కష్టసుఖాల్లో తోడూనీడై.. ఒకరినొకరు అర్థం చేసుకుని.. పరస్పరం గౌరవించుకుంటూ జీవితాంతం అన్యోన్య దంపతులుగా బతకడం ఒక వరం. వివిధ సందర్భాల్లో తమ జీవితభాగస్వామిపై ఉన్న ప్రేమను అనేక రూపాల్లో వ్యక్త పరిచి బంధాన్ని మరింత బలపరుచుకుంటారు. అయితే, అనుకోని పరిస్థితుల్లో ఇద్దరిలో ఎవరైనా ఒకరు మరణిస్తే అది బతికి ఉన్న వారి మనస్సుకు మాయని గాయంలా మారుతుంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన తమ ప్రియమైనవారు భౌతికంగా లేకపోయినప్పటికీ ప్రతి రోజూ తమ కండ్ల ముందే ఉండేలా విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నారు ఇద్దరు వ్యక్తులు. సంగారెడ్డి జిల్లా పాశమైలారానికి చెందిన కృష్ణయాదవ్, చనిపోయిన తన భార్యకు గుడిని కట్టించి నిత్యం పూజలు చేస్తున్నాడు. అలాగే, సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం గోసాన్‌పల్లికి చెందిన కొలుగురు చంద్రాగౌడ్ మృతిచెందిన భార్య కోసం ‘రాజమణి మహల్’ను నిర్మించి విగ్రహాన్ని ప్రతిష్ఠించి హృదయ దేవతకు నిరాజనాలు పలుకుతున్నాడు. లోకంలో ప్రేమ ఒక్కటే శాశ్వతమని.. దానికి వెలకట్టలేమని చెబుతున్నారు..
పటాన్చెరు, ఫిబ్రవరి 13: ప్రస్తుత కంప్యూటర్ యుగంలో ఆప్యాయతలు, ప్రేమలు కరువయ్యాయి. ప్రతీది ఆర్థిక మూలాలతో ముడిపడిఉంది. ఇప్పుడంతా వాలెంటైన్స్‌డే అంటూ సందడి చేసే నవతరం ప్రేమికులే కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రేమ అనేది ఒక వ్యాపార సరుకుగా మారి అంగట్లో గ్రీటింగ్ కార్డులై, నగలై, బేకరీల్లో కేకులై, ఐస్‌క్రీంలు, చాక్లైట్లె ఆస్తులను కరిగిస్తున్నది. కొంతమంది నిజమైన ప్రేమికులు మాత్రమే తమ ఇష్టసఖుల హృదయాన్ని ఆరాధిస్తూ, నిండు మనస్సుతో ఒకరినొకరు అర్థం చేసుకుని జీవితాన్ని సార్థకత చేసుకుంటున్నారు. ఇలాంటి అరుదైన ప్రేమనే పున్నమ్మ, మెటే కృష్ణయాదవ్లది. సంగారెడ్డి జిల్లా పాశమైలారం ఉప సర్పంచ్‌గా సేవలందిస్తున్న కృష్ణయాదవ్, చనిపోయిన తన భార్యకు గుడిని కట్టించి నిత్యం పూజలు చేస్తున్నాడు. తనలో సగమైన భార్య మరణాన్ని జీర్ణించుకోలేక, ఆమె జ్ఞాపకాలకు ఒక రూపం కల్పించి గుడి కట్టి భార్య విగ్రహం ఏర్పాటు చేశాడు. ప్రతి రోజు భార్య విగ్రహం వద్దకు వెళ్లి దీపం వెలిగించి, పూలు చల్లి పూజలు చేస్తాడు. ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తాడు. అతడితో పాటు కుటుంబ సభ్యులందరూ పూజల్లో పాల్గొంటారు. 31ఏండ్లు కాపురం చేసిన భార్య అకస్మాత్తుగా తనను వదిలి తిరిగిరాని లోకాలకు వెళ్లినా, ఎప్పుడూ ఆమె జ్ఞాపకాలతో, ఆమె విగ్రహాన్ని చూస్తూ గడిపేస్తుంటాడు కృష్ణయాదవ్. కృష్ణయాదవ్‌కు 1987లో పున్నమ్మతో వివాహం జరిగింది. అప్పటి నుంచి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ కుటుంబాన్ని ముందుకు నడిపించింది. భర్త పరిశ్రమల్లో ఉద్యోగిగా కష్టపడి పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తూవచ్చాడు. పున్నమ్మ వ్యవసాయ పొలంలో శ్రమిస్తూ చేదోడువా
