కు శాంతి చేకూరాలని భగవంతున్ని వేడుకున్నారు. పార్టీ తరఫున రూ.5 లక్షల చొప్పున మృతుల కుటుంబ సభ్యులకు అందజేస్తామని తెలిపారు. సమావేశంలో డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, వైస్ చైర్మన్ లత, ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీటీసీ కొండల్‌రెడ్డి, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు వెంకటేశ్వర్లు, చక్రపాణి, మధుసూదన్‌రెడ్డి, విఠల్, నర్సింహులు, శ్రీనివాస ముదిరాజ్ పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ నిధులివ్వడం చారిత్రాత్మకం..
మున్సిపాలిటీలకు, గ్రామాలకు సీఎం సభలో నిధులు విడుదల చేస్తానని ప్రకటించడం చారిత్రాత్మకం. మున్సిపాలిటీలకు రూ. 25 కోట్ల చొప్పున, గ్రామ పంచాయతీలకు రూ.20 లక్షల చొప్పున నిధులు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం. మున్సిపాలిటీల అభివృద్ధి కోసం పాతిక కోట్లు కేటాయించినందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు. ప్రత్యేక నిధులతో తెల్లాపూర్, అమీన్‌ఫూర్, బొల్లారం మున్సిపాలిటీలకు లాభం చేకూరింది. నియోజకవర్గానికి అండగా నిలిచి అభివృద్ధికి సహకరిస్తున్న మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు.
– గూడెం మహిపాల్‌రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే
మున్సిపాలిటీలు, గ్రామాలు మరింత అభివృద్ధి..
మున్సిపాలిటీలు, గ్రామాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ నిధులు మంజూరు చేయడం అభినందనీయం. అడిగిన వెంటనే సీఎం కేసీఆర్ పెద్ద మనస్సు చేసుకుని మున్సిపాలిటీకి రూ.25 కోట్లు, గ్రామాల అభివృద్ధికి రూ.20 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించడం సంతోషానిచ్చింది. ఈ నిధులతో మున్సిపల్ పరిధిలో ప్రతీ వార్డులో కావాల్సిన వసతులపై సమావేశాలు ఏర్పాటు చేసి పనులు చేపడుతాం. గ్రామాల్లో ఇప్పటికే పల్లెప్రగతి ద్వారా ప్రజలకు అన్ని వసతులు కల్పించాం. కొత్తగా మంజూరయ్యే నిధులతో ఇతర అభివృద్ధి పనులు చేపడుతాం. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజల భాగస్వామ్యంతో ముందుకెళ్తాం.
– చంటి క్రాంతికిరణ్, అందోల్ ఎమ్మెల్యే