పటాన్చెరు టౌన్, జనవరి 28 : ఫోర్జరీ సంతకంతో ప్లాట్‌ను డబుల్ రిజిస్ట్రేషన్‌కు పాల్పడిన నలుగురు వ్యక్తులను పటాన్చెరు పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు డిమాండ్‌కు తరలించారు. పటాన్చెరు సీఐ వేణుగోపాల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామంలోని సర్వే నంబర్ 138/108లోని వికాస్ సొసైటీ వెంచర్‌లోని ప్లాట్ నెంబర్ 689లోని ఐదు వందల గజాల స్థలానికి రాజారత్నం సొంతదారుడు. రాజారత్నం చనిపోవడంతో ఆ ప్లాట్‌ను అతడి భార్య వర్జీనియా ఈసీలు తీసి పరిశీలించగా, వేరేవారు రిజిస్ట్రేషన్ చేసినట్లుగా గుర్తించింది. ఈ నెల 25న ఆమె పటాన్చెరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసుల విచారణలో నగరంలోని అమీర్‌పేటకు చెందిన కే మురళీకృష్ణ (37) తన తండ్రి కే లక్ష్మయ్య (72)తో కలిసి మరో వ్యక్తికి చెందిన ఆధార్‌కార్డులో పేరును మార్చి, గుర్తుతెలియని వ్యక్తి అతడి వద్ద ఈ ప్లాట్ డాక్యుమెంట్ కుదువ పెట్టినట్టుగా పేర్కొంటూ మార్కెట్లో ప్లాట్‌ను అమ్మేందుకు బ్రోకర్ సాయం తీసుకున్నాడు. కూకట్‌పల్లిలో అనిరుధ్‌రెడ్డి (28) అనే మీ సేవా నిర్వాహకుడి సాయంతో వేరే వారి ఆధార్‌ను మార్చారు. ఇతర వ్యక్తి ఆధార్‌ను ఉపయోగించి డబుల్ రిజిస్ట్రేషన్‌కు పాల్పడ్డారు. డబుల్ రిజిస్ట్రేషన్ చేసేందుకు బీ బాలకృష్ణ (40), సుధీర్‌కుమార్ (36) వివిధ రకాలుగా మోసపూరితంగా వ్యవహరించారు. దర్యాప్తులో మురళీకృష్ణ కీలక సూత్రదారిగా గుర్తించగా, అతడు పరారీలో ఉన్నాడు. మిగిలిన నలుగురు నిందితులు లక్ష్మయ్య, బాలకృష్ణ, సుధీర్‌కుమార్, అనిరుధ్రెడ్డిను అరెస్టు చేసి వారి వద్ద నుంచి ఫోర్జరీ సంతకం చేసిన డాక్యుమెంట్లు, దొంగ ఆధార్‌కార్డు, రూ.4.50లక్షల నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. డబుల్ రిజిస్ట్రేషన్ చేసిన నలుగురుని పోలీసులు కోర్టుకు హాజరుపర్చారు. సమావేశంలో పటాన్చెరు పోలీసులు పాల్గొన్నారు.