జహీరాబాద్, నవంబర్ 14 : నిషేధిత వస్తువులు, గంజాయి, గుట్కా, మద్యం అక్రమ రవాణా కాకుండా ఉండేందుకు తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో ప్రభుత్వం పోలీసు, రవాణా, ఎక్సైజ్ శాఖ చెక్‌పోస్టులను ఏర్పాటు చేసింది. రవాణా శాఖ చెక్‌పోస్టు వద్ద మహారాష్ట్ర, కర్ణాటక వైపు నుంచి తెలంగాణలోకి వచ్చే వాహనాలను, తెలంగాణ నుంచి కర్ణాటక, మహారాష్ట్ర వైపు వెళ్లే వాహనాలను తనిఖీ చేసి పంపిస్తారు. అనుమతి లేని వాహనాలు నిలిపివేస్తారు. వీటితో పాటు 65వ జాతీయ రహదారిపై జహీరాబాద్-బీదర్ రోడ్డులో గణేశ్‌పూర్ శివారులో పోలీసు చెక్‌పోస్టు వద్ద ఇద్దరు ఎస్సైలు, కానిస్టేబుల్ వాహనాలను తనిఖీ చేసే వారు. ప్రస్తుతం అధికారులు ఎస్సైలు, సిబ్బందిని నియమించకపోవడంతో ఈ చెక్‌పోస్టులను మూసివేశారు. దీంతో ప్రతిరోజూ గుట్కా ప్యాకెట్లు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి వస్తున్నాయి. ఎక్సైజ్ శాఖ చెక్‌పోస్టులో మహారాష్ట్ర, కర్ణాటక వైపు నుంచి వచ్చే వాహనాలను తనిఖీ చేస్తారు. తెలంగాణ నుంచి అటు వైపు వెళ్లే వాహనాలను తనిఖీ చేయరు. చెక్‌పోస్టు లేకపోవడంతో స్మగ్లర్లు గంజాయిని అడ్డూ అదుపు లేకుండా తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్ర సరిహద్దులో జరుగుతున్న స్మగ్లింగ్‌పై ప్రత్యేక కథనం…
సరిహద్దుల్లో పోలీసు చెక్‌పోస్టు మూసివేత..
65వ జాతీయ రహదారి జహీరాబాద్ – బీదర్ రోడ్డుపై గణేశ్‌పూర్ వద్ద పోలీసు చెక్‌పోస్టు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేసేవారు. కొవిడ్‌తోపాటు ఎన్నికల సమయంలో చెక్‌పోస్టు వద్ద తనిఖీలు చేసే వారు. జాతీయ రహదారిపై చిరాగ్పల్లి శివారులో ఉన్న పోలీసు చెక్‌పోస్టు వద్ద ఇద్దరు ఎస్సైలు, కానిస్టేబుళ్లు రాత్రి, పగలు విధుల్లో ఉండేవారు. కానీ, పోలీసు అధికారులు సరిహద్దులో ఉన్న రెండు చెక్‌పోస్టులను మూసివేశారు. అప్పటి నుంచి మహారాష్ట్ర, కర్ణాటక వైపు నుంచి గుట్కాతో పాటు గంజాయి రవాణా పెరిగిపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
65వ జాతీయ రహదారిపై ఎక్సైజ్ చెక్‌పోస్టు..
65వ జాతీయ రహదారిపై ప్రభుత్వం చిరాగ్‌పల్లిలో ఎక్సైజ్ చెక్‌పోస్టును ఏర్పాటు చేసి కర్ణాటక, మహారాష్ట్ర వైపు నుంచి వచ్చే వాహనాల తనిఖీ చేస్తారు. అయితే, తెలంగాణ నుంచి కర్ణాటక, మహారాష్ట్ర వైపు వెళ్లే వాహనాలను తనిఖీ చేసే అనుమతి లేదు. చెక్‌పోస్టు వద్ద ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్సైలు, ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్లు, 9 మంది కానిస్టేబుళ్లు 24 గంటలు పని చేస్తున్నారు. ప్ర భుత్వం తెలంగాణ వైపు నుంచి వెళ్లే వాహనాలను తనిఖీ చేసే అధికారం ఇవ్వకపోవడంతో సిబ్బంది పట్టించుకోవడం లేదు. ఒకవేళ ఏదైనా పక్కా సమాచారం ఉంటేనే ఎక్సైజ్ టాన్స్‌ఫోర్స్ అధికారులు తనిఖీలు చేస్తారు. దీంతో తెలంగాణ వైపు నుంచి రాత్రి, పగలు అనే తేడా లేకుండా గంజాయి తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
కర్ణాటక, మహారాష్ట్ర వైపు నుంచి వచ్చే వాహనాలను తనిఖీ చేస్తాం..
తెలంగాణ సరిహద్దు చిరాగ్‌పల్లిలో 65వ జాతీయ రహదారిపై కర్ణాటక, మహారాష్ట్ర వైపు నుంచి వచ్చే వాహనాలను తనిఖీ చేసేందుకు చెక్‌పోస్టును ఏర్పాటు చేసింది. ఇతర రాష్ర్టాల్లో ఉత్పత్తి చేసిన మద్యాన్ని తెలంగాణ రాష్ట్రంలోకి తీసుకువచ్చే వాహనాలకు అనుమతి ఉందా లేదా అని పరిశీలించి అనుమతి ఇస్తారు. ప్రతి రోజూ 35 నుంచి 38 వరకు మద్యం వాహనాలు రాష్ట్రంలోకి వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేని వాహనాలను సరిహద్దులోనే నిలిపివేస్తాం. తెలంగాణ వైపు నుంచి వెళ్లే వాహనాలకు తనిఖీ చేసే అధికారం ప్రభుత్వం ఇవ్వలేదు. అనుమతి ఇస్తే ఆ వాహనాలను కూడా తనిఖీ చేస్తాం.