సంగారెడ్డి కలెక్టరేట్, జనవరి 29: గ్రామీ ణ ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులకు మూడు నెలల ఉచిత నైపుణ్య శిక్షణ అందిస్తున్నట్టు సంగారెడ్డి కలెక్టర్ ఎం.హనుమంతరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దీన్‌దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్య యోజనలో భాగంగా గ్రామీణాభివృద్ధి సంస్థ సెర్ఫ్, తెలంగాణ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్ ద్వారా జిల్లాలోని గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులకు మూడు నెలల పాటు ఉచిత నైపుణ్య శిక్షణ ఇచ్చి, ఉపాధి కల్పించనున్నట్లు వెల్లడించారు. ఇంగ్లిష్ వర్క్ రెడీనెస్ ఆండ్ కంప్యూటర్ కోర్స్‌లో కంప్యూటర్ నైపుణ్యత, స్పోకెన్ ఇంగ్లిష్, సాఫ్ట్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్, టైపింగ్, అర్థమెటిక్, హిందీ, గ్రూమింగ్, ఇంటర్వ్యూ స్కిల్స్ తదితర అంశాలపై శిక్షణ ఉంటుందని వివరించారు. అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణత, ఇంటర్ ఆపై విద్యార్హతలు కలిగిన వారు అర్హులన్నారు. వయస్సు 19 నుంచి 26 ఏండ్ల లోపు ఉండాలన్నారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఈడబ్ల్యూఆర్‌సీ శిక్షణ బ్యాచ్ ప్రారంభం కానుందని తెలిపారు. శిక్షణాకాలంలో ఉచిత హాస్టల్, భోజన వసతి కల్పించడం జరుగుతుందన్నారు. శిక్షణ అనంతరం సంబంధిత రంగంలో ఉపాధి చూపిస్తామన్నారు. ఆసక్తి, అర్హత గల యువతీ యువకులు తమ విద్యార్హత సర్టిఫికెట్లు, రేషన్ కార్డ్ జిరాక్స్‌తో పాటు నాలుగు పాస్ పోర్టుసైజ్ ఫొటోలతో సంగారెడ్డి బైపాస్ రోడ్డులోని పాత డీఆర్డీఏ కార్యాలయానికి ఫిబ్రవరి 1 నుంచి నేరుగా హాజరు కావచ్చన్నారు.