సంగారెడ్డి ఫిబ్రవరి 20(నమస్తే తెలంగాణ) : కండ్ల ఎదుట మంజీరా నది పారుతున్నా సాగు, తాగునీటికి ఎన్నో కష్టాలు.. కరువుతో పడావుపడిన భూములు.. ఉపాధిలేక రైతన్నల వలసలు ఇదీ సమైక్య రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లా దుస్థితి. పాలకుల నిర్లక్ష్యంతో పూర్తి వివక్షకు గురైన ఈ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా మార్చాలని నిర్ణయించారు. ప్రధానంగా సాగునీటి వనరులు పెంపొందించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. ఇప్పటికే సింగూరు ప్రాజెక్టు ద్వారా 40వేల ఎకరాలకు సాగునీరు అందిస్తుండగా, మిషన్ కాకతీయ ద్వారా జిల్లాలోని వందలాది చెరువులు, కుంటలకు మరమ్మతులు చేశారు. దీంతో రైతన్నల కష్టాలు కొద్దికొద్దిగా తొలగిపోతున్నాయి. అయి తే, సాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో తాజాగా మరో బృహత్తర ఎత్తిపోతల పథకాలకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు.
సంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేయడంతో పాటు సంగారెడ్డి, నారాయణఖేడ్, జహీరాబాద్, అందోలు నియోజవకవర్గాల్లోని 3.90లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో రూ.4427 కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ నారాయణఖేడ్‌కు విచ్చేసి ఈ పథకాలకు శంకుస్థాపన చేయనుండగా, త్వరలోనే గోదావరి జలాలు సంగారెడ్డి నేలను తాకనున్నాయని అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మల్లన్నసాగర్ నుంచి సింగూరు ప్రాజెక్టులోకి గోదావరి జలాలు తీసుకొచ్చి ఆ తర్వాత సింగూరు ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ నుంచి సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల ద్వారా జలాలను ఎత్తిపోసి సాగునీటిని అందించనున్నారు. ఇందుకు సంబంధించిన సర్వే, టెండర్ల ప్రక్రియ పూర్తి కాగా, సంగమేశ్వర ఎత్తిపోతల ద్వారా సంగారెడ్డి, అందోలు, జహీరాబాద్ నియోజకవర్గాల్లో 2.19 లక్షల ఎకరాలు, బసవేశ్వర ద్వారా నారాయణఖేడ్, అందోలు నియోజకవర్గాల్లో 1.71 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. భూసేకరణ ప్రక్రియ వేగంగా పూర్తి చేసి రెండేండ్లలో పనులు పూర్తి చేసి సంగారెడ్డి జిల్లా రైతాంగానికి గోదావరి జలాలు ఇవ్వాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.
సంగమేశ్వరతో తీరనున్న జహీరాబాద్, సంగారెడ్డి ప్రాంత రైతుల కల
సంగమేశ్వర ఎత్తిపోతల నిర్మాణంతో జహీరాబాద్, సంగారెడ్డి ప్రాంత రైతుల కల నెరవేరనున్నది. ఈ రెండు నియోజకవర్గాల నుంచి మంజీరా నది ప్రవహిస్తున్నా ఈ ప్రాంత రైతులకు సాగునీరు అందని ద్రాక్షలాగే మారింది. కాగా, ప్రస్తుతం సీఎం కేసీఆర్ సంకల్ప బలంతో జహీరాబాద్, సంగారెడ్డితోపాటు అందోలు నియోజకవర్గంలోని రెండు మండలాలకు గోదావరి జలాలు రానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రూ.2653 కోట్ల వ్యయంతో సంగమేశ్వర ఎత్తిపోతలను నిర్మించనున్నది. మల్లన్నసాగర్ ద్వారా సింగూరు ప్రాజెక్టులోకి గోదావరి జలాలను చేరుస్తారు. ఆ తర్వాత సంగమేశ్వర ఎత్తిపోతల ద్వారా 147 మీటర్ల మేర ఎత్తిపోసి సంగారెడ్డి, అందోలు, జహీరాబాద్ నియోజకవర్గాల్లోని 2.19 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం 12 టీఎంసీల జలాలను కేటాయించింది.
మొదట మునిపల్లి మండలం ఎల్లాపూర్ వద్ద నుంచి నీటిని ఎత్తిపోసి కొత్తూరులోని రిజర్వాయర్, కొంశెట్టిపల్లిలో నిర్మించే రిజర్వాయర్లలోకి తరలిస్తారు. అక్కడి నుంచి వేర్వేరు కాల్వల ద్వారా సంగారెడ్డి, జహీరాబాద్, అందోలు నియోజకవర్గాల్లోని గ్రామాలకు సాగునీటిని తరలించనున్నారు. అలాగే, చిన్నచెల్మడ, లింగంపల్లి, హోతి(కె) గ్రామాల్లో పంప్‌హౌస్‌లను నిర్మించనున్నారు. మునిపల్లి మండలం చిన్నచెల్మడలో 81 మెగావాట్ల విద్యుత్ వినియోగించే 12 పంపులు, లింగంపల్లిలో 49 మెగావాట్ల వినియోగంతో ఏడు పంపులు, జహీరాబాద్ మండలం హోతి(కె)లో 10 మెగావాట్ల వినియోగంతో రెండు పంపులు ఏర్పాటు చేయనున్నారు. మొత్తం ఆరు కాలువలను నిర్మించనుండగా, రాయికోడ్ కెనాల్ 56.85 కిలోమీటర్లు, మునిపల్లి కెనాల్ 11.40 కిలోమీటర్లు, కంది కెనాల్ 44.85 కిలోమీటర్లు, జహీరాబాద్ కెనాల్ 30.95 కిలోమీటర్లు ఉంటుంది.
