సంగారెడ్డి కలెక్టరేట్, నవంబర్ 19: రైతుబంధు డాటాలో నమోదు లేకున్నా, పంట వివరాలు తప్పుగా నమోదైన రైతుల నుంచి కూడా ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని సం గారెడ్డి కలెక్టర్ హనుమంతరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు తమ భూమి దస్తావేజులు లేదా పత్రాలు, బ్యాంకు ఖాతా వివరాలు, ఆధార్‌కార్డు, వ్యవసాయ విస్తరణ అధికారికి ఇవ్వాలని సూచించారు. గ్రామంలో వ్యవసాయ విస్తరణ అధికారి, రైతుబంధు సమితి కోఆర్డినేటర్ విచారణ చేసి వ్యవసాయ అధికారికి సిఫారసు చేయాలని స్పష్టం చేశారు. వ్యవసాయ అధికారి రైతుల వివరాలను ధాన్యం కొనుగోలు సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేసి టోకెన్‌ను ఏఈవోకు అందజేస్తారని వెల్లడించారు. ఏఈవో సదరు టోకెన్‌ను రైతుకు జారీ చేయాలని, టోకెన్ ఫొటో తీసి ధాన్యం కొనుగోలు కేంద్రం ఇన్చార్జికి వాట్సాప్ చేయాలని సూచించారు. టోకెన్ల వారీగా ధాన్యం కొనుగోలు ఇన్చార్జి సంబంధిత రైతుల నుంచి ధాన్యం కొనాలని కలెక్టర్ ఆదేశించారు. రైతులు తమ ఆధార్ కార్డుకు లింకు అయిన ఫోన్ నెంబరుకు వచ్చే ఓటీపీని కొనుగోలు కేంద్రం ఇన్చార్జికి తెలియజేయాలన్నారు. పీపీసీ ఇన్చార్జి ఓటీపీ నమోదు చేసి ధాన్యం కొనుగోలు వివరాలను సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేసి కొనుగోలు పూర్తి చేయాలని సూచించారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులపై సూచనల మేరకు జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా పూర్తి చేసేలా సహకరించాలని కోరారు.