రామచంద్రాపురం, జనవరి 4: స్వార్థ రాజకీయాల కోసం ప్రతిపక్ష నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూడటం సరైన పద్ధతి కాదని తెల్లాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ లలితాసోమిరెడ్డి మండిపడ్డారు. పూటకో మాట మారుస్తూ రిలే దీక్షలు చేస్తున్నారని, వాళ్లు ఎందుకు దీక్షలు చేస్తున్నారో ఎవరికీ అర్థం కాని పరిస్థితి ఉన్నదని ఎద్దేవా చేశారు. విలేకరుల సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ లలితాసోమిరెడ్డి మాట్లాడుతూ తెల్లాపూర్‌లోని పలు కాలనీల డ్రైనేజీ నీరు వనం చెరువులోకి వస్తుండడంతో గతం లో మాజీ సర్పంచ్ సోమిరెడ్డి హయాంలో అంతర్గత డ్రైనే జీ లైన్లు వేయించి మురుగునీరు వెళ్లకుండా చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం నలగండ్ల నుంచి డ్రైనేజీ నీరు చెరువులోకి వస్తున్నాయని, ఎస్టీపీ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గాంధీ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ఎస్టీపీ ఏర్పాటుకు హామీ ఇచ్చారని తెలిపారు. ఎస్టీపీ ఏర్పాటుకు కనీసం రూ.15కోట్ల వరకు ఖర్చవుతుందన్నారు. ఏదైనా అభివృద్ధి పని జరగాలంటే సుమారుగా 8నెలల సమయం పడుతుందని, ఎస్టీపీ ఏర్పాటు చేయిస్తామని చెప్పినా వినకుండా దీక్షలు చేయడం సరికాదన్నారు. మున్సిపల్ పరిధిలో రెండేండ్ల కాలంలోనే రూ.22 కోట్ల అభివృద్ధి పనులు చేశామని, మరో రూ.4కోట్ల పనులు జరుగుతున్నాయని తెలిపారు. గతంలో సోమిరెడ్డి సర్పంచ్‌గా ఉన్నప్పుడు తెల్లాపూర్‌కు దేశంలోనే బెస్ట్ గ్రామపంచాయతీ అవార్డు వచ్చిందని గుర్తుచేశారు.
తెల్లాపూర్ ప్రజా అవసరాల కోసం రూ.100కోట్ల విలువ చేసే 2ఎకరాల భూమిని ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. కొల్లూర్‌లో 5ఎకరాల భూమిని చెత్త డంపింగ్ యార్డుకు ప్రభుత్వం కేటాయించిందన్నారు. అరబిందో ఫార్మా సహకారంతో హైస్కూల్, దాతల సహకారంతో ప్రస్తుత మున్సిపల్ భవనం కట్టించామన్నారు. వచ్చే మే నెల వరకు ఎం ఐజీకి ఫైనల్ లేఅవుట్, బీరప్ప ఆలయం, ముదిరాజ్, యాదవ సంఘాల భవనాలు ఏర్పాటు చేయకపోతే స్వ చ్ఛందంగా పదవి నుంచి తప్పుకొని ఐదేండ్ల పాటు పోటీ చేయనన్నారు. ఒక వేళ సమస్యలను పరిష్కరిస్తే దీక్షలు చేస్తున్న వారు ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీక్షలు చేస్తున్న వారే గతంలో తెల్లాపూర్ వెంచర్లపై గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసులు వేశారని, ఎందుకు వాటిని డిస్మెంటల్ చేయించలేకపోయారని ప్రశ్నించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రూలింగ్‌లో ఉండి కూడా తానే కోర్టుకు వెళ్లానన్నారు.
అభివృద్ధి కావాలంటే దీక్షలు చేయడం కాదని తమతో కలిసి రావాలని సూచించారు. మంత్రి హరీశ్‌రావు, ఎంపీ, ప్రొటెం చైర్మన్, ఎమ్మెల్యే సహకారంతో తెల్లాపూర్ మున్సిపాలిటీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. రిలే దీక్షలకు మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కాటశ్రీనివాస్గౌడ్ తమని విమర్శిస్తూ మాట్లాడారని, సర్పంచ్‌గా ఆయన అమీన్పూర్లో వందకుపైగా అక్రమ లేఅవుట్లకు అనుమతులు ఇచ్చి పదవి నుంచి సస్పెండ్ అయ్యారని విమర్శించారు. ఎక్కడ కూడా అవినీతి, అక్రమాలకు పాల్పడకుండా నిస్వార్థమైన పాలనను ప్రజలకు అందిస్తున్నామని, అందుకే ప్రజలు తమని గెలిపిస్తున్నారని అన్నారు. రాజకీయంగా తమను ఎదుర్కోలేకనే దీక్షల పేరిట దొంగ నాటకాలు ఆడుతూ తమని బద్నామ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని, వారి ప్రయత్నాలను ప్రజలు నమ్మరని తెలిపారు.