అలాగే, గోవిందాపూర్ కెనాల్ 19.15 కిలోమీటర్లు, హద్నూర్ కెనాల్ 51.80 కిలోమీటర్లు ఉంటాయి. మొత్తం 215 కిలోమీటర్ల కాలువలు నిర్మించనుండగా, కాలువలు, పంప్‌హౌస్‌ల నిర్మాణం కోసం 6293 ఎకరాల భూములను సేకరించాల్సి వస్తుందని అంచనా. సంగమేశ్వర నిర్మాణం పూర్తయితే జహీరాబాద్, సంగారెడ్డి, అందోలు నియోజకవర్గాల పరిధిలో 11 మండలాల్లోని 231 గ్రామాల్లో 2.19 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ పథకానికి 140 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఎత్తిపోతల పూర్తయితే న్యాల్కల్, ఝరాసంగం, మొగుడంపల్లి, జహీరాబాద్, కోహీర్, రాయికోడ్, మునిపల్లి, సంగారెడ్డి, సదాశివపేట, కొండాపూర్, కంది మండలాలు సస్యశ్యామలం కానున్నాయి.
నారాయణఖేడ్ బీడుభూముల్లోకి గోదావరి జలాలు
సమైక్య పాలనలో గుక్కెడు నీటి కోసం నారాయణఖేడ్ ప్రజలు అల్లాడిపోయారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ హయాంలో నియోజకవర్గంలోని మారుమూల గ్రామాలు, తండాలకు సైతం మిషన్‌భగీరథ ద్వారా తాగునీరు పుష్కలంగా అందుతున్నది. తాజాగా, ఈ ప్రాంత రైతుల సాగునీటి కష్టాలకూ తెరపడనున్నది. బసవేశ్వర ఎత్తిపోతల ద్వారా గోదావరి జలాలతో నారాయణఖేడ్ భూములు కళకళలాడనున్నాయి. నారాయణఖేడ్‌తో పాటు అందో లు నియోజకవర్గంలోని వట్పల్లి, రేగోడ్ మండలాలకు సాగునీరు అందనున్నది. రూ.1714 కోట్ల వ్యయంతో బసవేశ్వర ఎత్తిపోతలను నిర్మించనుండగా, సర్వే, టెండర్ల ప్రక్రియ ముగిసింది. మనూర్ మండలం బోరంచ నుంచి 74.52 మీటర్ల ఎత్తు వరకు గోదావరి జలాలను లిఫ్టు ద్వారా ఎత్తిపోయనుండగా, మల్లన్నసాగర్ నుంచి 8 టీఎంసీలను ప్రభుత్వం కేటాయించింది. దీంతో నారాయణఖేడ్, అందోలు నియోజకవర్గాల్లోని ఎనిమిది మండలాల పరిధిలో ఉన్న 166 గ్రామాలకు చెందిన 1,71,407 ఎకరాలకు సాగునీరు అందనుంది.
ఎత్తిపోతల నిర్వహణకు 70 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతుందని అంచనా వేశారు. మనూరు మండలంలోని బోరంచ, కంగ్టి మండలంలోని రామతీర్థ్లో పంపు హౌస్‌లను ఏర్పాటు చేయనున్నారు. అలాగే, 150.10 కిలోమీటర్ల మేర కాలువలు తవ్వనున్నారు. కరస్‌గుత్తి మెయిన్ కాలువ 48.20 కిలోమీటర్లు, కరస్‌గుత్తి బ్రాంచి కాలువ 25.80 కిలోమీటర్లు, వట్పల్లి కాలువ 20 కిలోమీటర్లు నిర్మించనున్నారు. నారాయణఖేడ్ కాలువ 20 కిలోమీటర్లు, రేగోడ్ కాలువ 12.90 కిలోమీటర్లు, కంగ్టి కాలువ 16.80 కిలోమీటర్లు, అంతర్గావ్ కాలువ 16.40 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేయనున్నారు. మారుమూల ప్రాంతమైన నారాయణఖేడ్‌కు సీఎం కేసీఆర్ గోదావరి జలాలు తీసుకువస్తుండటంపై రైతులు, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పచ్చని పంటలతో తమ ప్రాంతం త్వరలోనే కళకళలాడుతుందని రైతులు సంబురపడిపోతున్నారు. నేడు సీఎం కేసీఆర్ సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేయనుండటంతో జలప్రదాత రాకకోసం అన్నదాతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.