పటాన్చెరు/న్యాల్కల్/రాయికోడ్/రామచంద్రాపురం, జనవరి 29 : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల పరిధి బీడీఎల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన మిస్సింగ్ హత్యగా తేలింది. రామచంద్రాపురం మండలం వెలిమెల తండావాసి కడవత్ రాజు(32)ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. తల, మొండెం వేరుగా చేసి, వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలో పారవేయడం సంచలనంగా మారింది. బీడీఎల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని వెల్లిమల తండాకు చెందిన రియల్ వ్యాపారి, టీఆర్ఎస్ ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు కడవత్ రాజు కనబడటం లేదని ఈ నెల 24న కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. 25న పోలీసులు ఎఫ్ఐఆర్ చేసి, ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. అయితే, ఇంద్రకరణ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తులు రాజును దారుణంగా హత్యచేసి తల, మొండెం వేరు చేసి, వివిధ ప్రాంతాల్లో పడేసినట్టు పోలీసులకు తెలిసింది. హత్యకు పాల్పడిన ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. రాజు తల, మొండెం రాయికోడ్ మండలం కుస్నూర్ వాగు, న్యాల్కల్ మండలం రాఘవపూర్ గ్రామ శివారులోని మంజీర నదిలో పడేసినట్లు నిందితులు పోలీసులకు తెలిపారు.
దీంతో శనివారం ఉదయం గాలింపు చేపట్టగా, వాగులో తల లభించింది. అక్కడి నుంచి మండలంలోని రాఘవపూర్ శివారులోని మంజీరా నది బ్రిడ్జి సమీపంలో గాలింపు చేపట్టగా, మొండెం లభించింది. దీంతో తల, మొండెంను భానూర్ పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం జహీరాబాద్‌కు తరలించారు. సంఘటనా స్థలానికి పటన్‌చెరు, జహీరాబాద్ డీఎస్పీలు భీంరెడ్డి, శంకర్‌రాజ్, రాయికోడ్ ఎస్సై ఏడుకొండలు, భానూర్ పోలీసులు సందర్శించారు. హతుడు రాజుకు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ వెలిమల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసులో కీలక ఆధారాలు పోలీసులు సేకరించారని, త్వరలోనే కేసు చిక్కుముడి వీడిపోతుందని విశ్వసనీయ సమాచారం.
భూవివాదాలే కారణం?
భూ తగాదాల కారణంగానే రాజు హత్య జరిగినట్లు ప్రాథమికంగా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తున్నది. ఆయా పోలీస్స్టేషన్ల నుంచి సమాచారం తెలుసుకున్న బీడీఎల్ పోలీసులు డీఎస్పీ భీంరెడ్డి ఆధ్వర్యంలో పోలీసు బృందం దర్యాపు ముమ్మరం చేశారు. ఈ నెల 24న రాజు నాయక్‌కు ఓ ఫోన్ కాల్ రావడంతో ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన తిరిగి రాలేదు. సరిగ్గా ఐదు రోజుల తర్వాత అతను హత్యకు గురయ్యాడని తెలిసి కుటుంబ సభ్యులు, తండా వాసులు బోరున విలపిస్తున్నారు. రాజునాయక్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. కొంత కాలంగా సందుగూడెం తండాలో ఓ భూమి విషయమై రాజునాయక్‌కు ఇతరులకు గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో హత్యకు గురై ఉంటాడని తండాలో మాట్లాడు కుంటున్నారు. ఇదిలా ఉంటే, 1990లో రాజునాయక్ తండ్రి కూడా హత్యకు గురయ్యాడు. ఒకే కుటుంబంలో నాడు తండ్రి, నేడు కొడుకు ఇద్దరు హత్యకు గురికావడం అందరి హృదయాలను కలిచివేస్తుంది.