నారాయణఖేడ్, ఫిబ్రవరి 19: బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు నారాయణఖేడ్‌కు రానున్నారు. అక్కడే భారీ బహిరంగ సభ నిర్వహిస్తుండడంతో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయి. ఖేడ్ పట్టణ సమీపంలోని మనూరు రోడ్డులో జుజాల్పూర్ శివారులో సీఎం సభాస్థలి ఏర్పాటు కోసం పనులు శరవేగంగా చేపడుతున్నారు. ఈ పనులను శనివారం మంత్రి హరీశ్‌రావు, టీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డితో కలిసి పర్యవేక్షించారు. సీఎం సభాస్థలిని సందర్శించి, ఏర్పాట్లను పరిశీలించడంతో పాటు స్వల్ప మార్పులు చేయాల్సిందిగా అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం అధికారులతో సమావేశమైన మంత్రి పట్టణ శివారులో 11 చోట్ల ఏర్పాటు చేస్తున్న పార్కింగ్ స్థలాల విషయమై చర్చించారు. పార్కింగ్ స్థలాలు సీఎం సభాస్థలికి సాధ్యమైనంత సమీపంలో ఉండేవిధంగా చూడాలని సూచించారు. పార్కింగ్ సభాస్థలికి దూరంగా ఏర్పాటు చేస్తే సభకు వాహనాల్లో వచ్చే జనం ఇబ్బందులకు గురయ్యే అవకాశమున్నదనే అభిప్రాయాన్ని మంత్రి వ్యక్తం చేశారు. పార్కింగ్ స్థలాల విషయంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలన్నారు. సభా ప్రాంగణంలో బారికేడ్లు ఏర్పాటు చేసే విషయమై తగు జాగ్రత్తలు తీసుకోవాలని, జనసమీకరణను దృష్టిలో ఉంచుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా అత్యవసర చికిత్సల కోసం వైద్యారోగ్య సిబ్బందిని అందుబాటులో ఉంచడంతో పాటు నీటి వసతి, ఇతర సదుపాయాలపై చర్చించారు. సమావేశంలో సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు, ఎస్పీ రమణకుమార్, అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, రాజర్షిషా, ఆయా శాఖల జిల్లా అధికారులు, స్థానిక అధికారులు పాల్గొన్నారు.
జన సమీకరణపై సమీక్ష..
స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి హరీశ్‌రావు పార్టీ శ్రేణులతో జన సమీకరణ విషయమై సమీక్ష జరిపారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్, ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ నేత దేవేందర్‌రెడ్డిలతో పాటు మండలాల వారీగా నియమించిన ఇన్చార్జీలు, స్థానిక టీఆర్ఎస్ ముఖ్యనేతలతో మంత్రి సమావేశమై పలు అంశాలపై చర్చించారు. భారీ జనసమీకరణే లక్ష్యంగా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం, అన్నివర్గాల సంక్షేమమే లక్ష్యంగా పథకాలను అమలు చేస్తున్న సీఎం కేసీఆర్‌కు ఘన స్వాగతం పలికేందుకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చే విధంగా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలన్నారు.