సంగారెడ్డి/మెదక్/సిద్దిపేట టౌన్, నవంబర్ 19:దరఖాస్తుదారులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తుండగా, మరికొద్ద్ది గంటల్లో మద్యం దుకాణాల కేటాయింపులకు సంబంధించి నేడు లక్కీ డ్రా తీయనున్నారు. ఇందులో అదృష్టం ఎవరిని వరించనుందో తేలనుంది. నూతన మద్యం పాలసీకి అనూహ్య స్పందన వచ్చింది. మెదక్ జిల్లాలో 49 షాప్‌లకు 829 మంది, సిద్దిపేటలో 93 షాప్‌లకు 1703 మంది, సంగారెడ్డిలో 101 షాప్‌లకు 2310 మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో మహిళలు సైతం ఉన్నారు. కలెక్టర్లు, అధికారులు లక్కీడ్రా తీయనున్నారు. దీనికి అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 10గంటల నుంచి ప్రక్రియ ప్రారంభం కానున్నది. డ్రాలో పేరు వచ్చిన సమయంలో అక్కడ లేకపోతే రూ.5 లక్షల ఫైన్ చెల్లించాల్సి ఉంటుందనీ నిబంధన విధించడంతో దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు.
సంగారెడ్డి/మెదక్/సిద్దిపేట టౌన్, నవంబర్ 19 : లక్కు ఎవరికి దక్కనున్నదో అని వైన్స్‌లకు దరఖాస్తు చేసుకున్న వారు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో దరఖాస్తు చేసుకుని డ్రాలో పేరు వచ్చిన తర్వాత అక్కడ లేని దరఖాస్తుదారుడు రూ.5లక్షల ఫైన్ చెల్లించాల్సి ఉంటుందని తెలిసి ఆందోళన చెందుతున్నారు. నేడు(శనివారం) మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో వైన్స్‌షాపులకు ఆయా కలెక్టర్ల చేతుల మీదుగా లక్కీడ్రా తీయనున్నారు.
సంగారెడ్డిలో 101కి 2310 దరఖాస్తులు
సంగారెడ్డి జిల్లాలో 101 వైన్స్‌లకు 2310 మంది దరఖాస్తు చేసుకున్నారు. వైన్స్ దుకాణాలను దక్కించుకునేందుకు ఈసారి 290 మంది మహిళలు దరఖాస్తులు చేసుకున్నారు. నేడు ఉదయం 10.30 గంటలకు సంగారెడ్డి పట్టణ సమీపంలోని పోతిరెడ్డిపల్లి ఎం బీఆర్ గార్డెన్స్‌లో డ్రా నిర్వహణకు ఎక్సైజ్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టర్ హనుమంతరావు డ్రా తీసి వైన్స్‌లను కేటాయించనున్నారు. దరఖాస్తుదారులంతా డ్రా కేంద్రానికి రావాల్సి ఉండడంతో అంతమందికి తగిన ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గాయత్రి తెలిపారు. దరఖాస్తుదారులతో ప్రభు త్వ ఖజానాకు రూ.46.20 కోట్ల ఆదాయం వచ్చినట్లు చెప్పారు.
10 గంటల నుంచి డ్రా మొదలు..
ఉదయం 10గంటల నుంచి వైన్స్‌లకు డ్రా తీయనున్నారు. పోతిరెడ్డిపల్లిలోని ఎంబీఆర్ గార్డెన్స్‌లో ఇందుకోసం ఏర్పాటు చేస్తున్నారు. అయితే పెద్దఎత్తున దరఖాస్తుదారులు కేంద్రానికి రానున్న నేపథ్యంలో తగిన కుర్చీలు, ఇతర ఏర్పాట్లు చేస్తున్నారు. వైన్స్‌ల వారీగా డ్రా తీయడానికి వరుస క్రమంలో డ్రా ప్రక్రియను కొనసాగించనున్నారు. ముందుగా కేంద్రానికి వచ్చిన వారిని ఎక్సైజ్ సిబ్బంది వరుస క్రమంలో కూర్చోబెడతారు. డ్రా తీసే వైన్స్ వివరాలు వెల్లడిస్తూ డ్రా ప్రక్రియ చేపడతారు. డ్రాలో వెళ్లిన పేరును అక్కడే ప్రకటించి మ ద్యం దుకాణం సదరు వ్యక్తులకు కేటాయిస్తారు. ఉదయం 10 గం టల నుంచి మొదలయ్యే డ్రా ప్రక్రియ మద్యాహ్నం ఒంటిగంట నుం చి రెండు గంటల వరకు పూర్తవుతుందని అధికారుల సమాచారం.
డ్రాలో పేరొచ్చిన వారు అక్కడ ఉండాల్సిందే..
