కండ్ల ముందు కలల సౌధం మహాద్భుతంగా వెలిసింది. దేశానికే ఆదర్శంగా టౌన్షిప్ రూపుదిద్దుకున్నది. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధి కొల్లూర్ గ్రామంలో పేదోడి గూడు సిద్ధమైంది. 124 ఎకరాల విస్తీర్ణంలో సుమారు లక్ష జనాభా ఆవాసం ఉండేలా 15,660 ఇండ్లను ఒకే చోట రాష్ట్రం ప్రభుత్వం నిర్మించింది. రూ.1432.5 కోట్లతో 117 బ్లాకులు ఏర్పాటు చేసింది. ఆధునిక హంగులతో రోడ్లు, తాగునీటి వసతి, విద్యుత్ సరఫరా ఇతర మౌలిక సదుపాయాలు కల్పించింది. ప్రాజెక్ట్ మెయింటనెన్స్ కోసం ప్రభుత్వం మరో 20ఎకరాలను అదనంగా కేటాయించింది. క్వాలిటీలో ఎక్కడా రాజీ పడకుండా ప్రాజెక్ట్ వంద శాతం పనులు పూర్తి చేసుకున్నది. ఈ నిర్మాణాలను చూసి ప్రతి ఒక్కరూ అబ్బురపడుతుండగా, త్వరలోనే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగనున్నది. ఎన్నో ఏండ్లుగా సొంతింటి కోసం కలలు కంటున్న పేదల కల సాకారం కానున్నది. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
124 ఎకరాల విస్తీర్ణంలో ఇండ్ల నిర్మాణం..
కొల్లూర్ గ్రామంలో 124 ఎకరాల విస్తీర్ణంలో రూ.1432.5 కోట్ల వ్యయంతో డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రభుత్వం నిర్మించింది. ఈ ప్రాజెక్టులో మొత్తం 117 బ్లాక్‌లు, అందులో జీ+9లో 38 బ్లాక్‌లు, జీ+10లో 24 బ్లాక్‌లు, జీ+11లో 55 బ్లాక్‌లుగా నిర్మాణాలు చేపట్టారు. ఒక్కో డబుల్ బెడ్రూం విస్తీర్ణం 580 ఎస్ఎఫ్టీ వరకు ఉంటుంది. ప్రతి బ్లాక్‌కు 2 లిఫ్ట్‌ల చొప్పున మొత్తం 234 లిఫ్ట్‌లు, జనరేటర్లను ఏర్పాటు చేశారు. ప్రతి ఫ్లోర్లో ఫైర్ సేఫ్టీని ఏర్పాటు చేశారు. 36 మీటర్లు, 30 మీటర్ల ఔటర్ రోడ్లు, 8 మీటర్లు, 6 మీటర్ల ఇన్నర్ రోడ్లను వేశారు. 12 అండర్ గ్రౌండ్ వాటర్ సంప్‌లను నిర్మించారు. ఒక్కో సంపు 11 లక్షల లీటర్ల సామర్థ్యం ఉంటుంది. 90 లక్షల లీటర్ల సామర్థ్యం గల మురుగునీటి శుద్ధి ప్లాంటును ఏర్పాటు చేశారు. వర్షపు నీటిని సంరక్షించేందుకు ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టారు. అండర్ గ్రౌండ్ ద్వారా కరెంట్ కేబుల్‌ని ఏర్పాటు చేశారు. మురుగునీటి బాక్సులపై 10.55 కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు మెయింటనెన్స్ కోసం ప్రభుత్వం మరో 20 ఎకరాలను అదనంగా కేటాయించింది. ప్రాజెక్టు నిర్మాణం పనులు వంద శాతం పూర్తి చేసుకొని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. పేదవారికి సకల సౌకర్యాలతో కూడిన సరికొత్త నివాస ప్రాంతంగా ‘కొల్లూర్ ఆదర్శ టౌన్షిప్’ నిలువనున్నది.
ప్రాజెక్టులో ఇతర సౌకర్యాలు..
కొల్లూర్ డబుల్ ఇండ్ల సమూదాయంలో బస్టాండ్, పోలీస్‌స్టేషన్, ఔట్‌పోస్టు, ఫైర్ స్టేషన్, మున్సిపల్ బిల్డింగ్, ప్రభుత్వ దవాఖాన, పీహెచ్సీ సెంటర్, గుడి, చర్చి, మూడు షాపింగ్ కాంప్లెక్స్‌లు, హైస్కూల్, అంగన్వాడీ భవనాలు, ప్రతి సెక్టార్లో పాలకేంద్రాలు, ఫంక్షన్‌హాళ్లు, శ్మశానవాటిక, ద్విచక్ర వాహనాల పార్కింగ్, బ్యాంక్, ఏటీఎంలు, పోస్టాఫీస్, మార్కెట్, పెట్రోల్ బంక్, కమ్యూనిటీ సెంటర్లు తదితర సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నారు.
15,660 ఇండ్లు ఇలా..
-జీ+9లో 38 భవనాలు 4527 ఇండ్లు, జీ+10లో 24 భవనాలు 3180 ఇండ్లు, జీ+11లో 55 భవనాలు 7953 ఇండ్లు మొత్తం 15,660 ఇండ్లను నిర్మించారు.
డబుల్ బెడ్రూం ఇండ్ల విశేషాలు..
ప్రభుత్వ దృఢ సంకల్పానికి నిదర్శనం..
ప్రభుత్వం దృఢ సంకల్పం, ఉన్నతస్థాయి అధికారులు, మంత్రుల పర్యవేక్షణ, డీఈసీ ఇన్ఫాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టు నిర్మాణ సంస్థ ప్రతినిధుల చిత్తశుద్ధి ఫలితంగానే కొల్లూర్ డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులు విజయవంతంగా పూర్తికావడం జరిగింది. ఈ ప్రాజెక్టులో మూడు షిప్ట్‌లకు గాను 6వేల మంది కార్మికులు పనిచేయగా, . 500 మంది స్టాఫ్ ఉద్యోగులు నిర్మాణ పనులను పర్యవేక్షించారు. కొల్లూర్‌లో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులను చూసి ప్రతిఒక్కరూ అబ్బురపడుతున్నారు. రాష్ట్ర మున్సిపాల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ఈ ప్రాజెక్టును పలుమార్లు సందర్శించి పనుల పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. అధికారులు, ప్రాజెక్టు ప్రతినిధులతో సమీక్షలు నిర్వహించి, పనుల్లో వేగం పెంచారు. ప్రస్తుతం పనులు వందశాతం పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నది.
దేశానికి రోల్ మోడల్‌గా కొల్లూర్ టౌన్షిప్..
కొల్లూర్‌లో నిర్మించిన టౌన్షిప్ దేశానికి రోల్ మోడల్‌గా నిలువబోతుంది. పేదల సంతోషం కోసం ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుంది. ఒకేచోట లక్ష జనాభా ఆవాసం ఉండే విధంగా 15,660 ఇండ్లను కట్టడ ఆషామాషీ కాదు. టీఆర్ఎస్ ప్రభు త్వం దృఢసంకల్పంతో చేసిన పని ఇది. గరీబోడు తలెత్తుకొని సగౌరవంగా బతికేలా డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మా ణం చేపడుతుంది. ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న విమర్శలకు కొల్లూర్ డబుల్ ఇండ్లు సమాధానం చెప్పబోతున్నాయి. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను ప్రభుత్వం నిలబెట్టుకుంటుంది.