నారాయణఖేడ్, ఫిబ్రవరి 20: ‘ఈ రోజు నాకెంతో సం బురంగా ఉంది. ఈయాల నా పెద్ద కొడుకు వస్తుండు. అర్థంగాలే.. అదే సీఎం కేసీఆర్ సారు. పెద్ద కొడుకని ఎందుకన్ననో మీకు తెల్వలే గదా..! నాకు మరో రెండు పేర్లున్నయి. జిల్లా ప్రజలంతా వెనుకబాటు ప్రాంతమంటుర్రి, అధికారులంతా ‘పనిష్మెంట్ ’ ప్రాంతం అని పిలుస్తుర్రి. ఇన్నేండ్లుగా ఈ వెనుకబాటు భారాన్ని మోస్తూ అభివృద్ధి కోసం కండ్లు కాయలు కాసేలా ఎదురు చూసిన నా నిరీక్షణ ఫలించింది. నిరాదరణకు గురైన బతుకుకు భరోసా కల్పిస్తూ నా పెద్ద కొడుకు సీఎం కేసీఆర్ భూమి పుత్రుల ఆకాంక్షలను నిజం చేస్తుండు. ఏడు దశాబ్దాల బాధ అరణ్యరోదనగా మారిన చోట నేనున్నానని నా కన్నీళ్లు తుడుస్తున్నవ్. నా ప్రజలు ఇన్నేండ్లుగా కోల్పోయిన అభివృద్ధి ఫలాలను అందించేందుకు పురోగతి పుత్రుడిగా వచ్చినవ్.. సల్లంగ ఉండు కొడుకా.. సీఎం కేసిఆర్.. ఇవే నా దీవెనలు’ అంటూ తన ఆత్మకథను వివరిస్తున్నది సంగారెడ్డి నియోజకవర్గం. గతంలో ఏ ప్రభుత్వాలు చేపట్టని విధంగా వ్యవసాయరంగానికి పెద్దపీట వేస్తూ రైతన్నల శ్రేయస్సే లక్ష్యంగా నియోజకవర్గంలోని 1.71 లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు రూ.1,774 కోట్ల నిధులతో నిర్మించనున్న బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసేందుకు నేడు సీఎం కేసీఆర్ నారాయణఖేడ్‌కు వస్తున్నారు. ఈ సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.
బాధ దిగమింగుకుని బతికిన..
కేసీఆర్ సారు పుణ్యాన నాకు మంచి రోజులొచ్చిన య్ కానీ.. ఏండ్ల తరబడి ఎంతో బాధను దిగమింగుకుని బతికిన. సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలోనే మారుమూలన ఉండడమే కాక, అభివృధ్దిలో కూడా వెనకబాటుకు గురైన. అభివృధ్ది సంగతి అటుంచితే నా పేరు చెబితేనే చాలా మంది చిన్నచూపు చూసేవా రు. వెనుకబాటు ప్రాంత మంటూనే మరింత వెనుక కు నెట్టిండ్రు. ఇగ ఉద్యోగులకైతే ‘పనిష్మెంట్’ ప్రాంతమనే భావన ఉండేది. అంటే తప్పులు చేసి పట్టుబడ్డోళ్లను.. సస్పెండ్ చేసి మల్లా కొలువులకు తీసుకున్నవాళ్లను నా దగ్గరికే పంపేటోళ్లు. గట్ల నేనంటే ఆఫీసర్లకు అలుసైపోయిన. ప్రభుత్వాలు పట్టించుకోక, అధికారుల నిర్లక్ష్యంతో నా పరిస్థితి గిైట్లెంది. అనేక తండా లు, గ్రామాలకు కనీసం విద్యుత్తు సౌకర్యం లేని పరిస్థితి. వర్షాభావ పంటలను నమ్ముకుని వ్యవసాయం చేయడం అనివార్యమయ్యేది. మొత్తం వ్యవసాయ భూముల్లో దాదాపు 40శాతం బీడు భూములు కావడంతో పదుల సంఖ్యల ఎకరాల్లో భూములు ఉన్న వారు అటో ఇటో కష్టపడి వ్యవసాయాన్ని నెట్టుకొచ్చేవారు. ఇక అర, పావు ఎకరం భూములు కలిగిన వారు బతుకు దెరువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు. స్థానికంగా ఉపాధి అవకాశాలు లేని కారణంగా ప్రతి ఏటా 70శాతం మంది గిరిజనులు వలసలు వెళ్లి ఆరు నెలల పాటు జీవనం సాగించే దీనపరిస్థితి నా ప్రజలది. అలాగే విద్య, వైద్యం, రోడ్లు, మంచినీళ్లు ఇలా ఇక్కడ అన్నీ సమస్యాత్మకమే. ఇవన్నీ సమైక్య పాలనలో నేను పడిన కష్టాలు.