దరఖాస్తు చేసుకున్న వారు డ్రా తీసే కేంద్రానికి రావాల్సి ఉం టుంది. దరఖాస్తుదారుడు కేంద్రానికి రాకపోయిన అతని నెంబరు కూడా డ్రా తీస్తారు. పేరు అతడిదే వస్తే మాత్రం తప్పని సరిగా 5 నిమిషాల్లో అక్కడ ఉండాలి. పలుమార్లు డ్రాలో వెళ్లిన పేరును అధికారులు పిలుస్తారు. అప్పటికీ రాని పక్షంలో అతని పేరు తొలిగించి, తిరిగి డ్రా నిర్వహిస్తారు. అప్పుడు డ్రాలో వచ్చిన మరొకరి పేరును అధికారులు ప్రకటిస్తారు. అయితే మొదట డ్రాలో పేరు వెళ్లినప్పటికీ అక్కడికి రాని వ్యక్తి నుంచి ఎక్సైజ్ అధికారులు రూ.5 లక్షలు వసూ లు చేస్తారు. దరఖాస్తు పత్రంలోనే సదరు దరఖాస్తుదారు ఈ నిబంధనకు ఒప్పుకుని సంతకాలు చేశారు. ఈ విషయంపై చాలా మంది దరఖాస్తుదారులకు అవగాహన లేకపోవడం గమనార్హం. కొందరు ఏదో పేరు కోసం దరఖాస్తు చేసి చివరి క్షణంలో డ్రా వద్దకు వెళ్లకపోతే, అప్పుడు అతని పేరు వెళితే మాత్రం ఇబ్బందులు తప్పవు.
డ్రా కేంద్రం వద్దే నాల్గోవంతు చెల్లించాలి..
డ్రా ద్వారా వైన్స్ దక్కించుకున్న వారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్లాబ్‌లో మూడోవంతు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు రూ.50 లక్షల స్లాబులో ఉన్న వైన్స్‌ను దక్కించుకున్న వారు రూ.16.66 లక్షలు చెల్లించాల్సి ఉంటుందన్నమాట. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం మిగతా లైసెన్సు ఫీజు చెల్లింపు విషయంలో జాప్యం చేస్తే లైసెన్సును రద్దు చేసే అవకాశం అధికారులకు ఉన్నది. జిల్లాలో రూ.1.10 లక్షల స్లాబ్ పరిధిలో 630 దరఖాస్తులు, రూ.60 లక్షల పరిధిలో 441 దరఖాస్తులు, రూ.55 లక్షల పరిధిలో 593 దరఖాస్తులు, రూ.50 లక్షల స్లాబ్‌లో 646 దరఖాస్తులు వచ్చాయి. డ్రాలో పేరు వచ్చిన తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చలానా ద్వారా చెల్లించవచ్చు. నగదు రూపంలో చెల్లించినా స్వీకరిస్తామని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గాయత్రి వివరించారు.
మెదక్ కలెక్టరేట్లో ఏర్పాట్లు పూర్తి..
మద్యం దుకాణాల కేటాయింపునకు సంబంధించి మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ హరీశ్ డ్రా తీయనున్నారు. లక్కీ డ్రా తీసేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో 49 మద్యం షాపులకు గాను 829 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో 128మంది మహిళలు దరఖాస్తులు అందించారు. దీంతో ఎక్సైజ్ శాఖకు రూ.16 కోట్ల 55 లక్షల ఆదాయం సమకూరింది. అయితే జిల్లాలో 49 మద్యం దుకాణాలకు గాను 16 దుకాణాలను ఎస్సీ, ఎస్టీ, గౌడలకు కేటాయించారు. కొత్త పాలసీ ప్రకారం లైసెన్స్ 2023 డిసెంబర్ వరకు గడువు ఉంటుంది.
సిద్దిపేటలోని విపంచి కళానిలయంలో..
సిద్దిపేట పట్టణంలోని విపంచి కళా నిలయంలో మద్యం డ్రాను ఉదయం 11 గంటల నుంచి కలెక్టర్ హనుమంతరావు లక్కీడ్రాను తీయనున్నారు. అందుకనుగుణంగా ఎక్సైజ్ శాఖ అన్ని ఏర్పాట్లు చేపట్టింది. సిద్దిపేట జిల్లాలోని 93 మద్యం షాపులకు ఏకంగా 1703 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ లెక్కన ఎక్సైజ్ శాఖకు రూ.34 కోట్ల పైచిలుకు ప్రభుత్వ ఖజానాలో జమ అయ్యాయి. ప్రభుత్వం 2019 మద్యం పాలసీకి 1336 దరఖాస్తులు రాగా 2021 మద్యం పాలసీలో అదనంగా 400 వరకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. ప్రభు త్వం గౌడ సామాజిక వర్గానికి 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్ కల్పించింది. గౌడ కులస్తులు 242 దరఖాస్తులు సమర్పించగా ఎస్సీలు 158 టెండర్లు వేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా మహిళలు 192 దరఖాస్తులు చేసి ఆశ్చర్యపర్చారు. పాలమాకుల, కొమురవెల్లి, మద్దూరు దుకాణాలకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. అత్యధికంగా హుస్నాబాద్ ఎక్సైజ్ సర్కిల్ పరిధికి 469, సిద్దిపేటకు 440, గజ్వేల్‌కు 407, చేర్యాల 259, చివరి స్థానంలో మిరుదొడ్డి 128 దుకాణాల కోసం టెండర్లు వ్యాపారులు సమర్పించారు. కాగా, డ్రా నేపథ్యంలో ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరికొన్ని గంటల్లో అదృష్టవంతులెవరో తేలనుంది.