సంగారెడ్డి, ఫిబ్రవరి 21(నమస్తే తెలంగాణ): తండాల అభివృద్ధికి త్వరలోనే నిధులు మంజూరు చేస్తానని సీఎం కేసీఆర్ అన్నారు. బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తూ ఉమ్మడి మెదక్ జిల్లాలో సిద్దిపేట నుంచి నారాయణఖేడ్ వరకు పెద్ద సంఖ్య లో తండాలు ఉన్నాయన్నారు. వెనుకబడిన జిల్లా అయినందున తండాల అభివృద్ధికి నిధులు ఇవ్వాలని మంత్రి హరీశ్‌రావు తనను కోరారన్నారు. ఈ విషయమై త్వరలోనే హైదరాబాద్‌లో గిరిజన శాఖ మంత్రితోపాటు జిల్లా మంత్రి హరీశ్‌రావు, సంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలు, అధికారులతో ప్రత్యేక స మావేశం ఏర్పాటు చేస్తానని సీఎం తెలిపారు. గిరిజన తండాల్లోని సమస్యలు, అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాలపై అధికారులతో మాట్లాడతానన్నారు. పంచాయతీరాజ్ రహదారులు దె బ్బ తిన్నాయని, మరమ్మతులకు నిధులు ఇవ్వాలని మంత్రి హరీశ్‌రావు తనకు ఫోన్లో కోరగా, రాష్ట్ర అధికారులను పిలిపించి మాట్లాడినట్లు తెలిపారు. రహదారుల అభివృద్ధికి రూ.50 నుంచి రూ.60 కోట్ల నిధులు ఇచ్చామని అధికారులు చెప్పారన్నారు. మరిన్ని అదనపు నిధులు ఇవ్వాలని మంత్రి హరీశ్‌రావు కోరుతున్నట్లు అధికారులు తనకు తెలిపారన్నారు. మంత్రి హరీశ్‌రావు దగ్గరే గల్లా పెట్టె ఉందని, త్వరలోనే సమావేశం పెట్టి రహదారుల పునరుద్ధరణ, మరమ్మతులకు నిధులు కేటాయిస్తామని తెలిపారు. జూన్‌లోగా పనులు పూర్తి చేసుకోవాలని జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు.
ఏడాకులపల్లి, బడంపేట చెరువులు నిర్మించాం
తాను రవాణా శాఖ మంత్రిగా ఉన్న సమయంలో జహీరాబాద్ నియోజకవర్గంలోని రాయికోడ్, ఝరాసంగం, కోహీర్ మండలాల్లో రాత్రి, పగలు తేడాలేకుండా తిరిగి స్థానికుల సమస్యలు తెలుసుకుని పరిష్కరించానని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. ఝరాసంగం మండలంలోని ఏడాకులపల్లి, కోహీర్ మండలంలోని బడంపేడ చెరువులను నిర్మించేందుకు అప్పటి ఎమ్మెల్యే బాగన్నతోపాటు లక్ష్మారెడ్డి, గోవర్ధన్‌రెడ్డితో కలసి తిరిగి ఆ ప్రాంతాన్ని పరిశీలించి, నిర్మించినట్లు తెలిపారు. చెరువుల నిర్మాణంతో భూగర్భ జలాలు పెరిగి, వ్యవసాయనికి పుష్కలంగా సాగు నీరు లభిస్తున్నదన్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలో ఎక్కడ ఏ గ్రామముందో తనకు తెలుసన్నారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలతో వ్యవసాయ భూముల్లో బంగారు పంటలు పండుతాయని అన్నారు.