అదృష్టంగా భావిస్తున్నా..
బసవేశ్వర ఎత్తిపోతలకు శంకుస్థాపన సందర్భంగా సోమవారం సీఎం కేసీఆర్ నారాయణఖేడ్‌కు రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నా. సమైక్య పాలనలో వెనుకబడిన ప్రాంతంగా ఉన్న నారాయణఖేడ్ నియోజకవర్గంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ఎంతో చొరవ చూపుతున్నారు. ముఖ్యంగా కంగ్టి, మనూరు, నాగల్గిద్ద, నారాయణఖేడ్ మండలాల్లో పూర్తి సాగునీటి వనరులు లేక రైతన్నలు అవస్థలు పడుతున్నారు. మనూరు, నాగల్గిద్ద మండలాల నుంచి మంజీరా నది ప్రవహిస్తున్నా చుక్క సాగునీరు వినియోగించుకోలేని పరిస్థితి. కానీ, సీఎం కేసీఆర్ సంకల్పం ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయబోతున్నది. బసవేశ్వర ఎత్తిపోతల పూర్తయితే సుమారు 1.71 లక్షల ఎకరాలకు సాగునీరంది తరతరాలుగా ఇక్కడి రైతులు పడుతున్న బాధలు శాశ్వతంగా దూరం కానున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేస్తున్న సభకు ప్రజలు అంచనాకు మించి స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు.
– మహారెడ్డి భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్యే, నారాయణఖేడ్
నా దరికి మళ్లిన అభివృద్ధి
తెలంగాణ రాష్ట్రం సిద్ధించి సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి కావడంతో నాకు మంచి రోజులొచ్చినయ్. నియోజకవర్గ అభివృద్ధిపై ‘సారు’ ప్రత్యేక దృష్టి సారించడంతో గత రెండేండ్లుగా అభివృద్ధి పనులు వేగం పుంజుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది. ప్రజలు ఇబ్బందులు పడకుండా అన్ని సదుపాయాలు సమకూరుతున్నయ్. గతంలో సింగిల్ లేన్‌గా ఉన్న అన్ని మండల కేంద్రాల రోడ్లు ఇప్పుడు డబుల్ రోడ్లయినై. గతంలో నియోజకవర్గంలో మొత్తం 20 విద్యుత్తు సబ్స్టేషన్లు ఉండగా, మరో 15 సబ్స్టేషన్లను ఏర్పాటు చేసి నాణ్యమైన కరెంటు ఇస్తున్నారు. ఒక్క మార్కెట్‌యార్డు కూడా లేని పరిస్థితుల్లో నారాయణఖేడ్, పెద్దశంకరంపేటల్లో రెండు మార్కెట్‌యార్డులు నిర్మించారు. నూతన సాంఘిక గురుకుల భవనం ఈ ప్రాంతానికే తలమానికంగా నిలవడం నాకెంతో ఆనందాన్ని కలిగించింది. మహిళల ప్రసవాల కోసం మాతాశిశు సంక్షేమ దవాఖాన నిర్మాణం కూడా జరుగుతున్నది.
విద్యకు పెద్దపీట వేస్తూ జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా ఎనిమిది ఇంగ్లిష్ మీడియం రెసిడెన్షియల్ పాఠశాలలు, మనూరులో జూనియర్ కళాశాల ఏర్పాటు చేయడం నాపై సర్కారు చూపుతున్న చిత్తశుద్ధికి నిదర్శనం. ప్రజలను సంఘటితం చేసే ఉద్దేశంతో నారాయణఖేడ్ పట్టణంతో పాటు అత్యధిక శాతం గ్రామాల్లో కుల సంఘాల భవనాలను నిర్మించి ప్రభుత్వం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. కనీసం రోడ్డు సౌకర్యం లేని తండాలు, గ్రామాలకు రోడ్డు వేసి ప్రజల కష్టాలను తీర్చింది. ప్రధానంగా సీఎం కేసిఆర్ నల్లవాగు ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ చూపి రూ.24.14 కోట్లు మంజూరు చేసి కాలువల ఆధునీకరణ పనులను ప్రారంభించడాన్ని అభినందిస్తున్నా. ఈ ప్రాంతంలో సాగునీటి అవకాశాలు పెంపొందించేందుకు అనేక రకాలుగా ప్రయత్రాలు చేస్తున్న నీ మేలును నేను, నా ప్రజలు ఎన్నటికీ మరువం. ఇంత చేసినా 65 ఏండ్లుగా పేరుకుపోయిన సమస్యలు ఇప్పుడప్పుడే తీరేవి కావు. నేటి నీ పర్యటన సందర్భంగానైనా మరిన్ని వరాలిచ్చి మమ్ము కరుణిస్తామని ఆశిస్తున్నాం.