జహీరాబాద్, ఫిబ్రవరి 6 : ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిన అసైన్డ్ భూములపై రియల్ వ్యాపారుల కన్నుపడింది. భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసి, ప్రైవేటు అగ్రిమెంట్ చేసుకొని, ప్లాట్లు చేసి ఒక్కో ప్లాటును రూ. 5 లక్షల నుంచి 10 లక్షల వరకు విక్రయిస్తున్నా రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అసైన్డ్ భూములు అమ్మినా, కొనుగోలు చేసినా ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంటుందని చట్టాలు ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని జహీరాబాద్, అల్లీపూర్, పస్తాపూర్, చిన్న హైదరాబాద్, రంజోల్, హోతి(కే) శివారులో ఉన్న అసైన్డ్ భూముల్లో ఈ తరహా దందా జోరుగా సాగుతున్నది. ఇక్కడ రియల్ వ్యాపారులు ప్లాట్లు చేసి మున్సిపల్ అనుమతి లేకుండానే నిర్మాణాలు చేస్తున్నారు. వీటికి ట్రాన్స్‌కో అధికారులు కరెంట్ మీటర్లు సైతం ఇస్తున్నారు. అసైన్డ్ భూముల్లో ఇండ్లు లేకపోయినా మీటర్లు ఇవ్వడంతో పాటు గతంలో పంచాయతీల్లోని ఖాళీ స్థలాలకు ఇంటి నంబర్లు కేటాయించారు. కాగా, ఇంటి నంబర్లు, మీటర్ల్లతో కొందరు కోర్టుకు వెళ్లినట్లు సమాచారం. అధికారుల నిర్లక్ష్యం, రియల్ వ్యాపారుల నుంచి మామూళ్లు తీసుకుని ఇంటి నంబరు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటి స్థలం ధ్రువీకరణ పత్రాలు సృష్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో జహీరాబాద్ తహసీల్దార్‌గా పని చేసి ఉద్యోగ విరమణ చేసిన తహసీల్దార్ సంతకంతో ఇంటి స్థలం ధ్రువీకరణ పత్రాలు బయటకు వస్తున్నాయి.
బహిరంగంగా అసైన్డ్ భూముల్లో ప్లాట్ల అమ్మకాలు…
రంజోల్, అల్లీపూర్, పస్తాపూర్, చిన్న హైదరాబాద్, హోతి(కే) గ్రామ పంచాయతీలను ప్రభుత్వం జహీరాబాద్ మున్సిపాలిటీలో విలీనం చేసింది. అయితే, పట్టణ శివారులో భారీగా అసైన్డ్ భూములు ఉన్నాయి. ప్రస్తుతం భూముల ధరలు పెరిగిపోవడంతో రియల్ వ్యాపారులు అసైన్డ్ భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసి ప్లాట్లుగా మార్చి అమ్ముతున్నారు. మహీంద్రా అండ్ మహీంద్రా పరిశ్రమ రెండో గేట్ కాశీంపూర్ రోడ్డులో విలువైన భూములు ఉండగా, బాబుమోహన్ కాలనీ పక్కన ఎక్సైజ్ కార్యాలయానికి కేటాయించిన భూమి దగ్గర కూడా అసైన్డ్ భూమి ఉంది. రియల్ వ్యాపారులు వీటిని కొనుగోలు చేసి విక్రయిస్తుండగా ప్లాట్లు కొన్నవారు మున్సిపల్ అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేస్తున్నారు. అసైన్డ్ భూముల్లో రోడ్లు వేసినా రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి.
జోరుగా ప్లాట్ల విక్రయాలు..
అసైన్డ్ భూముల్లో ప్లాట్లు చేసి విక్రయిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. రియల్ వ్యాపారులకు రాజకీయ నాయకుల అండ ఉందనే ఆరోపణలు ఉండగా, విషయం ప్రజాప్రతినిధులు, అధికారులకు తెలిసినా చూసీచూడనట్లు వ్యవహరిస్తు న్నారని, డివిజన్ స్థాయి అధికారులు ఉన్నా అక్రమ నిర్మాణా లు, అక్రమ ప్లాట్లను అడ్డుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి.
అక్రమంగా ప్లాట్లు చేసినట్లు గుర్తించాం
జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని అసైన్డ్ భూముల్లో రియల్ వ్యాపారులు ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారనే ఫిర్యాదులు వచ్చాయి. మహింద్రా అండ్ మహీంద్రా పరిశ్రమ గేట్ ఎదుట ఉన్న భూమిలో ప్లాట్లు చేసి ఇండ్లు నిర్మిస్తున్నారన్న సమాచారం రావడంతో ఆర్ఐను పంపించి నివేదిక తీసుకున్నాం. నిర్మాణాలను నిలిపివేసి, తొలగించాలని ఆదేశాలు జారీ చేశాం. అక్రమంగా నిర్మిస్తే ప్రభుత్వం అసైన్డ్ భూములను గుర్తించి స్వాధీనం చేసుకుంటుంది. పంటలు సాగు చేసుకుని జీవనోపాధి పొందడం కోసం ప్రభుత్వం ఆ భూము లు ఇచ్చింది. ప్లాట్లు వేసిన భూముల వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం.
-పి. నాగేశ్వర్రావు, తహసీల్దార్, జహీరాబాద్