దోడుగా నిలిచేది. అయితే, భర్త పనిచేసే పరిశ్రమ మూతపడడంతో పున్నమ్మ అన్నీ తానై కుటుంబాన్ని లాక్కొచ్చింది. క్లిష్ట పరిస్థితుల్లో భర్తను వ్యాపారం చేసేందుకు ప్రోత్సహించింది. ఆమె ప్రోత్సాహంతో కృష్ణయాదవ్ ఆర్థికంగా స్థిరపడ్డాడు. వీరికి ఒక కూతురు, ఇద్దరు మగపిల్లలు సంతానం. వీరిలో ఇద్దరి పెండ్లిళ్లను పున్నమ్మ చేతుల మీదుగానే చేశారు. ఈ క్రమంలో పున్నమ్మ 2018లో కొద్దిపాటి అస్వస్థతకు గురైంది. అన్ని పరీక్షలు చేయిస్తే అది చివరి స్టేజీలో ఉన్న క్యాన్సర్‌గా తేలింది. క్యాన్సర్‌కు చికిత్స పొందుతున్న పున్నమ్మ భర్తతో మాట్లాడుతూనే మరణించింది. భార్య మరణం కృష్ణయాదవ్‌ను కలిచివేసింది. ఆమె బతికున్నప్పుడు ప్రారంభించిన ప్రతి పని విజయవంతం కావడంతో భార్యంటే కృష్ణయాదవ్‌కు అమితమైన ప్రేమాభిమానాలుండేవి. భార్య తిరిగిరాని లోకాలకు వెళ్లడాన్ని జీర్ణించుకోలేని కృష్ణయాదవ్ భార్యకోసం పొలంలో గుడి కట్టి విగ్రహాన్ని పెట్టించాడు. ఆ విగ్రహం వద్ద నిత్యం పూజలు చేయిస్తున్నాడు. శుక్రవారం రోజు కుటుంబ సభ్యులందరూ కలసి ప్రత్యేక పూజలు చేస్తారు. భార్య పున్నమ్మ విగ్రహాన్ని దర్శించుకుంటే ఆమె ఆత్మ ఎప్పుడూ తనతో ఉన్న భావన కలుగుతుందని కృష్ణయాదవ్ అంటుంటాడు. ఏడడుగులు వేసి పెళ్లి ప్రమాణాలు చేసి, తాళి కట్టిన భార్య తనను వదిలివెళ్లినా ఆమెను గౌరవిస్తూ నిజమైన ప్రేమకు నిదర్శనంగా నిలుస్తున్నాడు.
దుబ్బాక, ఫిబ్రవరి13: సతీమణిపై ఉన్న ప్రేమతో గ్రామంలో ఓ వ్యక్తి ప్రేమాలయాన్ని నిర్మించి ఆదర్శంగా నిలిచాడు. ప్రాణంగా ప్రేమించిన భార్యను గుండెల్లో పెట్టుకోవడమే కాకుండా ఆమె మరణం అనంతరం గుడి కట్టించి ప్రేమను చాటుకున్నాడు. భార్య భౌతికంగా లేకున్నప్పటికీ, ఆమె ప్రతిరూపాన్ని (విగ్రహాన్ని) ఏర్పాటుచేసి దేవతగా కొలుస్తున్నాడు. గుడి చుట్టూ పూలు, పండ్ల మొక్కలు నాటి ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించాడు. బాటసారులు, గ్రామానికి కొత్తగా వచ్చేవారికి ఆశ్రయం కల్పించేందుకు వసతిగృహం ఏర్పాటు చేశాడు. భార్య జయంతి సందర్భంగా అన్నదానం, ఆమె పేరిట గ్రామం, పాఠశాలలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు చంద్రాగౌడ్. తన కోసం అన్నీ వదిలి మెట్టింటి గౌరవాన్ని, వంశాన్ని అభివృద్ధి చేసిన అర్ధ్ధాంగికి ఏమిచ్చినా.. ఏంచేసినా
తక్కువే అంటున్నాడు.
‘రాజమణి మహల్’…
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం గోసాన్‌పల్లికి చెందిన కొలుగురు చంద్రాగౌడ్ తన మేన మరదలైన రాజమణిని 1975లో వివాహం చేసుకున్నాడు. పెండ్లికి ముందు చంద్రాగౌడ్ తన కులవృత్తి గీత కార్మికుడిగా ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. వివాహం అనంతరం భార్య రాజమణితో కలిసి నిజామాబాద్‌కు వలస వెళ్లాడు. 8వ తరగతి చదువుకున్న చంద్రాగౌడ్ ట్రాన్స్‌కో (ఎలక్ట్రిసిటీ)లో మొదట దినసరి కూలీగా చేరి, తర్వాత శాశ్వత ఉద్యోగిగా (ఎలక్ట్రిసిటీ లైన్‌మన్‌గా) విధులు నిర్వహించాడు. 34 ఏండ్లు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి, 2014 మార్చిలో ఉద్యోగ విరమణ అయ్యాడు. తన సతీమణి, పిల్లలతో కలిసి విశ్రాంత జీవనాన్ని సంతోషంగా గడపాలనుకున్నాడు. ఆ క్రమంలో రాజమణి అనారోగ్యం బారిన పడి 2015 జనవరి 5న మృతిచెందింది. దీంతో చంద్రాగౌడ్ ఎంతో వేదన చెందాడు. భార్యపై ప్రేమను గుండెల్లో పదిలంగా కాపాడుకుంటూనే, ఆమె ప్రేమకు చిహ్నంగా ఆలయాన్ని ఏర్పాటు చేయాలని భావించి, దుబ్బాక మండలం గోసాన్‌పల్లిలో రాజమణి మహల్‌ను
నిర్మించాడు.
