వట్పల్లి, జనవరి 29 : సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకంతో దళిత కుటుంబాల్లో వెలుగులు నిండడం ఖాయమని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. దళితులు కోటీశ్వర్లు కావాలని, ప్రభుత్వం ఇచ్చే రూ.10 లక్షలతో వ్యాపారం చేసి, ఒకటికి రెండింతలతో ఎదగాలన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం బుడ్డయిపల్లి (బిజిలీపూర్) గ్రామంలో దళితబంధు లబ్ధిదారులతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దళితబంధుతో మీ జీవన శైలి విధానంలో మార్పురావాలన్నారు. దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం ప్రవేశపెట్టారన్నారు. దళితబంధు పైలెట్ ప్రాజెక్ట్‌కు నియోజకవర్గంలోని బుడ్డాయిపల్లిని ఎన్నుకున్నారన్నారు. గ్రామంలోని 37మందితో లబ్ధిదారుల నివేదిక సిద్ధం చేశామన్నారు. ఇందులో ఒక్కో లబ్ధిదారుడికి రూ. 9.90 లక్షలు అందజేయగా, వాటిలో దళిత రక్షణ నిధి కింద రూ.10 వేలు జమ చేస్తారన్నారు. పేదరిక నిర్మూలన కోసం ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు జిల్లాలో ఐదు సెక్టార్ రిసోర్స్పర్సన్లను నియమించామన్నారు. ఎంపికైన లబ్ధిదారులకు పథకంపై అవగాహన కల్పిస్తారని వివరించారు. లబ్ధిదారులకు అవసరమైన కుల, ఆదాయ సర్టిఫికెట్లు, బ్యాంక్ అకౌంట్లు, వాహనదారులకు అవసరమైన లైసెన్స్ సైతం మీ గ్రామంలోనే అందిస్తామన్నారు.
దళితబంధును వినియోగించుకోవాలి
దళితబంధును దళితులు సక్రమంగా వినియోగించుకోవాలని లబ్ధిదారులకు ఎమ్మెల్యే క్రాంతికిరణ్ వివరించారు. డెయిరీ ఫామ్‌తో అధిక లాభాలు పొందవచ్చన్నారు. మేకల పెంపకం, వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి, లాభాలు గడించాలన్నారు. దళితులు సైతం కోటీశ్వర్లు కావాలి.. అందుకు ప్రభుత్వం అందించిన రూ.10 లక్షలతో ప్రారంభించి ఒకటికి రెండింతలతో ఎదగాలన్నారు. జేసీబీలు, వరి కోత మిషన్లతో వ్యాపారం చేయాలనుకుంటే ఇద్దరు కలిసి యూనిట్‌ను ఎంపిక చేసుకోవాలని సూచించారు.
దళితబంధుతో బంగారు బాట
దళితబంధు పథకంతో మీ భవిష్యత్‌కు బంగారు బాటలు వేసుకోవాలని అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ కోరారు. ముందు తరాలకు ఆదర్శంగా నిలిచేలా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న దళితబంధు ఆర్థిక సాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సంగారెడ్డి అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, రాజర్షి షా, ఆర్డీవో అంబాదాస్ రాజేశ్వర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబూరావు, మండల ప్రత్యేకాధికారి పీరంగి, విజయ డెయిరీ డీడీ మోహన్ మురళి, బీసీ వెల్ఫేర్ అధికారి జగదీశ్, డీసీసీబీ సీఈవో శ్రీనివాస్, ఎంవీఐ శ్రీనివాసులు, ఏడీఏ హరిత, ఎంపీడీవో యూసుఫ్, సర్పంచ్ పద్మారావు, ఎంపీటీసీ నవీనసదానందం, మార్కెట్ కమిటీ చైర్మన్ రజినీకాంత్, వరము అధ్యక్షుడు వీరారెడ్డి, జాగృతి రాష్ట్ర నాయకుడు భిక్షపతితో పాటు ఆయా శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.