సంగారెడ్డి/నారాయణఖేడ్, ఫిబ్రవరి 20 : సంగారెడ్డి జిల్లా నవశకానికి రాష్ట్ర సీఎం కేసీఆర్ నాంది పలకనున్నారు. జిల్లా రైతుల నీటిగోస తీర్చే సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలకు నేడు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఈ రెండు ఎత్తిపోతలకు నారాయణఖేడ్ పట్టణంలో శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత లక్ష మందితో నిర్వహించే బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. సీఎం హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్‌లో సోమవారం మధ్యాహ్నం నారాయణఖేడ్ చేరుకుంటారు. నారాయణఖేడ్ పట్టణ శివారులో ఏర్పాటు చేసిన సభాస్థలిలో ఎత్తిపోతలకు మొదట శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
అనంతరం కొద్దిసేపు టీఆర్ఎస్ జిల్లా నాయకులు, అధికారులతో ముచ్చటించి, సాయంత్రం హైదరాబాద్‌కు తిరుగుపయనం అవుతారు. సాగునీటికి గోసపడుతున్న సంగారెడ్డి జిల్లాకు గోదావరి జలాలు తెచ్చి జిల్లాను సస్యశ్యామలంగా మార్చాలని సీఎం సంకల్పించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నుంచి సింగూరు ప్రాజెక్టులోకి గోదావరి జలాలను తరలించే ప్రక్రియను సీఎం కేసీఆర్ చేపట్టారు. త్వరలోనే ఆ పనులు పూర్తి కావడంతో పాటు గోదావరి జలాలు సింగూరు ప్రాజెక్టుకు చేరుకోనున్నాయి. అక్కడి నుంచి గోదావరి జలాలను ఎత్తిపోసి సంగారెడ్డి, జహీరాబాద్, అందో లు, నారాయణఖేడ్ నియోజకవర్గాలకు అందించేందుకు సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలను మంజూరు చేశారు. సీఎం కేసీఆర్ సోమవారం శంకుస్థాపన చేయనుండటంతో జిల్లా రైతులు, ప్రజలు సంబుర పడుతున్నారు.
లక్ష మందితో బహిరంగ సభ
సీఎం రాక కోసం సంగారెడ్డి జిల్లా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆయన పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు ఆదివారం నారాయణఖేడ్‌లో పర్యటించి సీఎం సభా స్థలం, హెలిప్యాడ్, బహిరంగ సభ వద్ద ఏర్పాట్లను పరిశీలింలి, కలెక్టర్ హనుమంతరావు, అధికారులకు సూచనలు చేశారు. సీఎం పర్యటన సందర్భంగా నారాయణఖేడ్ పట్టణం గులాబీమయంగా మారింది. ఎక్కడ చూసినా సీఎం కేసీఆర్ హోర్డింగ్‌లు, బ్యానర్లు, టీఆర్ఎస్ జెండాలు దర్శనమిస్తున్నాయి. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేసేందుకు శిలాఫలకాలను సిద్ధ్దం చేశారు.
సీఎం కేసీఆర్ వల్లే సంగారెడ్డి జిల్లా పురోభివృద్ధి : మంత్రి హరీశ్‌రావు
సీఎం కేసీఆర్ సంగారెడ్డి జిల్లా అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం సీఎం పర్యటన ఏర్పాట్లను ఆయన పరిశీలించి మాట్లాడారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలతో సంగారెడ్డి జిల్లా అన్నిరంగాల్లో మరింత అభివృద్ధి సాధిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ రూ.4427 కోట్ల నిధులతో ఈ పథకాలను నిర్మిస్తున్నట్లు చెప్పారు. గోదావరి జలాల రాకతో జిల్లా రూపురేఖలు మారుతాయన్నారు. అత్యంత వేగంగా జిల్లాకు గోదావరి జలాలు తీసుకురావాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. గోదావరి జలాలను సింగూరు ప్రాజెక్టుకు తేవడం ద్వారా ప్రజల సాగు, తాగునీటి అవసరాలు తీరుతాయన్నారు. హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ఢోకా ఉండదన్నారు.
జిల్లాకు మరిన్ని పరిశ్రమలు వస్తాయని, రాబోయే రెండేండ్ల్లలో గోదావరి జలాలు సంగారెడ్డి నేలను ముద్దాడనున్నట్లు చెప్పారు. సంగారెడ్డి, నారాయణఖేడ్, అందోలు, జహీరాబాద్ నియోజకవర్గాల రైతులు బంగారు పంటలు పండిస్తారని తెలిపారు. రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు నిండుతాయన్నారు. జిల్లాకు సీఎం కేసీఆర్ భారీగా నిధులు కేటాయించడంతో పాటు ఇటీవలే మెడికల్, నర్సింగ్ కాలేజీలను మంజూరు చేసినట్లు తెలిపారు. ఒక్క నారాయణఖేడ్ నియోజకవర్గానికి తొమ్మిది రెసిడెన్షియల్ కాలేజీలు మంజూరు చేశారన్నారు. సీఎం రాకకోసం జిల్లా ప్రజలు, రైతులు ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. మంత్రి హరీశ్‌రావు వెంట నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు, ఎస్పీ రమణకుమార్, టీఆర్ఎస్ రాష్ట్ర, జిల్లా నాయకులు ఉన్నారు.
భారీగా జన సమీకరణ
లక్ష మందికిపైగా జనంతో నారాయణఖేడ్ పట్టణ శివారులోని 30 ఎకరాల్లో బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా నలుమూలల నుంచి స్వచ్ఛందంగా రైతులు, ప్రజలు తరలిరానున్నారు. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సైతం నారాయణఖేడ్‌లో జరిగే సీఎం సభకు హాజరుకానున్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గం నుంచి 50వేల మంది మహిళలు, రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు హాజరవుతారని అంచనా. అందోలు నియోజకవర్గం నుంచి 25వేలు, సంగారెడ్డి 20వేలు, జహీరాబాద్ 20వేలు, పటాన్చెరు నుంచి 10వేల మంది రానున్నారు. వీరితోపాటు పక్కనే ఉన్న మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల నుంచి పదివేల మంది వస్తున్నారు. బహిరంగసభకు వచ్చే మహిళలు, రైతులు, ప్రజలు ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. సభ జరిగే ప్రాంతంలో టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున సీఎంకు స్వాగతం పలుకుతూ భారీ సైజులో కటౌట్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు.
సభా స్థలికి సమీపంలోనే 11 చోట్ల 300 ఎకరాల్లో వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేశారు. సీఎం రాకను పురస్కరించుకుని పోలీసులు నారాయణఖేడ్ పట్టణంతో పాటు బహిరంగసభ స్థలంలో ఎస్పీ రమణ కుమార్ పర్యవేక్షణలో భారీ బందోబస్తు చేశారు. 14 మంది డీఎస్పీలు, 49 మంది సీఐలు, 80 మంది ఎస్సైలు, 1358 మంది పోలీసు సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు. సభా వేదిక వెనుక వైపు హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేశారు.సీఎం సభ ఏర్పాట్లను కలెక్టర్ హనుమంతరావు, భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ రమణకుమార్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సభా వేదిక, హెలిప్యాడ్ సహా సభా ప్రాంగణంలో ఆదివారం పోలీసులు డాగ్‌స్కాడ్ ద్వారా తనిఖీలు నిర్వహించారు.