ప్రేమకు నిదర్శనమే…
చంద్రాగౌడ్ ఉద్యోగరీత్యా నిజామాబాద్‌లో స్థిరపడినప్పటికీ, స్వగ్రామమైన దుబ్బాక మండలం గోసాన్‌పల్లిలో రెండెకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశాడు. పుట్టిన ఊరిపై మమకారం, అర్ధాంగిపై ప్రేమకు గుర్తుగా 2016లో రాజమణి ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. తన రెండకరాల వ్యవసాయ భూమిలో 6 గుంటల భూమిని సతీమణి రాజమణి ఆశ్రమం పేరిట రిజిస్ట్రేషన్ చేసి, అందులో తన హృదయ దేవతకు ఆలయాన్ని నిర్మించాడు. భార్య రాజమణి విగ్రహాన్ని తయారు చేయించి, వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. ఆశ్రమంలో రాజమణి జయంతి ఏటా ఘనంగా నిర్వహించి, అన్నదానం చేస్తున్నాడు. ఆలయంలో రాజమణి విగ్రహానికి నిత్యం జలాభిషేకం, వస్ర్తాలంకరణ, పూజా కార్యక్రమాలు చేస్తారు.
పున్నమ్మ ఆత్మ ఎప్పుడూ నాతోనే ఉంటుంది..
నా భార్య పున్నమ్మ ఆత్మ ఎప్పుడూ నాతోనే ఉందనే భావన కలుగుతుంది. ఆమె విగ్రహం వద్ద కూర్చుంటే మానసిక ప్రశాంతత లభిస్తుంది. సాక్షాత్తూ ఆమె నాతో మాట్లాడుతున్నట్లు అనిపిస్తున్నది. పున్నమ్మ నా జీవితాన్ని మార్చేసిన వ్యక్తి. ఆమె ప్రోత్సాహంతోనే నేను జీవితంలో విజయం సాధించానని అనుకుంటున్నా. ఆమె మరణం నాకు తీరనిలోటు. ఆమె జ్ఞాపకాలను మర్చిపోలేకే గుడిని కట్టి విగ్రహం పెట్టించాను. ఆమె పంచిన ప్రేమను దేనితోనూ కొలువలేను. ఆమె పేరున సేవా కార్యక్రమాలు నిర్వహించి తృప్తి చెందుతున్నా.
ఆహ్లాదకరమైన వాతావరణంలో…
పచ్చని చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణంలో రాజమణి మహల్‌ను నిర్మించారు. గోసాన్‌పల్లి-గంభీర్‌పూర్‌కు వెళ్లే దారిలో రోడ్డు పక్కనే ఈ ఆశ్రమం ఉంది. ఆలయంలో అంతర్గత సీసీ రోడ్లతో పాటు ఇక్కడికి వచ్చేవారికి ఇబ్బందులు లేకుండా వసతులు కల్పించాడు. ఆలయం చుట్టూ సుమారు 300 పూలు, పండ్ల చెట్లు ఉన్నాయి. ఆశ్రమంలో బాటసారులు, ఇతరులు సేద తీరేందుకు రెండు వసతి గృహాలను ఏర్పాటు చేశారు.
భార్యపై ప్రేమతోనే…
నేను పెండ్లికి ముందు ఎన్నో ఇబ్బందులు పడ్డాను. మేనమరదలు రాజమణిని వివాహం చేసుకున్న తర్వాత నా జీవితంలో వెలుగులు నిండాయి. మాది చాలా అన్యోన్యమైన దాంపత్య జీవితం. రాజమణి మృతిని జీర్ణించుకోలేకపోయాను. మా 40 ఏండ్ల దాంపత్య జీవితంలో ఏనాడూ నన్ను బాధ పెట్టలేదు. ఆమెపై ఉన్న ప్రేమకు గుర్తుగా మా స్వగ్రామంలో ఆలయం (ఆశ్రమం) ఏర్పాటు చేశా. జయంతితో పాటు రాజమణి పేరిట పేద విద్యార్థులకు నోటు పుస్తకాలు, గ్రామస్తులకు నాకు తోచిన సాయం చేస్తున్నా. త్వరలోనే నా విగ్రహం కూడా తయారు చేయిస్తా. నేను మరణించిన తర్వాత రాజమణి విగ్రహం పక్కనే పెట్టాలని మా పిల్లలకు, ఆశ్రమ నిర్వాహకులకు సూచించా. మనం ఎన్ని కోట్లు సంపాదించినా, అవేవి మన వెంట రావు. శాశ్వతంగా ఉండేది కేవలం ప్రేమ ఒక్కటే.
– చంద్రాగౌడ్