పటాన్చెరు, ఫిబ్రవరి 21: గీతం డ్రీమ్డ్ యూనివర్సిటీ (హైదరాబాద్) బీటెక్ పూర్వ విద్యార్థిని శివాలి జోహ్రీ శ్రీవాస్తవ కుటుంబం 14 గిన్నిస్ రికార్డులను సొంతం చేసుకున్నది. హ్యాండ్‌మేడ్ పేపర్‌తో రూపొందించిన 2,342 బొమ్మలను ఒక చోట అతిపెద్ద ప్రదర్శనగా నిర్వహించి గిన్నిస్ రికార్డును సొంతం చేసుకున్నారు. ఇందులో విద్యార్థిని తల్లిదండ్రులు కవిత జోహ్రీ శ్రీవాస్తవ, అనిల్ శ్రీవాస్తవ సహకారంతో ఈ రికార్డు సాధించారు. పటాన్చెరు మండలం రుద్రారం గీతం డ్రీమ్డ్ యూనివర్సిటీ ప్రాంగణంలో నిర్వహించిన కాగితపు బొమ్మల ప్రదర్శలకు ఏకంగా 14 గిన్నిస్ రికార్డులు వరుసగా దక్కాయి. 15 అసిక్స్ వరల్డ్ రికార్డులనూ నమోదు చేసుకున్నది. హైదరాబాద్‌లో ఒకే కుటుంబానికి ఇన్ని రికార్డులు ఉండడం మరో రికార్డు. గతంలో శివాలి కుటుంబం హ్యాండ్ మేడ్ పేపర్‌తో రూపొందించిన 1,251 విభిన్న బొమ్మలు కొలువుతీర్చి తొలి గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. ఆ తరువాత 2,100 ఒరేగామి పెంగ్విన్స్, 6,132 ఒరేగామి సిట్రస్‌లు, 6,100 ఒరేగామి వేల్స్, 2,500 ఒరేగామి పెంగ్విన్స్, 1,451 ఒరేగామి మాప్లీలు, 2,200 క్విల్లింగ్ డాల్స్, 9,299 ఒరేగామి ఫిష్, 1,993 ఒరేగామి మాప్లీ లీవ్స్, 2,200 క్విల్లింగ్ డాల్స్లను ప్రదర్శనకు ఉంచి, ఇప్పటివరకు మొత్తం 14 గిన్నిస్ రికార్డులు సొంతం చేసుకున్నారు. శివాలి, ఆమె తల్లిదండ్రులను గీతం హైదరాబాద్ ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, డైరెక్టర్, ఇంజినీరింగ్ ప్రొఫెసర్ వీకే మిట్టల్, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియెట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్య, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు, స్కూల్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపాల్ డాక్టర్ జీఎస్ కుమార్, స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ డైరెక్టర్ ప్రొఫెసర్ సునీల్‌కుమార్, గణిత విభాగం అధ్యాపకుడు డాక్టర్ మల్లికార్జున్ వివిధ విభాగాధిపతులు వారిని అభినందించారు.